మాది హామీ కాదు, అభయం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-10-30T22:38:17+05:30 IST

గోవా ఓ బొగ్గు కేంద్రంగా మారడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ

మాది హామీ కాదు, అభయం : రాహుల్ గాంధీ

పనాజీ : గోవా ఓ బొగ్గు కేంద్రంగా మారడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. గోవాను కలుషిత ప్రాంతంగా మారనివ్వబోమన్నారు. గోవా శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఆయన శనివారం వెల్సావోలో మత్స్యకారులతో మాట్లాడారు. 


రాహుల్ గాంధీ మత్స్యకారులతో మాట్లాడుతూ, గోవాలో అత్యంత ముఖ్యమైనది వాతావరణమేనని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం మనం పర్యావరణాన్ని కాపాడుతున్నామని చెప్పారు. గోవాను బొగ్గు కేంద్రంగా, కలుషిత ప్రాంతంగా మారనివ్వబోమని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) కేవలం ఓ వాగ్దానం కాదని, అది ఓ అభయమని చెప్పారు. తమ మేనిఫెస్టో అత్యంత పారదర్శకమైనదన్నారు. రైతుల రుణాలను రద్దు చేస్తామని ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికల్లో వాగ్దానం చేశామని, దానిని నెరవేర్చామని తెలిపారు. పంజాబ్, కర్ణాటకలకు వెళ్ళి తమ పార్టీ మేనిఫెస్టో అమలు గురించి ధ్రువీకరించుకోవచ్చునని తెలిపారు. 


పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై మాట్లాడుతూ, యూపీయే ప్రభుత్వ హయాంలో ఓ బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లు ఉండేదన్నారు. కానీ నేడు ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో చాలా తక్కువ అయినప్పటికీ, ప్రజలు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని అన్నారు. ఇంధనంపై పన్నులు ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలోనే ఎక్కువ అని తెలిపారు. దీనివల్ల లాభపడుతున్నది కేవలం నలుగురైదుగురు వ్యాపారవేత్తలు మాత్రమేనన్నారు. 


Updated Date - 2021-10-30T22:38:17+05:30 IST