AP: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ అధికారులు మరొకసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం సాయంత్రం స్వామివారి దర్శనానికి వచ్చిన సినీ హీరో తనీష్, సింగర్ రేవంత్ వారితో వచ్చిన మరో ఇద్దరికీ మాస్క్ లు లేకపోయినా సరే అధికారులు వారికి గౌరవ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వారు మాస్క్ లు లేకుండానే తిరిగారు. అంతేకాక స్వామివారిని మాస్క్లు లేకుండానే దర్శించారు. అయితే ఈ తతంగం ఆలయ అధికారులే దగ్గరుండి చేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థర్డ్ వేవ్ సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు మాస్క్ విధిగా ధరించాలని, మాస్క్లు ధరించని వారికి ఫైన్ వేయాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి ఆలయానికి వచ్చే విఐపిలు మాస్క్లు ధరించకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాధారణ భక్తులకు ఒకలా, విఐపీలకు మరోలా నియమాలు ఉంటాయా? అని పలువురు భక్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కరోనా సమయంలో ఇటువంటి నిర్లక్ష్య ధోరణి, వారి అత్యుత్సాహం కారణంగా కొందరు భక్తులు ఇబ్బంది పడుతున్నారు.