అభివృద్ధిని పరుగులు పెట్టించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

అభివృద్ధిని పరుగులు పెట్టించాలి

అభివృద్ధిని పరుగులు పెట్టించాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మండలంలో అభివృద్ధి పనులపై సమీక్ష


పర్వతగిరి, జనవరి 22: జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషిచేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పర్వతగిరి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమే్‌షతో కలిసి ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రూర్బన్‌ పథకం ద్వారా పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు కార్యాలయాల భవనాలు నిర్మిస్తామని తెలిపారు.

 అనంతరం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని, నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్రంలో అన్ని మండలాల కన్నా పర్వతగిరికి ఎక్కువ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ.. నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు, డీపీవో స్వరూప, డీఈవో వాసంతి, విద్యుత్‌ ఏడీఈ చంద్రమౌళి, ఎంపీడీవో సంతోష్‌ కుమార్‌, జడ్పీటీసీ సింగులాల్‌, వైస్‌ఎంపీపీ రాజేశ్వర్‌రావు, ఏఎంసీ డైరెక్టర్‌ ఏకాంతంగౌడ్‌, సొసైటీ చైర్మన్‌ మనోజ్‌గౌడ్‌, జిల్లా, మండల కోఆప్షన్‌ మెంబర్లు సర్వర్‌, షబ్బీర్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST