జనగామ: రాష్ట్రంలో మార్చి నెల నుంచి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. విడతల వారీగా అమలు చేస్తూ రానున్న మూడేళ్లలో ప్రతీ దళిత కుటుంబానికి ఫలాలు అందేలా చూస్తామన్నారు. దళితబంధు పథకం అమలు, ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్, పంట నష్టం వంటి అంశాలపై జనగామ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకులతో సంబంధం లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రూ. 10 లక్షలు వేస్తామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఈ పథకాన్ని అమలు చేస్తామని దయాకర్‌రావు తెలిపారు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. దళితబంధు అమలు కోసం ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని, సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆ కమిటీ పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఫీవర్ సర్వేను మరింత పకడ్బందీగా చేపట్టాలని దయాకర్‌రావు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి