మనోవేదనలో ఇపిఎస్‌ పెన్షనర్లు

ABN , First Publish Date - 2020-09-16T05:38:50+05:30 IST

ప్రైవేటు సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, కార్మికులకు పింఛను సౌకర్యం కల్పించాలని తలచి కేంద్ర ప్రభుత్వం 1995 నవంబరులో ఎంప్లాయీస్‌...

మనోవేదనలో ఇపిఎస్‌ పెన్షనర్లు

ఇపిఎస్‌ -95 పెన్షన్‌ స్కీం మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంది. దాదాపు 65 లక్ష మంది పెన్షనర్లు తమ వేతనాలు, సర్వీసుననుసరించి రూ.500 నుంచి మూడు వేల రూపాయల పింఛను మాత్రమే అందుకుంటున్నారు! వీరికి కనీస పింఛను 7500 రూపాయలు, దానికి కరువు భత్యాన్ని జోడించి ఇవ్వడం ప్రభుత్వ మానవతా ధర్మం.


ప్రైవేటు సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, కార్మికులకు పింఛను సౌకర్యం కల్పించాలని తలచి కేంద్ర ప్రభుత్వం 1995 నవంబరులో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇపిఎస్‌ -95) ప్రవేశపెట్టింది. ఈ ప్రయోజనం వల్ల ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, కార్మికులకు భవిష్యత్తులో కలిగే బహుళ ప్రయోజనాన్ని ఊహించి అప్పట్లో అందరూ చాలా సంతోషించారు. అయితే ప్రస్తుత జీవన ప్రమాణాలతో ఈ పింఛన్‌ ఏమాత్రం సరిపోక వయోవృద్ధులైన పెన్షనర్లు దారిద్య్రంతో అలమటిస్తున్నారు. 


ఈ స్కీములో ఎన్నో లోపాలు, లొసుగులు ఉన్నాయి. తత్ఫలితంగా పెన్షనర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. స్కీంను ప్రవేశపెట్టిన నాటి నుంచి పరిస్థితి ఇలానే ఉన్నది. దానికి ప్రబల ఉదాహరణ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పులో ఉద్యోగి పెన్షన్‌ లెక్కించడానికి వారి సరాసరి చివరి 12 నెలల బేసిక్‌, డిఎ వేతనాన్ని పరిగణించాలే తప్ప ఇ.పి.ఎఫ్‌.ఓ నిర్ణయించబడిన పరిమితి కాదు అని స్పష్టంగా చెప్పింది. దీనికి ముందు అమల్లో ఉన్న ఫ్యామిలీ పెన్షన్‌ స్కీం-1971ను ఇపిఎస్‌–-95లో విలీనం చేశారు. అయితే 1971–-1995 స్కీముల మధ్యకాలంలో ఉద్యోగంలో ప్రవేశించిన వారికి రెండింటి మధ్యకాలాన్ని కూడా పెన్షనబుల్‌ సర్వీసుగా పరిగణించి దానిని కూడ లెక్కలోకి తీసుకుని ఆ ప్రకారం పెన్షన్‌ నిర్ధారణ చేయాలి. కాని అలా జరగలేదు. ప్రైవేటు కంపెనీలో 30 సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగి (1978–-2008) 10వేల రూపాయల జీతంతో పదవీ విరమణ అనంతరం 1760 రూపాయలు పెన్షన్‌ పొందుతున్నాడు. పదవీ విరమణ పొందిన 12 సంవత్సరాల తరువాత కూడా అంతే మొత్తాన్ని పొందుతున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించిన ఒక సామాన్య ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి చివరి జీతం 13వేల రూపాయలతో ఉద్యోగ విరమణ చేసినా కాల క్రమంలో లబ్ధి పొందగలుగుతున్నాడు. సదరు విశ్రాంత ప్రభుత్వోద్యోగి 12 సంవత్సరాల తరువాత 25 నుంచి 30 వేల రూపాయల మేరకు పెన్షన్‌ పొందగలుగుతున్నాడు. ఇటువంటి లబ్ధి ఇపిఎస్ -95 పెన్షనర్కు లభించడం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఇపిఎస్‌–-95 పెన్షనరుకు పే రివిజన్‌, కరువుభత్యం కలపకపోవడమే.


1996లో పెన్షన్‌ ఫండ్‌ బాధ్యతలు నిర్వహించే సంస్థ (ఇపిఎఫ్‌) లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తర్వాత అత్యధిక టర్నోవర్‌ కలిగిన బ్యాంకింగేతర వ్యవస్థ, కార్మిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ. ఒక జర్నల్‌లో ప్రభుత్వ ఉద్యోగి పొందగలిగే పెన్షన్‌ కంటే 10 శాతం అదనంగా లాభించే విధంగా ఉండగలదని ఒక ప్రకటన ఇచ్చారు. దురదృష్టం ఏమిటంటే ఇపిఎస్‌– -95 పెన్షన్‌ స్కీం ప్రవేశపెట్టినప్పుడు వారికి లభించే పెన్షన్‌ను మూడు సంవత్సరాలకొకసారి గానీ, లేకపోతే అంతకుముందుగానీ సవరణలు చేయగలమని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా విన్నవించుకోవడం జరిగింది. కాని ఆ ప్రయోజనానికి పెన్షనర్లు నోచుకోలేకపోయారు.


2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భగతసింగ్‌ కోశియార్‌ కమిటీ నియమించబడింది. అది కనీస పింఛను మూడు వేల రూపాయలుగా నిర్ధారించి దానికి కరువుభత్యాన్ని కూడా కలపాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందుకనుగుణంగా అప్పటి ప్రతిపక్ష రాజ్యసభ సభ్యుడు ప్రకాష్‌ జావదేకర్‌ ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల వ్యవధిలో కనీస పింఛను 3000 రూపాయలుగా చేసి, దానికి కరువుభత్యాన్ని కూడా కలుపుతామని హామీ ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. ఆ తర్వాత 2018లో హై ఎంపవర్‌డ్‌ కమిటీని ఎన్‌డిఎ ప్రభుత్వం నియమించి మూడు నెలల వ్యవధిలో నివేదిక సమర్పించమని కోరగా, ఆ కమిటీ ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో కార్మికులకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ఆ నివేదికను సమగ్రంగా పరిశీలిస్తే ప్రభుత్వ పక్షాన ఇచ్చినట్టుగా ఉంది.


ఇటీవలి కాలంలో చిన్న చిన్న షాపులు నడుపుకునే వ్యక్తులకు, ఇతరత్రా వృత్తులలో ఉన్నవారికి, ప్రభుత్వం పిఎంఎస్‌వైఎంవై పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇపిఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించేవారు ఈ పథకానికి మినహాయింపు. పిఎంఎస్‌వైఎంవై పథకంలో చేరిన వ్యక్తి నెలకు 100 రూపాయల నుంచి కంట్రిబ్యూషన్‌ చెల్లిస్తే 30 సంవత్సరాల తరువాత మూడు వేల రూపాయలు పింఛను పొందుతాడు అని స్కీములో పొందుపరిచారు. అయితే ఇపిఎస్‌ పెన్షనరు నెలకు 541 రూపాయలు పెన్షన్‌ ఫండ్‌కు జమచేస్తే 30 సంవత్సరాలు, ఆ పైబడి పదవీ విరమణ అనంతరం లభించే పింఛను ఎంత ఉండాలి?


బండారు దత్తాత్రేయ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇపిఎస్‌–-95 పెన్షనర్లు ఆయనకు సన్మానం చేశారు. ఆ సందర్భంలో, పెన్షనబుల్‌ సర్వీసును అలావుంచి ఇపిఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లింపు ఆధారంగా దానిని మూడు తరగతులుగా విభజించే ఆలోచనలో ఉన్నట్టు దత్తాత్రేయ చెప్పారు. 30 సంవత్సరాలు, ఆ పైబడిన కాలానికి పిఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించిన వారికి అధికంగా 6500 రూపాయలు, 20 సంవత్సరాల పైబడి చెల్లించిన వారికి దానికి సమానమైన నిష్పత్తిలోనూ, అదేవిధంగా 10 సంవత్సరాల పైబడి కంట్రిబ్యూషన్‌ చెల్లించిన కనీస పింఛను ఇవ్వాలన్నది ఆ ఆలోచన. ఆ తర్వాత ఎక్కడా దాని ప్రస్తావనే లేదు.


కనీస పింఛను వెయ్యి నుంచి 7500 రూపాయల వరకు పెంచాలని దానికి కరువు భత్యాన్ని కూడా కలపాలని లోక్‌సభ, రాజ్యసభలలో సభ్యులు ఎన్‌డిఎ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. అదేవిధంగా కార్మిక సంఘాలు, కార్మికుల తరఫున వారి న్యాయమైన హక్కులకై దీర్ఘకాలంగా శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇతర సంఘాలు కూడా ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. మధుర పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి హేమమాలిని ఇతర సంఘాల నాయకులతో ప్రధానమంత్రిని కలుసుకుని ఇపిఎస్–95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, కనీస పింఛను 7500 రూపాయలు, దానికి కరువుభత్యాన్ని కూడా అనుసంధానం చేయాలని విన్నవించారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.


ఇపిఎస్‌-–95 పెన్షన్‌ స్కీం, సాంఘిక భద్రత కల్పించకుండా మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంది. 30 సంవత్సరాల పైబడి ప్రైవేట్‌ సెక్టారులో పనిచేసి దేశ పురోభివృద్ధికి స్వేదాన్ని చిందించిన వయోవృద్ధులైన దాదాపు 65 లక్ష మంది పెన్షనర్లు తమ వేతనాలు, సర్వీసుననుసరించి రూ.500 నుంచి మూడు వేల రూపాయల పింఛను మాత్రమే అందుకుంటున్నారు! ఉమ్మడి కుటుంబాల నుంచి దూరమైన ఈ పరిస్థితుల్లో రెండు పూటలా కడుపునిండా తినడానికి నోచుకోలేక, వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక 70 సంవత్సరాలు పైబడిన వారు నిరాశా నిస్పృహలతో కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇకనైనా కేంద్రప్రభుత్వం స్పందించి ఇపిఎస్‌ పెన్షనర్లకు కనీస పింఛను 7500 రూపాయలు, దానికి కరువు భత్యాన్ని జోడించి ఇవ్వాలని, తద్వారా వారు సంఘంలో గౌరవంగా జీవించే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాం.

కొల్లిపర శ్రీనివాసరావు

Updated Date - 2020-09-16T05:38:50+05:30 IST