మానవాళిపై పర్యావరణం

ABN , First Publish Date - 2022-09-27T08:29:36+05:30 IST

మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకేస్తుంది..ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు.. చిత్త చిత్తగించి, స్వాతి చల్ల చేసి, విశాఖ విసరకుంటే అనూరాధకు అడిగినంత పంట..

మానవాళిపై పర్యావరణం

  • కొన్నిచోట్ల అతివృష్టి.. కొన్నిచోట్ల అనావృష్టి.. 
  • నానాటికీ మారుతున్న రుతుపవనాల తీరు
  • ఆహారభద్రతకు ముప్పు అంటున్న నిపుణులు
  • ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇదే స్థితి
  • ఎండలు, కరవుతో అల్లాడుతున్న యూరప్‌
  • పాక్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వరదలు
  • వడగాడ్పులతో మంటెక్కిపోతున్న చైనా

మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకేస్తుంది..ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు..  చిత్త చిత్తగించి, స్వాతి చల్ల చేసి, విశాఖ విసరకుంటే అనూరాధకు అడిగినంత పంట..వర్షాల తీరు తెన్నులను ఇలా కార్తెల వారీగా విశదీకరించింది భారతీయ సంప్రదాయ సాగు అనుభవం! కానీ.. నానాటికీ పెరిగిపోతున్న భూతాపం,పర్యావరణ మార్పుల దెబ్బకు కాలాల లెక్క మారింది! కార్తెలవారీగా వానల లెక్కా మారింది!! అయితే కుండలతో ఎత్తిపోసినట్టుగా ఒకే చోట కురిసి ముంచెత్తడం.. లేదా అసలు వాన పొడే లేకుండా ఎండలు మండిపోవడం.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ మార్పుల కారణంగా భారతీయ రుతుపవనాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి. 


ఈ మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా తక్కువగా వానలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండలతో ధారపోసినట్టుగా ఒకే చోట కురిసే క్లౌడ్‌బరస్ట్‌ వానలు (హైదరాబాద్‌వాసులకు చిరపరిచితం).. ఇటీవల బెంగళూరును అతలాకుతలం చేసిన వరద ముంపు వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ ఏడాదినైతే.. 1902 తర్వాత అతి తీవ్రవాతావరణ పరిస్థితులు ఏర్పడిన రెండో సంవత్సరంగా కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలోని మూడింట ఒక వంతు రాష్ట్రాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. దేశంలోని మిగతా భూభాగంలో (దాదాపు 63%) అయితే అధిక వర్షపాతం, లేకుంటే లోటు వర్షపాతం నమోదైంది. మనదేశంలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. అయితే అసలు సమస్య వరదలు/ వడగాడ్పులు కావు. ఈ అసమతౌల్య వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు సరిగ్గా పండక.. ఒకవేళ పండినా కోత దశలో కుంభవృష్టి కురిసి పంట నీటిపాలు కావడం వల్ల.. దేశ ఆహార భద్రతకే పెనుముప్పు ముంచుకొస్తోంది. 


భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం కావడం వల్ల.. ఈ మార్పులు దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వాతావరణ, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘లానినా పరిస్థితులు వరుసగా కొనసాగుతుండడం.. తూర్పు హిందూ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం.. ఇలా అరుదైన పరిణామాలు సంభవిస్తున్నాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌  మెట్రాలజీకి చెందిన డాక్టర్‌ ఆర్‌.కృష్ణన్‌ పేర్కొన్నారు. ‘‘వీటన్నింటి వెనుక పర్యావరణ మార్పుల ప్రభావం కచ్చితంగా ఉంది. దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది’’ అని స్కైమెట్‌ వెదర్‌కు చెందిన జీపీ శర్మ అభిప్రాయపడ్డారు. పర్యావరణ మార్పుల ప్రభావం పంటలపై పడడం ఇప్పటికే మనదేశంలోని పలు రాష్ట్రాల్లో అనుభవంలోకి వస్తోంది. ముఖ్యంగా.. పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, తూర్పు యూపీల్లో నమోదైన లోటు వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో వరి దిగుబడిపైన, నాణ్యతపైన తీవ్ర ప్రభావం చూపనుందని స్కైమెట్‌ వెదర్‌కే చెందిన మహేశ్‌ పలావట్‌ తెలిపారు. దేశ వరిధాన్యం ఉత్పత్తిలో మూడోవంతు బిహార్‌, పశ్చిమబెంగాల్‌, యూపీల్లోనే జరుగుతుంది. ఆ రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోతే దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతున్నట్టే.


ప్రపంచవ్యాప్తంగా..

గత ఆరునెలల్లో దక్షిణాసియావ్యాప్తంగా విపరీత వాతావరణ ఘటనలు (భారీ వర్షాలు, కరువు) నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, భారతదేశం వరదలతో సతమతమవుతుంటే చైనాలో చాలా భూభాగం తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా.. పాకిస్థాన్‌లో 60ు అధిక వర్షపాతం కారణంగా పలుప్రాంతాల్లో కనీవినీ ఎరుగని వరదలు సంభవించి ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. దాదాపు 580 మంది చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ జలప్రళయం సంభవించడానికి రెండు నెలల ముందు అదే పాకిస్థాన్‌లో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అఫ్ఘానిస్థాన్‌లోనూ వరదల కారణంగా 31 మంది చనిపోయారు. మరోవైపు.. చైనాలో, పలు యూరప్‌ దేశాల్లో భూగర్భజలాలు, నీటివనరులు అడుగంటిపోయి తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడడం గమనార్హం. చైనాలోని కొన్ని ప్రాంతాలు గత 60 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలతో మండిపోతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు ఆ వేడిని తట్టుకోలేక తమకు సమీపంలోని మాల్స్‌కు, సూపర్‌మార్కెట్లకు వెళ్లి సాయంత్రం దాకా అక్కడే పొద్దుపుచ్చుతున్నారు. యూరప్‌ అయితే.. గడిచిన 500 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 


సాధారణంగా యూరప్‌ దేశాల్లో ఎండ వస్తే పండగలాగా భావిస్తారు. కానీ.. ఈ ఏడాది జూలైలో యూకేలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. యూర్‌పవ్యాప్తంగా ఒక్క ఈ ఏడాదే 6,59,541 హెక్టార్ల అటవీ భూమి దావాగ్నికి ధ్వంసం కావడం గమనార్హం. తూర్పు ఆఫ్రికాలోనేమో దశాబ్దాలుగా ఎరుగని కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవకపోవడంతో 2 కోట్ల మంది దాకా ప్రజలు కరువు బారిన పడ్డారు. అమెరికాలోనూ ఈ ఏడాది ఆగస్టులో డెత్‌వ్యాలీ (క్యాలిఫోర్నియా), కెంటకీ తదితర ప్రాంతాలు వరద ముంపుతో అల్లకల్లోలమయ్యాయి. కార్చిచ్చుల వల్ల 6000 మంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఆ దేశం.. ఈ దేశం అని లేదు.. ఆ ఖండం.. ఈ ఖండం.. అని లేదు.. అన్ని చోట్లా ప్రకృతి ప్రకోపం మానవ జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఆహారభద్రతను ప్రమాదంలో పడేస్తోంది. నిజానికి వరదలో, కార్చిచ్చులో.. ప్రకృతి ఉత్పాతమేదైనాగానీ చాలా తీవ్రంగా ఉంటుంది. మానవ ప్రమేయం ఆ తీవ్రతను 71శాతం మేర అధికం చేస్తున్నట్టు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ ప్రమేయం అంటే.. కర్బన ఉద్గారాలతో భూతాపాన్ని పెంచేయడం. దానిపై దృష్టి సారించి.. పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలుకు ప్రపంచదేశాలన్నీ చిత్తశుద్ధితో కృషి చేస్తేనే ఈ ముప్పు నుంచి మానవాళి తప్పించుకోగలదు. అది జరిగేదాకా ఈ ప్రకృతి విపత్తుల బెడద ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.       -సెంట్రల్‌ డెస్క్‌


మాల్దీవులకు మునక ముప్పు

అడుగున సూది పడినా కనిపించేంత స్వచ్ఛమైన నీరు.. అందమైన ఇసుక తిన్నెలు... ఎటుచూసినా మెరిసే నీలాకాశం.. ప్రకృతి అందాలకు నెలవైన మాల్దీవుల గురించి ఎవరిని అడిగినా చెప్పే మాటలివి. అంత అందమైన మాల్దీవులు.. పర్యావరణ మార్పు కారణంగా 2050 నాటికి 80ు మేర.. ఈ శతాబ్దం చివరికల్లా పూర్తిగా.. సముద్రంలో మునిగిపోతాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మన నగరాలకు మునక ముప్పు

పర్యావరణ మార్పు, భూతాపం కారణంగా మంచు కరిగి.. సముద్ర మట్టాలు పెరిగి.. ఈ శతాబ్దం చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాలు కొంత మేర సముద్రపు నీట మునిగే ప్రమాదం ఉందంటూ గత ఏడాది ఆగస్టులు ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఐసీసీసీ) ఒక నివేదిక ఇచ్చింది. ఆ నగరాల్లో మన విశాఖపట్నం సహా పలు భారతీయ నగరాలు ఉండడం ఆందోళనకరం. ఆ నగరాలేంటి? ఎంతమేర సముద్రంపాలవుతాయి అంటే..



Updated Date - 2022-09-27T08:29:36+05:30 IST