ఫీజురీయింబర్స్‌మెంట్‌ గోల్‌మాల్‌పై విచారణ

ABN , First Publish Date - 2020-07-15T09:42:30+05:30 IST

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగిన ఫీజురియంబర్స్‌మెంట్‌ గోల్‌మాల్‌పై అధికారులు మంగళవారం..

ఫీజురీయింబర్స్‌మెంట్‌ గోల్‌మాల్‌పై విచారణ

 శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో ప్రారంభం 

రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, సిబ్బంది, విద్యార్థుల నుంచి వివరాల సేకరణ 

నేడు కూడా  కొనసాగింపు


గుజరాతీపేట, జూలై 14: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగిన ఫీజురియంబర్స్‌మెంట్‌ గోల్‌మాల్‌పై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. కొంతమంది విద్యార్థులు, ఏబీవీపీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కళాశాల విద్యా కమిషనర్‌ ఎంఎం నాయక్‌ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ కణితి శ్రీరాములును నియమించారు.  ఈ మేరకు శ్రీకాకుళం పురుషుల డిగ్రీ కళాశాల గత ప్రిన్సిపాల్‌ (ప్రస్తుతం రిటైర్డ్‌) ఎం.బాబూరావును మంగళవారం విచారించారు. బాబూరావు ప్రిన్సిపాల్‌గా ఉన్న సయమంలో 2015లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఇండస్ట్రీయల్‌ కెమిస్ట్రీ(ఎంసీఐసీ)లో ప్రవేశించిన విద్యార్థుల వివరాలను జ్జానభూమి పోర్టల్‌లో నమోదు చేయకపోవడంతో ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలను మూడేళ్లపాటు పొందలేకపో యినట్టు  విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.


2017 అక్టోబరులో ఇదే కళాశాల విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో వేరే కళాశాలల్లో రాశారు. విద్యార్థులు పరీక్షలు రాసే కాలానికి హాజరును రిజిష్టర్‌లో నమోదు చేయకపోవ డంతో సుమారు 1500 మంది విద్యార్థులు ఫీజురియంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనా లు పొందలేకపోయినట్లు తెలిసింది. సుమారు రూ.50 లక్షలు నష్ట పోవడంతో విద్యార్థులు, ఏబీవీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నాటి ప్రిన్సి పాల్‌ బాబూరావుతో పాటు కళాశాల సీనియర్‌ అసిస్టెంట్లు పద్మ, రాణి, విద్యార్థులు కొర్ని సోమేష్‌, చిట్టి భాస్కరరావు, గురుగుబెల్లి ప్రశాంత్‌, ఏబీవీపీ ప్రతినిధి డి.యోగేశ్వరరావుల నుంచి విచారణాధికారి శ్రీరాములు స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. బుధవారం కూడా విచారణ చేపట్టనున్నట్లు శ్రీరాములు తెలిపారు.

Updated Date - 2020-07-15T09:42:30+05:30 IST