మహమ్మారి ముట్టడిలో నెగ్గేదెలా?

ABN , First Publish Date - 2020-03-19T08:48:30+05:30 IST

కొత్తకరోనా వైరస్ (కొవిడ్ -19) భయానక వేగంతో దేశ దేశాల్లో వ్యాపిస్తూ జనులను జడిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా అంటువ్యాధిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించకముందే ఈ విశ్వమారి పర్యవసానాలు...

మహమ్మారి ముట్టడిలో నెగ్గేదెలా?

కొవిడ్ -19 మనకు నేర్పుతున్నది, నిర్దేశిస్తున్నది ఏమిటి? ఆరోగ్య భద్రతా వ్యవస్థలను సదా పటిష్ఠంగా వుంచుకోవాలి. వాటికి ఆర్థిక వనరులను సదా సమృద్ధంగా సమకూర్చాలి. ఆవశ్యక ఔషధాలను, దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలగాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలి. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్‌లు సోకడం ముమ్మరమవుతుంది. ఇవెంత వాస్తవాలో కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేయడం లేదా?


కొత్తకరోనా వైరస్ (కొవిడ్ -19) భయానక వేగంతో దేశ దేశాల్లో వ్యాపిస్తూ జనులను జడిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా అంటువ్యాధిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించకముందే ఈ విశ్వమారి పర్యవసానాలు ఎంత వినాశనకరంగా వుండగలవో ప్రజలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. కరోనా అక్షరాలా కొత్త వైరస్ (విషక్రిమి). ఏ దేశమూ ఇంతవరకు ఇటువంటి వైరస్ బారిన పడలేదు. కనుకనే కరోనా కల్లోలంపై కనీవినీ ఎరుగని స్థాయిలో కలవరం వ్యక్తమవుతోంది. ఈ మహమ్మారి ముప్పుపై ఆరోగ్య భద్రతా వ్యవస్థలు ప్రభావశీలంగా ప్రతిస్పందించడంలో, ప్రజల భయాందోళనలు అవరోధం కాకుండా వుండేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, బహుశా, కరోనా ఉపద్రవాన్ని ప్రపంచ వ్యాప్త వ్యాధిగా ప్రకటించడంలో జాప్యం చేసివుంటుంది. ఇప్పుడు యావత్‌ప్రపంచమూ కరోనాపై సమరం చేస్తోంది– ఆరోగ్య రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా. 


కరోనా వైరస్ తొలుత ప్రబలిన (చైనాలోని) వుహాన్‌లో నివశిస్తున్న భారతీయులకూ ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిగ్రస్తుల కేసులే భారత్ రికార్డ్ చేసిన తొలి కరోనా కేసులు. ఆ తరువాత ఇటాలియన్ పర్యాటకులు లేదా కొవిడ్ -19 సోకిన విదేశీ సందర్శకులతో సాన్నిహిత్యం వల్ల ఆ వ్యాధి బారిన పడినవారిని గుర్తించడం జరిగింది. ప్రమాద తీవ్రతను గ్రహించిన వెంటనే కరోనా వ్యాధి ప్రబలిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను స్క్రీనింగ్ చేయడం ప్రారంభించారు. ఈ ప్రయాణికులనందరినీ 14 రోజుల పాటు క్వారన్‌టైన్‌లో ఉంచడం అనివార్యమయింది. ఇప్పుడు విదేశీ సందర్శకుల రాకపై నెలరోజుల పాటు నిషేధం విధించారు. 


కరోనా వైరస్ విస్తరణను అరికట్టేందుకు ఈ చర్యలు సరిపోతాయా? లేక అది ఒక సామాజిక అంటువ్యాధిగా దేశంలో ఎల్లెడలా వ్యాప్తి అవుతందా? ఇప్పుడే ఇదమిత్థంగా చెప్పడం చాలా కష్టం. అయితే ఎట్టి సంభావ్య విపత్కర పరిస్థితులలోను ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధమై వుండాలి. ఇది అవశ్యం. ఏ సంభావ్య పరిస్థితీ ఎంత విపత్కరంగా పరిణమించినప్పటికీ, ఆ వైపరీత్యానికి వ్యవస్థీకృత ప్రతిస్పందనను బలహీనపరిచే విధంగా ప్రజల భయాందోళనలను అదుపు తప్పనివ్వ కూడదు. కొవిడ్ -19 గురించిన ఒక వాస్తవమేమిటంటే సార్స్, మెర్స్ తదితర మహమ్మారుల కంటే అది తక్కువ ప్రమాదకరమైనది. ఈ వ్యాధి గ్రస్తులలో మరణాల సంఖ్య కేవలం రెండు లేదా మూడు శాతంగా ఉంటుంది. కరోనా వైరస్ ముఖ్యంగా వృద్ధులకు, ధూమపాన ప్రియులకు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే సోకుతుంది. ఈ మహమ్మారి ఫలితంగా సంభావ్య విపత్కర పరిస్థితుల లేదా సంఘటనల క్రమం ఎలా వుంటుందో ఊహించవచ్చు. 


సంభావ్య పరిస్థితి -1: నిరోధక చర్యలు సత్ఫలితాల నిస్తాయి. ఏప్రిల్ నడిమిరోజుల వరకు కొత్త వారెవ్వరూ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలి. దీనివల్ల ఆరోగ్య భద్రతా వ్యవస్థలు, ఇప్పటికే కనిపెట్టిన కేసులలో ప్రభావశీలంగా చికిత్స నందించగలుగుతాయి కరోనా రోగుల జాబితా పెరగకుండా చేయగలుగుతాయి. ఏప్రిల్ మధ్యనాటికల్లా ఇతర దేశాలలో ఈ అంటు వ్యాధి తీరుతెన్నులను అర్థం చేసుకుని, వలసవచ్చే వారిని తనిఖీ విధి విధానాలలో ఎలాంటి మార్పులు చేయాలన్న విషయమై ఒక అవగాహనకు రాగలుగుతాము. అప్పటికి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలిచిపోతుంది. 


సంభావ్య పరిస్థితి-2: కొన్ని ప్రదేశాలలో ఈ మహమ్మారి ప్రతి ఒక్కరికీ సోకుతుంది. బాధితులను గుర్తించి క్వారన్‌టైన్‌లో ఉంచడం జరుగుతుంది. వ్యాధి తీవ్రత స్వల్పంగా వుంటే ఇంటి వద్దనే వుండి చికిత్స చేయించుకోవచ్చు. అలాకాకుండా వ్యాధి తీవ్రత విషమంగా వుంటే విధిగా ఆస్పత్రిలో చేర్పించవలసివుంటుంది. ఈ అంటు వ్యాధి సోకిన వారిలో విషమ పరిస్థితి నెదుర్కొనేవారి సంఖ్య 15 శాతానికి మించివుండక పోవచ్చు. ఆస్పత్రిలో తప్పనిసరిగా చేర్చవలసిన వారి సంఖ్య అధికం కాదు గనుక వ్యాధి అదుపునకు ప్రస్తుత ఆరోగ్యభద్రతా సదుపాయాలు సరిపోతాయి. సదుపాయాలు అంతగా లేని ఆరోగ్య భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయవలసి వుంటుంది. వ్యాధి విస్తరణను అరికట్టేందుకు ఇది తప్పనిసరి. వలసవచ్చే వారిని సమగ్రంగా పరీక్షించిన తరువాతనే దేశంలోకి అనుమతించాలి. కేసుల సంఖ్య అత్యధికంగా వుంటే సమర్థంగా చికిత్స చేయడం ఎటువంటి పటిష్ఠ ఆరోగ్య భద్రతా వ్యవస్థకైనా చాలా కష్టమనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. 


సంభావ్య పరిస్థితి- 3: కొవిడ్-19 ఎవరికి సోకినా వెంటనే వ్యాధి లక్షణాలు బహిర్గతం కావు. అలా సోకడమే ఈ విషక్రిమి సహజ స్వభావం. అయితే క్రమంగా అది తన తీవ్ర ప్రభావాన్ని చూపించడమే కాకుండా ప్రతి ఒక్కరికీ వ్యాపిస్తుంది. దీనివల్ల ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతాయి. వ్యాధి తీవ్రత స్వల్పంగా వున్నప్పుడు ఇంటి వద్దనే ఏకాంత నిర్బంధంలో వుండడం ద్వారా శీఘ్రంగా స్వస్థత పొందవచ్చు, అయితే మన సమాజంలో మధు మేహం, హృద్రోగాలతో బాధపడేవారి సంఖ్యతక్కువేమీ కాదు. దీనికి తోడు వాయు కాలుష్యం, పోషకాహారలోపం కూడా చాలా అధికం. కనుక కరోనా వైరస్ సోకిన వారిలో 20 శాతం మందిలో వ్యాధి తీవ్రత విషమంగా వుంటుంది. ఇటువంటి వ్యాధిగ్రస్తులను ఆస్పత్రిలో చేర్పించి క్వారన్‌టైన్‌లో వుంచాలి. కొంత మందికి శ్వాసక్రియా సాధనాలతో చికిత్స చేయవలసి వుంటుంది. కరోనా వైరస్ బాధితులను గుర్తించడానికి, వ్యాధి తీవ్రతను ఆర్థిక వనరులు నిర్ధారించడానికి సమర్థంగా వినియోగించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సదుపాయాలు పటిష్ఠ పరిస్తే వ్యాధి తీవ్రత స్వల్పంగా వున్న వారికి ఇంటివద్దనే చికిత్స చేయవచ్చు. విధిగా ఆస్పత్రిలో చేరవలసినంతగా వ్యాధి తీవ్రత వున్న వారి కోసం ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులన్నిటినీ వినియోగించుకోవలసివుంటుంది. అవసరమైతే కొన్ని వైద్య సేవలను వాయిదా వేసి కొవిడ్ -19 రోగుల చికిత్సకే ప్రాధాన్యమివ్వాలి. అవసరమైన వైద్య సిబ్బంది, వైద్య సామగ్రిని సంసిద్ధంగా వుంచుకోవడం తప్పనిసరి. పైన ప్రస్తావించిన మూడు సంభావ్య విపత్కర పరిస్థితులలో ఏవి రాబోయే మూడు నెలల్లో తగ్గు ముఖం పట్టేది ఇప్పుడే చెప్పలేము. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధంగా వుండాలి. మహా ముప్పు ముంచుకొస్తుందన్న భయవ్యాపక సూచనలు విషమ పరిస్థితులను అదుపు చేసేందుకు తోడ్పడవు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరోగ్యభద్రతా వ్యవస్థకు పరీక్ష పెడుతున్నది. ఈ వాస్తవాన్ని దృష్టిలో వుంచుకొని మన ఆరోగ్యభద్రతా వ్యవస్థలను మెరుగుపరచుకోవాలి. ఏ స్థాయిలోనూ ఏమరుపాటుగా వుండడం తగదు. భవిష్యత్తులో ప్రజారోగ్యానికి సంభవించే ముప్పులను నివారించేందుకు ఇటువంటి అప్రమత్తత ఎంతైనా అవసరం. 


కొవిడ్ -19 మనకు నేర్పుతున్నది, నిర్దేశిస్తున్నది ఏమిటి? ఆరోగ్య భద్రతా వ్యవస్థలను సదా పటిష్ఠంగా వుంచుకోవాలి. వాటికి ఆర్థిక వనరులను సదా సమృద్ధంగా సమకూర్చాలి. ఆవశ్యక ఔషధాలను, క్రియాశీల ఔషధ పదార్థాల (ఎపిఐ)ను దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలగాలి. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే పెంపుడు జంతువులు, పక్షుల నుంచి వివిధ వైరస్‌లు సోకడం ముమ్మరమవుతుంది. ఇవెంత వాస్తవాలో కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేయడం లేదా? కొవిడ్ -19 ఇప్పుడు తగ్గు ముఖం పట్టినప్పటికీ ఒకటి రెండు సంవత్సరాల అనంతరం మళ్ళీ విజృంభించవచ్చు. అయితే, అప్పుడు మనం దాన్ని మరింత ఆత్మ విశ్వాసంతో సమర్థంగా ఎదుర్కోగలుగుతాము. మన స్వీయ రోగనిరోధక వ్యవస్థలు మెరుగుపడడంతోపాటు బహుశా అప్పటికీ కొవిడ్-19ని నిరోధించగలిగే ఒక టీకా (వ్యాక్సిన్), కొత్త ఔషధాలు మనకు అందుబాటులో ఉండవచ్చు. మెరుగుపడిన ఆరోగ్యభద్రతా వ్యవస్థలు వ్యాధి తీవ్రత స్థాయిని సత్వరమే మరింత సక్రమంగా నిర్ధారించగలుగుతాయి. అప్పటివరకు కొత్త భయానక కరోనా వైరస్ పరిస్థితులను అనుగుణమైన వ్యూహాలతో ఎదుర్కోవాలి. అనవసర భయాందోళనలతో, సమస్యలను పెంచి, పరిస్థితులను మరింతగా విషమింపచేసే చర్యలకు మనం పాల్పడగూడదు. 

కె. శ్రీనాథ్ రెడ్డి

ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా

(హిందుస్థాన్‌ టైమ్‌్స)

Updated Date - 2020-03-19T08:48:30+05:30 IST