ఓడిపోతే రాజకీయ సన్యాసం

ABN , First Publish Date - 2022-08-08T05:52:46+05:30 IST

ఓడిపోతే రాజకీయ సన్యాసం

ఓడిపోతే రాజకీయ సన్యాసం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు

‘తూర్పు’ నుంచే పోటీ చేస్తా..

2014, 2018లో టికెట్‌ ఇస్తానని మోసం 

ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్‌, కేటీఆర్‌ మాట తప్పారు..

విలేకరుల సమావేశంలో ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు 

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా లేఖ విడుదల 

వరంగల్‌టౌన్‌,  ఆగస్టు 7: టీఆర్‌ఎస్‌  అభ్యర్థుల గెలుపు కోసం 2014తోపాటు, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేశానని, కాదని అనుకుంటే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన ప్రదీ్‌పరావు, ఆదివారం ఓసిటీలో ని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ  అధినేత చిరంజీవి పిలుపు మేరకు ప్రజా సేవ చేయాలని ఆ పార్టీలో చేరానన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓడిపోయానన్నారు. ఆ తరువాత తెలంగాణ నిర్మాణ సమితి (టీఎన్‌ఎ్‌స)పార్టీని స్థాపించి స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ జయశంక ర్‌ సార్‌ పిలుపు మేరకు  ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించానన్నారు. 

టికెట్‌ ఇస్తానని పార్టీ మాట తప్పింది...

టికెట్‌ ఇస్తామని చెప్పిపార్టీ 2014లో కొండా సురేఖకు ఇచ్చిం దని, 2018లో కూడా ఇవ్వకుండా నరేందర్‌కు ఇచ్చిందన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పిలుచుకుని తప్పకుండా ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చి మరోసారి మాట తప్పారన్నారు. అలాగే 2016లో, 2021లోగ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్ని కల్లో తన వాళ్లకు కనీసం కార్పొరేటర్‌ టికెట్లు కూడా ఇవ్వలేదని వాపోయారు.  అయినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లామన్నారు. 

ఎనిమిదేళ్లలో పార్టీలో దక్కని గౌరవం..

గత ఎనిమిది సంవత్సరాల్లో పార్టీలో తనకుగానీ, తన వాళ్లకు గానీ కనీస గౌరవ దక్కలేదని ప్రదీ్‌పరావు వాపోయారు. పైపెచ్చు తన వాళ్లపై పోలీసు కేసులు నమోదు చేయించే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ.. ఇచ్చిన హామీలు మరిచిపోయిందన్నారు. 

అందుకే కనీస గౌరవం లేని దగ్గర ఆత్మాభిమానం చంపుకుని ఉండలేమని, అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నామని రాజీనామా లేఖ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. 

వరంగల్‌ తూర్పు నుంచే పోటీ చేస్తా...

అభిమానులు, కార్యకర్తలు, నాయకుల సూచన మేరకు రానున్న ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రదీ్‌పరావు స్పష్టం చేశారు. పార్టీ ఏదైనా, గుర్తు ఏమైనా పోటీ చేయడం ఖాయమన్నారు. 12 ఏళ్లుగా నియోజకవర్గ తనను గమనిస్తున్నారని, తనేంటో వారికి తెలుసునని పేర్కొన్నారు.

10లోపు రాజీనామా చేసి ప్రజాదర్బార్‌లోకి రావాలి.. 

‘నేను ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా.. నా శ్రమ, కృషి లేకుండానే ‘తూర్పు’లో గెలిచానని చెప్పుకుంటున్న వారు  ఈనెల 10 లోపు రాజీనామా చేసి ప్రజా దర్బార్‌లోకి రావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా...’ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు.  తనను నమ్ముకుని చాలా మంది ఉన్నారని, తన వాళ్లను ఆదరించి, అవకాశాలిచ్చే పార్టీలోనే చేరుతామని ప్రదీ్‌పరావు స్పష్టం చేశారు.


Updated Date - 2022-08-08T05:52:46+05:30 IST