ఓపీఎస్‌-ఈపీఎస్‌ ప్రత్యేక భేటీ

ABN , First Publish Date - 2022-03-09T13:10:34+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అన్నా డీఎంకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి సమక్షంలో

ఓపీఎస్‌-ఈపీఎస్‌ ప్రత్యేక భేటీ

- కుమ్ములాటలపై చర్చ? 

- అన్నాడీఎంకే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు


అడయార్‌(చెన్నై): అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అన్నా డీఎంకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి భారీ కేక్‌ కట్‌ చేసి మహిళా నిర్వాహకులకు తినిపించారు. అంతకు ముందు వారిద్దరు పార్టీ వ్యవ స్థాపకుడు దివంగత ఎంజీఆర్‌, దివంగత జయలలిత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తరువాత ఎంపిక చేసిన పదిమంది పేదలకు కుట్టుమిషన్లు, 500 మందికి డిన్నర్‌ సెట్లు, వెయ్యి మందికి గిఫ్టు బాక్సులు, మరో వెయ్యి మందికి పట్టు చీరలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తమిళ్‌మగన్‌ హుసేన్‌, పొన్నయ్యన్‌, కేపీ మునుస్వామి, ఎస్‌పీ వేలుమణి, బెంజిమిన్‌, గోకుల ఇందిర, మనోజ్‌ పాండ్యన్‌, టి.నగర్‌ సత్య, వైగై రవి, వేళచ్చేరి అశోక్‌, వెంకటేష్‌ బాబు పాల్గొన్నారు. 


ప్రత్యేక భేటీ! : కాగా నిన్నమొన్నటి వరకు ఎడమొహం పెడ మొహంగా ఉన్న ఈపీఎస్‌, ఓపీఎస్‌లు మహిళా దినోత్సవం సందర్భంగా ఒకే వేదికపై కనిపించడం, అదికూడా ఇద్దరూ కలిసి సరదా గా మాట్లాడుకోవడం కనిపించింది. ముఖ్యంగా శశికళను తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంలో వీరిద్దరి వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓపీఎస్‌ సోదరుడు రాజా ఇటీవల శశికళ గూటికి చేరడాన్ని ఈపీఎస్‌ వర్గం ఏమాత్రం జీర్ణించు కోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా జరిగిన వీరిద్దరి సమావేశంపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. 

Updated Date - 2022-03-09T13:10:34+05:30 IST