ఎప్పటి రాంజీ గోండు ఎక్కడి రజాకార్లు!

ABN , First Publish Date - 2021-09-16T06:17:03+05:30 IST

సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని బిజెపి దాని అనుబంధ సంస్థలు తెలంగాణలో హడావిడి చేయటం పరిపాటిగా మారింది. ఈసారి ఇదే తారీఖున నిర్మల్‌ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి ప్రాంగణంలో ఆ పార్టీ....

ఎప్పటి రాంజీ గోండు ఎక్కడి రజాకార్లు!

సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని బిజెపి దాని అనుబంధ సంస్థలు తెలంగాణలో హడావిడి చేయటం పరిపాటిగా మారింది. ఈసారి ఇదే తారీఖున నిర్మల్‌ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి ప్రాంగణంలో ఆ పార్టీ. భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సభ సాక్షిగా బిజెపి తెలంగాణలో ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. సభ నిర్వహించ తలపెట్టిన వెయ్యి ఊడల మర్రి ప్రాంగణంలో రజాకార్లు వెయ్యి మంది హిందువులను ఉరితీశారనేదే ఆ విష ప్రచారం దీనికంటే దుర్మార్గమైన చరిత్ర వక్రీకరణ మరొకటి ఉండదు.


రాజకీయ దురుద్దేశంతోనే ఈ సభను నిర్మల్‌లో నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. ఈ సభ వెనుక రెండు ఉద్దేశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి మైనారిటీల పట్ల వ్యతిరేక భావజాలాన్ని ఆదివాసుల్లో బలంగా తీసుకుపోవటం; రెండవది, తెలంగాణలో తమ పార్టీ ఆధిక్యత మొదలైందనే సంకేతాన్నివ్వడం. మొదటి విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో ఆదివాసులు ప్రధానమైన సామాజిక వర్గం. అనేక నియోజకవర్గాల్లో ప్రధాన ఓటర్లుగా ఉన్నారు. బిజెప వీళ్లలో తమ భావజాలాన్ని బలంగా నాటి రాజకీయంగా బలపడాలని బిజెపి చూస్తోంది. ఆ పార్టీ పుట్టుక, దాని పెరుగుదల మైనారిటీ వ్యతిరేక భావజాలం మీదనే నిర్మితమైందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడానికి అనేక చారిత్రక, పౌరాణిక సంఘటనలను వాడుకుంటూ వస్తున్నది.


నిర్మల్‌ పట్టణం కాకతీయ కాలం నుంచి తెలంగాణకు ఉత్తరాది గేటుగా ఉంటూ వచ్చింది. అందుకే ఈ పట్టణంలో అనేక పురాతన కోటలు మనకు దర్శనమిస్తాయి. 18వ శతాబ్దంలో ఫ్రెంచివారు నిర్మించిన శామ్‌గర్‌ కోట ఇక్కడ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. గుప్తుల కాలం నుంచి కేంద్ర సైన్యం వరకు తెలంగాణపై చేసిన దాడులు ఈ ప్రాంతం మీదుగానే జరిగాయి. ఉత్తరాది సైన్యాలు దక్కనుకు వచ్చే ఈ దారిని చరిత్రలో ‘దండు బాట’ (సైనికుల బాట) అని అంటారు. అందుకే తెలంగాణ పాలకులు అదిలాబాద్‌లోని నిర్మల్‌లో, నిజామాబాద్‌లోని కౌలాస్‌లో బలమైన కోటలను నిర్మించారు. ఈ కోటలు తెలంగాణపై సుల్తాను, మొగలు, మరాఠా సైన్యాలు చేసిన దాడులను అనేకమార్లు విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఆ విధంగా నిర్మల్‌కు రాజకీయంగా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిర్మల్‌ మీద దాడి అంటే అది తెలంగాణ మీద దాడికి శంఖారావం అని గుర్తించాలి.


ఆదివాసులనే ప్రధానంగా టార్గెట్‌ చేస్తూ నిర్మల్‌లో బిజెపి సభను నిర్వహిస్తోంది. ఈ పట్టణ ప్రాంతంలో ఇప్పుడు ఆదివాసులు లేరు. కాని వారి చరిత్ర ఆనవాళ్లు ఇంకా అక్కడ మిగిలే ఉన్నాయి. ఈ ప్రాంతమంతా గోండుల ఆధిపత్యంలో ఉండేది. నిర్మల్‌ బస్‌స్టేషన్‌కు ఎదురుగా పాడుబడ్డ గోండురాజుల కోటనే అందుకు నిదర్శనం. నిజామాబాద్‌, కరీంనగర్‌ నుంచి వచ్చిన వలసలు ఆదివాసులను క్రమంగా కినవత్‌, ఉట్నూర్‌ ప్రాంతానికి నెట్టివేశాయి.


అయితే గోండులు రాంజీగోండు నాయకత్వంలో 1850 దశకంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని నడిపించారు. ఈ పోరాటం 1857 సైనిక తిరుగుబాటులో భాగంగా జరిగింది. పీష్వా నానాసాహెబ్‌, అతని సైన్యాధికారి తాంతియ తోపే నాయకత్వంలో దక్కన్‌లో 1857 తిరుగుబాటు జరిగింది. తాంతియ తోపే–గోండు, రొహిల్లాస్‌, దక్కనీస్‌ (అరబ్బులు)తో దండుకట్టి నిజాం ప్రాంతాల మీద దాడి చేశాడు. నిజాం రాజులు పీష్వాలను అణచివేయడంలో బ్రిటిష్‌ వారికి సహాయపడడమే అందుకు కారణం. రోహిల్లాలు తమను తాము నానాసాహెబ్‌ అనుచరులమని ప్రకటించుకుని బ్రిటిష్‌, నిజాం ప్రాంతాల మీద దాడులు చేస్తూండేవారు. రొహిల్లాలు మొగలు, మరాఠా సైన్యంలో కిందిస్థాయి ముస్లిం సైనికులు. మొగలు మరాఠా సామ్రాజ్యాల పతనానంతరం వాళ్లు లోకల్‌ జమీందార్లు, రాజులతో దండుకట్టి దాడులు చేస్తూ ఉండేవారు.


అసలు నిర్మల్‌లో ఏం జరిగింది. ఏప్రిల్‌ 9, 1860 నాడు నిర్మల్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలో 300 మంది గోండులు, 200 మంది రొహిల్లాలు రాంజీగోండ్‌ నాయకత్వంలో సమావేశమయ్యారని నిర్మల్‌ కలెక్టర్‌కు సమాచారం అందింది. కలెక్టరు సైన్యంతో వెళ్లి ఆ సమావేశ స్థలిపై దాడి చేయించాడు. ఈ సంఘటనలో ఇరువైపులా చాలామంది చనిపోయారు. 30 మంది గోండు, రొహిల్లాల శవాలు దొరికాయి. రాంజీగోండు ప్రాణాలతో తప్పించుకున్నాడు. కానీ రొహిల్లా నాయకుడు మియా సాహెబ్‌ కుర్ద్‌ ఈ దాడిలో చనిపోయాడు. చాలామంది గోండులు, రొహిల్లాలు సైన్యానికి పట్టుబడ్డారు. వారిని సమీప మర్రిచెట్టుకు కట్టి కాల్చి చంపాలని సైన్యం భావించింది. కాని ఇది సైన్యంలో ఉన్న రొహిల్లాల మనోభావాలను దెబ్బతీస్తుందని భావించి, ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే ప్రజలు వెయ్యి ఊడల మర్రిచెట్టుకు వెయ్యిమంది గోండులను ఉరితీశారని గాథలుగా చెప్పుకుంటారు.


రొహిల్లాలు, గోండులతో రాంజీగోండు దండుకట్టి నిర్మల్‌ కేంద్రంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు బ్రిటిష్‌, నిజాం సైన్యాలతో పోరాటం చేశాడు. చివరకు బ్రిటిష్‌ సైన్యాధికారి కల్నల్‌ రాబర్ట్‌ నాయకత్వంలోని సైన్యానికి పట్టుబడి 1860 సెప్టెంబరులో చంపబడ్డాడు. దురదృష్టవశాత్తూ గోండుల వీరోచితమైన చరిత్ర బయటికి రాలేదు. కానీ, సైనిక తిరుగుబాటు కాలంలో దక్కన్‌లో వారు నిర్వహించిన పోరాటం వారి రాజకీయ పరిణతిని చాటుతోంది. చివరి మరాఠా యుద్ధం తరువాత బ్రిటిష్‌ సైన్యం ఆదివాసులనే టార్గెట్‌ చేస్తూ దక్కన్‌ అడవుల్లోకి విస్తరించింది. గోండు రాజులు– జమీందార్లు, రోహిల్లాలతో దండుకట్టి బ్రిటిష్‌ సైన్యాన్ని వీరోచితంగా ఎదిరించారు.


మహరాష్ట్రలోని అహిరి జమీందారిలోని గోండుల పోరాటం ఆదిలాబాద్‌ గోండుల తిరుగుబాటుకు ఊతమిచ్చింది. ఈ ప్రాంత గోండు జమీందార్లు, బాబురావు, వెంకటరావు బ్రిటిష్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఇంకా మనకు తెలియని విషయం ఏమంటే, 17 జూలై 1857న హైదరాబాద్‌ రెసిడెన్సీపై దాడి చేసిన రొహిల్లా తూరేబాజ్‌ ఖాన్‌ (తురుమ్‌ ఖాన్‌) బాబురావు అనుచరుడు. అతడికి, అతడి అనుచరులకు బాబురావు నెలసరి జీతాలు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్‌ రెసిడెన్సీపై రొహిల్లాల దాడికి గోండులు సహాయపడడం వారి రాజకీయ చైతన్యానికి నిదర్శనం.


అప్పటి రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌ ఈ దాడిని ఒక ముస్లిం మతతత్వ దాడిగా చిత్రీకరించాడు. ఈ రోజు ఆ తిరుగుబాటును రజాకార్ల దాడిగా చిత్రించి ప్రజల పోరాటాలను పాతర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజలు హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ఐక్యంగా బ్రిటిష్‌ వలసవాద పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అసలు గోండుల తిరుగుబాటుకు, రజాకార్లకు ఎటువంటి సంబంధం లేదు. చరిత్రను వక్రీకరించి 1850 దశకంలో జరిగిన సంఘటనలను 1940 దశకంలో జరిగిన సంఘటనలుగా చిత్రీకరించి ఒక విష్రపచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే ప్రజల చరిత్ర, ప్రజలది కాకుండా పోయే ప్రమాదం ఉంది.

ప్రొ. భంగ్యా భూక్యా

యూనివర్సిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌

Updated Date - 2021-09-16T06:17:03+05:30 IST