పర్యావరణానికి ప్రమాద ఘంటికలు’

ABN , First Publish Date - 2022-05-23T08:02:09+05:30 IST

వాతావరణంలో కర్బన ఉద్గారాలు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతున్నాయి! సముద్ర మట్టాలు.. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు..

పర్యావరణానికి  ప్రమాద ఘంటికలు’

ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతున్న

నాలుగు కీలక వాతావరణ సూచికలు

పెరుగుతున్న సముద్ర మట్టాలు

తీరప్రాంతాల ప్రజలకు పెను ముప్పు

ఆమ్లత్వం సంతరించుకుంటున్న నీరు

జలచరాలకు, జీవవైవిధ్యానికి హాని

ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన


న్యూఢిల్లీ, మే 22: వాతావరణంలో కర్బన ఉద్గారాలు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతున్నాయి! సముద్ర మట్టాలు.. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు.. సముద్రాల ఆమ్లీకరణ.. నానాటికీ పెరుగుతూ భయపెడుతున్నాయి!! ఫలితంగా గత ఏడు సంవత్సరాల కాలంలో (2015-2021) అంతర్జాతీయంగా అత్యధికస్థాయిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తన ‘స్టేట్‌ ఆఫ్‌ క్లైమేట్‌’ నివేదికలో పేర్కొంది.


గత ఏడాది అంతర్జాతీయస్థాయిలో సగటు ఉష్ణోగ్రతలు.. పారిశ్రామిక యుగానికి ముందు (1850-1900) ఉష్ణోగ్రతలతో పోలిస్తే 1.1 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు హెచ్చరించింది. ‘‘పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవడంలో మానవుల ఘోర వైఫల్యానికి నిదర్శనం ఈ నివేదిక. ఇప్పటికైనా మనం శిలాజ ఇంధనాల కాలుష్యానికి ముగింపు పలకాలి. మన ఇంటిని మనమే తగలబెటుకునేలోగానే.. పునరుత్పాదక ఇంధనాలకు మారే ప్రక్రియను వేగవంతం చేయాలి. సమయం మించిపోతోంది’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆందోళన వెలిబుచ్చారు. కాగా.. 2021లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన అతి తీవ్ర ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, వరదల వంటివాటి గురించి.. వాటివల్ల కలిగిన రూ.7.74 లక్షల కోట్ల నష్టం గురించి డబ్ల్యూఎంవో తన నివేదికలో పేర్కొంది. వాటివల్ల ఆహారభద్రతకు కలిగిన తీవ్ర నష్టాన్ని గురించి వివరించింది


సముద్ర మట్టాలు పైపైకి

వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయులు పెరిగిపోతే అవి సూర్యుడి వేడిని ట్రాప్‌ చేస్తాయి. దీనివల్ల భూమి మరింత వేడెక్కుతుంది. రాత్రిపూట కూడా వేడిగానే ఉంటుంది. ఇలా భూతాపం పెరిగిపోవడం వల్ల హిమనీ నదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. తీరప్రాంతాలు మునిగిపోతాయి. కొన్నాళ్లుగా అదే జరుగుతోందని.. పెరుగుతున్న భూతాపం కారణంగా మంచు కరిగి... ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు నానాటికీ పైపైకి పోతున్నాయని డబ్ల్యూంఎవో తన నివేదికలో పేర్కొంది. 2013-2021 మధ్యకాలంలో సగటున ఏటా 4.5 మిల్లీమీటర్ల మేర సముద్రమట్టాలు పెరిగినట్టు వెల్లడించింది. 1993-2003తో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికమని పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర తీర ప్రాంతాలకు తుఫాన్ల ముప్పు మరింత పెరుగుతుందని తెలిపింది.


ఇక, సముద్ర జలాల ఆమ్లీకరణ విషయానికి వస్తే.. గాలిలో కర్బన ఉద్గారాల స్థాయి ఎంత పెరిగితే.. సముద్ర జలాలు కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకోవడం అంతగా పెరుగుతుంది. అనంతరం జరిగే రసాయనచర్యల కారణంగా సముద్రజలాల పీహెచ్‌ స్థాయులు తగ్గిపోయి ఆమ్లత్వం పెరిగిపోతుంది. దీనివల్ల సముద్ర జీవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల తీర ప్రాంత ప్రజలతోపాటు సముద్ర జీవాలపైనా, జీవవైవిధ్యంపైన, ఆహార భద్రతపైనా పెనుప్రభావం పడుతోందని డబ్ల్యూఎంవో హెచ్చరించింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగంతో పోలిస్తే 1.5 డిగ్రీల మేర పెరిగే ప్రమాదం 50 శాతం ఉందని.. దానివల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - 2022-05-23T08:02:09+05:30 IST