కూతురి ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-11T13:24:12+05:30 IST

కూతురి ప్రేమ వివాహం తండ్రి ప్రాణాలను..

కూతురి ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

ఎర్రగుంట్ల(కడప): కూతురి ప్రేమ వివాహం తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్ల శాంతినగర్‌కు చెందిన వారాది ప్రభాకర్‌, దానమ్మల కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్‌ 25న ఆ జంట రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో సీఐ సదాశివయ్య ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ (45) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త ఆత్మహత్యకు పోలీసు వేధింపులే కారణమని భార్య దానమ్మ ఆరోపిస్తోంది.


కుమార్తె ప్రేమవివాహం చేసుకుందన్న బాధలో తాముంటే స్టేషన్‌కు పిలిపించి తనతో పాటు భర్త, కొడుకుని చితకబాదారని వివరించింది. ఆ దెబ్బలకు తాళలేక, అవమానం భరించలేక తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించింది. కాగా, కుమార్తె ప్రేమవివాహం చేసుకుందనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రభాకర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎర్రగుంట్ల అర్బన్‌ సీఐ సదాశివయ్య తెలిపారు. స్టేషన్‌లో తమపై దౌర్జన్యం చేశారని కానిస్టేబుల్‌ చంద్రానాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్‌, దానమ్మ, కుమారునిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


Updated Date - 2020-07-11T13:24:12+05:30 IST