Eps సన్నిహితులపై It పంజా

ABN , First Publish Date - 2022-07-21T16:26:18+05:30 IST

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎ్‌స)కి సన్నిహితుడైన కాంట్రాక్టర్‌ మురుగపెరుమాళ్‌ ఇల్లు, కార్యాలయం సహా 20 ప్రాంతాల్లో

Eps సన్నిహితులపై It పంజా

                                  - కీలక పత్రాలు స్వాధీనం 


పెరంబూర్‌, జూలై 20: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎ్‌స)కి సన్నిహితుడైన కాంట్రాక్టర్‌ మురుగపెరుమాళ్‌ ఇల్లు, కార్యాలయం సహా 20 ప్రాంతాల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక సింగపెరుమాళ్‌ ఆలయం, కూవత్తూర్‌, మదురై, దిండుగల్‌ జిల్లాల్లో ప్రైవేటు రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లు కలిపి మొత్తం 30 చోట్ల ఒకే సమయంలో ఐటీ అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిసింది. దిండుగల్‌ జిల్లా నత్తం సమీపంలోని కొసుకుర్చి గ్రామానికి చెందిన రాము కుమారులు మురుగపెరుమాళ్‌, శరవణపెరుమాళ్‌ ఆదిలో చిన్న కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండేవారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వంలో ప్రజాపనులు, రహదారుల శాఖ మంత్రిగా వున్న ఈపీఎ్‌సతో పరిచయం ఏర్పడిన అనంతరం వీరు ఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట సంస్థ ప్రారంభించి రోడ్ల కాంట్రాక్టులు చేపట్టినట్లు తెలిసింది. ఈపీఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టారు. తంజావూరు, పళని, దిండుగల్‌ తదితర జాతీయ రహదారుల్లో రోడ్లు, మరమ్మతుపనులకు సంబంధించి సుమారు రూ.2 వేల కోట్ల ప్రాజెక్ట్‌లు వీరు చేపట్టారు. అలాగే, చెంగల్పట్టు నుంచి కాంచీపురం వరకు రూ.448.645 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్‌ పొందారు. ఇక, తిరుపోరూర్‌ నుంచి మహాబలిపురం, పాత మహాబలిపురం రోడ్ల పనులు కూడా వీరి సంస్థే దక్కించుకుంది. సేలం, దిండుగల్‌ ప్రాంతాల్లో  2011 నుంచి 2021 వరకు సుమారు రూ.10 వేల కోట్ల రహదారులు, ప్రజాపనుల శాఖల్లో కాంట్రాక్టులు పొందారు. ఈ సంస్థకు మదురై, దిండుగల్‌, తంజావూరు, చెన్నై, చెంగల్పట్టు, సేలం, కోయంబత్తూర్‌ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలున్నాయి. అలాగే, నత్తం, తూవరంకురిచ్చి ప్రాంతా ల్లో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టారు. మదురై అన్నానగర్‌, అవనియాపురం, సిలైమాన్‌ తదితర ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్లు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలకు సంబంధించి ఉపకరణాల కొనుగోలు, అపార్ట్‌మెంట్‌ విక్రయాల్లో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి. పన్ను చెల్లింపునకు సంబంధించిన దస్తావేజులు కూడా సదరు సంస్థ ఆదాయపు పన్ను శాఖకు సక్రమంగా సమర్పించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, బుధవారం ఐటీ అధికారులు ఆ సంస్థకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 30 ప్రాంతాల్లో తనిఖీలు చేయగా, కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇదిలా వుండగా ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న విభేధాల నేపథ్యంలో, ఎడప్పాడి సన్నిహితులపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించిందా అంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

Updated Date - 2022-07-21T16:26:18+05:30 IST