నాలుగులేన్ల రోడ్డుకు మోక్షం

ABN , First Publish Date - 2020-09-25T11:12:14+05:30 IST

ఎర్రగుంట్ల నగరపంచాయతీలో భారీ వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా నాలుగు రోడ్ల కూడలి నుంచి ఏపీజీబీ వరకు రోడ్డు మరీ ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు

నాలుగులేన్ల రోడ్డుకు మోక్షం

12న టెండర్లు

రూ.33కోట్లతో 5.93 కి.మీ రోడ్డు ఏర్పాటు

ఆలంఖాన్‌పల్లె నుంచి విమానాశ్రయం వరకు..

ఎర్రగుంట్లలో జువారీ రైల్వే బ్రిడ్జి నుంచి ఐసీయల్‌ వరకు

 

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 24: ఎర్రగుంట్ల నగరపంచాయతీలో భారీ వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా నాలుగు రోడ్ల కూడలి నుంచి ఏపీజీబీ వరకు రోడ్డు మరీ ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నాలుగు లేన్ల రోడ్డు సాకారం కానుంది. 


రూ.33కోట్లతో 5.93 కిలోమీటర్ల నాలుగులేన్ల రోడ్డును వేయనున్నారు. ఈ మేరకు అక్టోబరు 12న టెండర్లు స్వీకరిస్తామని ఎన్‌హెచ్‌ అధికారులు తెలిపారు. అదే రోజు టెండర్లు తెరిచి ఖరారు చేయనున్నామని పేర్కొన్నారు. కడపలోని ఆలంఖాన్‌పల్లె నుంచి విమానాశ్రయం వరకు, ఎర్రగుంట్ల-కడప రోడ్డులోని జువారీ రైల్వే బ్రిడ్జి నుంచి 50 మీటర్లు వదిలి, సుంకలమ్మ గుడివద్దనున్న వంక బ్రిడ్జికి 50మీటర్ల ఇవతల వరకు ఈ రోడ్డును వేయనున్నట్లు పేర్కొన్నారు. ఎర్రగుంట్ల నగరపంచాయతీ పరిధిలో 2.9 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డు వేయనున్నారు. మొత్తం 30 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డును వేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా 1.5మీటర్లు డ్రైనేజి, విద్యుత్‌ స్తంభాలు కోసం వదలనున్నారు. అలాగే రోడ్డు మధ్యలో 1.5 మీటర్ల వెడల్పుతో డివైడర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఎర్రగుంట్లలోని నాలుగురోడ్ల వద్ద భూసేకరణ చేసి చట్టప్రకారం బాధితులకు డబ్బు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ముద్దనూరు రోడ్డులోని దర్గా, చౌడేశ్వరీ ఆలయం వద్ద కూడా వారితో చర్చించి భూసేకరణ చేయనున్నట్లు సమాచారం. 


35 మీటర్ల వరకు రోడ్డు వేస్తాం:  దీపక్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ ఏఈ 

ఎర్రగుంట్ల నగరపంచాయతీలో ఆర్‌అండ్‌బీకి సంబంధించిన స్థలం ఉంటే 35మీటర్ల వరకు రోడ్డును వేసే అవకాశముంది. అలాగే అతి తక్కువ అంటే 27మీటర్లు వేస్తాం. ఎర్రగుంట్లలో ఇప్పటికే సర్వే పూర్తయింది. ప్రస్తతం విమానాశ్రయం వద్ద సర్వే జరుగుతోంది. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

Updated Date - 2020-09-25T11:12:14+05:30 IST