వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికే కమిటీ

ABN , First Publish Date - 2020-10-01T07:53:54+05:30 IST

రాష్ట్రంలో గ్యాస్‌ పైప్‌లైన్ల లీకేజీ విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు గతంలో సంయుక్త కమిటీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలని గెయిల్‌ సంస్థ చేసిన అభ్యర్థనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తోసిపుచ్చింది...

వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికే కమిటీ

  • గెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన ఎన్జీటీ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్యాస్‌ పైప్‌లైన్ల లీకేజీ విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు గతంలో సంయుక్త కమిటీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించాలని గెయిల్‌ సంస్థ చేసిన అభ్యర్థనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తోసిపుచ్చింది. గెయిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఆ ఉత్తర్వులతో తమ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని గెయిల్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తాము పర్యావరణానికి హాని కలిగించడం లేదన్నారు. ఓఎన్జీసీ వల్ల హాని జరగొచ్చు కానీ తమ సంస్థతో ఆ ప్రమాదం ఉండబోదని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... పర్యావరణానికి హాని కలిగిస్తున్నామని ఏ కంపెనీ ముందుకొచ్చి చెప్పదు కదా! అని వ్యాఖ్యానించింది. విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన గురించి ప్రస్తావించింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకోడానికి కమిటీని నియమించామని, ఇవేమీ తుది ఉత్తర్వులు కావని పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, కాబట్టి ఆ ఉత్తర్వులను ఉపసంహరించబోమని తేల్చిచెప్పింది. 


Updated Date - 2020-10-01T07:53:54+05:30 IST