Abn logo
Oct 11 2021 @ 01:16AM

ఎర్రచీరెలు కట్టుకున్న అమ్మాయిలు

అప్పటి దాకా మంటల ముందు కూర్చొని

తోలు డప్పులను గోరువెచ్చటి సెగకు వేడిచేసి 

శబ్దాన్ని సరిచేసి బిగించిన

ఆ ఎర్రచీరెల అమ్మాయిల గుంపు ఒక్క ఉదుటున

సుడి గాలివలె లేచింది

వాళ్ళ పాదాలకు బిగించి కట్టిన గజ్జెలు ఘల్లు ఘల్లున

ఎగిసిపడే అలల హోరులా గర్జించాయి

ధడ, ధడా, ఖణేల్‌, ఖణేల్న చిర్రెలు తోలు డప్పులను

ముద్దుపెట్టుకుని

నిప్పురవ్వలని నలుదిక్కులా చిమ్మాయి

కాసెబోసి ఎర్రటి చీరెలు కట్టిన ఆ అమ్మాయిల గుంపు

చీకటిగాలిని వాళ్ళ పాటలతో చెదరగొట్టింది

వాళ్ల తలలపై ఎర్రటి నెత్తుటి జెండాలు 

మేఘాలై గొడుగుపట్టాయి

సూర్యుడి కిరణాలు పరుచుకున్న దారి 

మిరుమిట్లు గొలుపుతూ వెలిగింది వాళ్ల ముందు


ఎగసి ఎగసి రాజుకున్న నిప్పు కణికెల పాదాలతో

నిదురిస్తున్న నేలను, ఆకాశాన్ని వాళ్ల డప్పుల మోతలు

తట్టి లేపుతుండగా

ఊరేగింపు ముందు ఆది నాట్యం చేస్తూ 

               వాళ్ళు బయలుదేరారు

ఢమరుకము, త్రిశూలాలూ లేని సృష్టికారక

తొట్టతొలి తల్లి దేవతల వలే, గణ నాయకురాళ్ళ వలె

ఆ ఎర్రచీరెలు కట్టుకున్న అమ్మాయిలు

ఆగ్రహవేశాలతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు


వాళ్ళ వెనుక నడిచారు లెక్కలేనంతమంది స్త్రీలు

ఎర్రటి జెండాలను సమున్నతంగా ఎగురవేస్తూ 

రివ్వున సుడులు తిరుగుతూ వీచే గాలిలో

ఆకాశం నిండా అవి మిడిసిపడే సముద్ర కెరటాలై

తెరలు తెరలుగా ఎగిసిపడ్డాయి


కడుపు నిండా దుఖఃము, కళ్ళ నిండా కలలూ కల

వాళ్ళ చేతుల్లో నిలువెత్తు కర్రలున్నాయి

తుది సమరానికి సిద్ధమైన సైనికులవలె

కదం తొక్కుతూ వేలాదిగా కదిలారు వాళ్ళు

నగరాలు, అధికార పీఠాలు వణికాయి వాళ్ళ ధాటికి


పల్లెలు, పట్టణాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, ఇళ్ళ నుండి 

              బయలుదేరిన ఆ మట్టికాళ్ళ ఆడవాళ్ళు

వాళ్ళు ఎవరంటే -

ఇంటా, బయటా విలువలేని చాకిరీతో అలసిన వాళ్ళు

సంపదలెల్ల కూడబెట్టినా వాటిపై ఇసుమంత 

                   హక్కులేని అనామకులు

శ్రమ ఫలితం ఎన్నడూ దక్కని వాళ్ళు

చిల్లు కానీ కూడా చేతుల్లో లేని బికారి వాళ్ళు

బతుకు పైనా, వాళ్ళదైన దేహం పైనా హక్కులేని వాళ్ళు

బిడ్డల్ని కన్నా చివరికి గర్భంపై వట్టి ప్రసవ చారికలే 

దక్కిన వాళ్ళు

నిలువెల్లా అలసిన వాళ్ళు

పట్టెడు అన్నం మెతుకుల కోసమో, 

కన్నబిడ్డల కోసమో, పరువు కోసమో

మొగుళ్ళకి వొళ్ళు అప్పగించే భార్యలు

తిరస్కారాలు, అవమానాలే ఆభరణాలైన వాళ్ళు

మనహ్‌ శరీరాలు నిత్య గాయాలతో ఛిద్రమైన వాళ్ళు

వంటింటి కుందేళ్లు, పడకటింటి రంభలు

వ్యవసాయకూలీలు, వెట్టివాళ్ళు, కట్టుబానిసలు

మొగుళ్లులేనివాళ్ళు, వున్నా వాళ్ళకి పట్టనివాళ్ళు


దేవుడే మొగుడైనాక, ఊరుమ్మడి ఆస్తి అయినవాళ్ళు

బసవినులు, జోగినులు, దేవదాసీలు

భోగం వాళ్లు, బజారు ఆడవాళ్ళని మొగవాళ్ళు

బొడ్డుకోసి పేరుపెట్టిన వాళ్ళు


శరీరాలకి ఏమాత్రం అంటు లేదంటూ

వాడుకోబడ్డ అంటరాని కులాల ఆడవాళ్లు

అడవిబిడ్డలైన అమాయకపు ఆదివాసులు


ఎక్కడెక్కడో, ఎవరెవరికో తాకట్టు పెట్టబడ్డవాళ్ళు

రేగిన జుట్టు, పగిలిన పాదాల కూలివాళ్ళు

ఎవరికి పుట్టిన బిడ్డలో గానీ తిరస్కృతులై అనాథలై 

      గుండె పగిలి ఒంటరిగా రహస్యంగా ఏడ్చిన వాళ్ళు

లైంగిక బానిసలై పగిలిన గాజుపెంకులపై

నగ్నంగా నాట్యం చేసిన వాళ్ళు

ఎగుమతి దిగుమతుల అమ్మకపు సరుకులైన వాళ్ళు

శరీరాల్ని వీధుల్లో పరిచి గతిలేక బతికినవాళ్ళు


ఆడపిల్లలై భూమిపై పడే ముందుగానే 

             హత్యగావించబడ్డ వాళ్ళు

నిత్య అత్యాచారాలలో చితికిపోయిన అవయవాల వాళ్లు

యాసిడ్‌ దాడులలోనో, వరకట్నపు మంటల్లోనో

మాంసం ఉడికి, సగం సగం కాలిన దేహాల వాళ్ళు


తమపై కత్తి దూసిన మగవాడికి కూడా 

             జన్మనిచ్చిన తల్లులు

అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, వేశ్యలు, అను ఎన్నెన్నో

పేర్ల ముళ్ల కిరీటాల్ని మౌనంగా తలదాల్చిన వాళ్ళు


ఆ పొద్దు నీరెండ ధగధగల్లో రగల్‌ జెండాల్‌ ఎత్తి 

వాళ్ళు ఇక మాకు నీవే దిక్కని వాటిని పట్టుకు

గుక్కపట్టి ఏడ్చిన వాళ్ళు 

కలల రుమాళ్లతో కళ్ళు తుడుచుకు

వెర్రి ఆనందంతో గంతులేస్తూ నవ్వినవాళ్ళు

నగరం వీధులగుండా మహోజ్వలంగా నడిచి వెళ్లిన వాళ్లు

దీనులకు, హీనులకూ నమ్మకాన్ని, ధైర్యాన్ని స్తన్యంగా ఇచ్చి

సగర్వంగా తలలు పైకెత్తిన ధీశాలులు


ఆ ఆడవాళ్లు 

దారిపొడుగునా వాళ్ళ మోటు పాదాలతో

స్త్రీల కష్టభూయిష్ట పోరాటాల జీవన చరిత్రను 

             లిఖిస్తూ గానం చేస్తూ సాగారు


ఊరేగింపు ముగిసాక

వాళ్ళ మొఖాలపై అలసటతో కూడిన చిరునవ్వు

వెన్నెలంత చల్లగా విరిసింది

ఆ రాత్రి వాళ్ళు ఎన్నెన్నో అద్భుతమైన కలలు కన్నారు 

ఏనాడూ లేనంతగా ఎంతో హాయిగా నిదురించారు


అట్లా ఆ దినం వెలిగి 

ఊరేగింపు ముగిసాక

ఎర్రచీరెలు కట్టుకున్న అమ్మాయిల గుంపు

ఎక్కడెక్కడికో చెల్లాచెదరై వెళ్ళిపోయాక

మళ్లీ అలాంటి ఊరేగింపు ఎన్నడూ జరగలేదు

అనేక దినాలు, ఋతువులు, సంవత్సరాలూ

బండ రాళ్లవలె కాలం గుండెల మీద నుండి దొర్లాక

ఎన్నెన్నో జరిగిపోయిన మరికొంత కాలానికి

అవ్వాళ్ళ వాళ్ళతో పాటూ వీధుల్లోకి వచ్చిన ఆడవాళ్ళలో

కొందరు అట్లా వచ్చినందుకు దారుణంగా చంపబడ్డారు

మరికొందరు సాయుధులై 

దుర్గమారణ్యాల లోలోపలికి నడచి వెళ్లారు

వాళ్ళు ఇంకా ఎర్రటి జెండల్ని పట్టుకుని 

              పోరాడుతూనే వున్నారు


మరి కొందరు ఏమీ మారలేదని నిరాశతో వెనుతిరిగారు

ఇంకా అనేకులు ఎప్పటివలెనే వారివారికి 

ఇవ్వబడిన పేర్ల శిలువలను శిరస్సును ధరించి

మరింత అణకువగా పురుగుల వలే

నేలకు కరుచుకుని జీవించారు


ఎర్ర చీరలు కట్టుకున్న అమ్మాయిల గుంపు కోసం

వెతుకుతున్నప్పుడు రాలిన మువ్వ ఒకటి దొర్లుకుంటూ 

       దారి వెంట ఎటో పరుగుపెడుతూ అగపడింది

అదిగో ఆ వంటి నిట్రాడు గుడిసెలో పొగజూరిన గోడలకి

విరిగిన డప్పు ఒకటి వేలాడుతూ ఉంది

ఆ పక్కనే మువ్వలు రాలి మూగవోయిన గజ్జెలు 

నిశ్శబ్దంలో మునిగి మరణించాయి


అవ్వాల్టి ఊరేగింపులో నాట్యం చేసిందే, 

        ఆ అమ్మాయి ఒకతి ముసలిదై

తన మనవరాలి కోసం వెలసిన ఆ ఎర్ర చీరెనే వాసానికి

ఉయ్యాలగా కట్టింది

దానిలో చేతులకి నల్లటి పూసలు, బుగ్గన నల్లటి చుక్కా 

     పెట్టుకున్న ఒక చిన్నపిల్ల అమాయకంగా 

     నవ్వుతూ చూస్తోంది ఆకాశం కేసి 


అక్కడ ఆ పిల్లకి అమ్మమ్మ ఊరేగింపులో చేసిన

అగ్నినృత్యం కనపడుతూ ఉందా?

‘‘ఏమి మారింది? ఏమీ మారలేదు’’

అని ముదుసలి అమ్మమ్మ పాడే దిగులు పాట 

                          వినపడుతుందా?


ఆనాటి ఎర్రచీరెలు కట్టుకున్న అమ్మాయిల గుంపులో కొందరు

ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చాక

తమ పిల్లలకూ, మనవరాళ్లకూ

మహోజ్వలంగా వెలిగిన తమ గడచిన దినాల గురించి

ఎన్నడన్నా చెప్పారా?

వాళ్ళు కట్టుకున్న ఎర్ర చీరలు భద్రంగా దాచి ఉంచారా?

అవి వెలసి మాసిన మసిబట్టలు అయ్యాయా?

లేదా వాళ్ళ మరణాంతరం వాళ్లపై కప్పబడ్డాయా? 

ఆ ఎర్ర చీరెలు కట్టుకున్న అమ్మాయిల ఊరేగింపు 

ఆగి, ఆగి, మళ్లీ మళ్లీ బయలు దేరుతూనే ఉందా?

పోరాటం ఎన్నడూ ఆపని ఆడవాళ్ళ నవ్వులు

వెన్నెలై అక్కడ ఇంకా వెలుగుతూనే ఉన్నాయా?

చిట్టితల్లీ నీకు ఏమి కనపడుతుంది ఇప్పుడు?

విమల

ప్రత్యేకం మరిన్ని...