ఇక చాలు..

ABN , First Publish Date - 2022-06-27T05:52:37+05:30 IST

కరువు జిల్లా రైతు అస్త్రసన్యాసం చేస్తున్నాడు.

ఇక చాలు..
గాండ్లపెంట మండలం జీనులకుంట వద్ద దుక్కులు చేసిన భూమి

అప్పులు చేయలేం.. పంటలు పెట్టలేం..

పరువు కోసం కాసింత.. లేదంటే అదీ వద్దు..

కాడె దించుతున్న కర్షకులు

పంట పెట్టేందుకు ససేమిరా..

నేటికీ దుక్కులు కూడా చేయని దుస్థితి

భారీగా తగ్గనున్న ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం


పుట్టపర్తి, జూన 26 (ఆంధ్రజ్యోతి)


కరువు జిల్లా రైతు అస్త్రసన్యాసం చేస్తున్నాడు. నష్టాలు, అప్పుల సేద్యం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాడు. భూములను బీళ్లుగా పెట్టుకునే దుస్థితి దాపురించింది. ఒకప్పుడు పదుల ఎకరాల్లో సాగుచేసిన రైతులు ప్రస్తుతం ఎకరా, రెండెకరాలకు పరిమితమవుతున్నారు. అది కూడా.. పండుతుందన్న ఆశతో కాదు, పరువు పోతుందన్న ఆవేదనతో. దీంతో ప్రస్తుత ఖరీ్‌ఫలో పంట ల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోనుంది.

పెట్టుబడి భారం


శ్రీసత్యసాయి జిల్లాలో 80 శాతం వేరుశనగ సాగు చేసేవారు. ఒకప్పుడు పంట పెట్టుబడులు తక్కువగా ఉండేవి. పంటలు బాగా పడి, మంచి దిగుబడి వచ్చి, రైతుకు లాభం వచ్చేది. దీంతో పంట సాగుకు అన్నదాతలు ఆసక్తి చూసేవారు. కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. సేద్యం పనులకు ట్రాక్టర్‌కు ఏడాదిక్రితం గంటకు రూ.800 చెల్లించేవారు. ప్రస్తుతం రూ.1200 పెట్టుకోవాల్సి వస్తోంది. ఎరువులు, మందులు, విత్తనాలు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. పంట పెట్టుబడి భారమవుతోంది. ప్రస్తుతం ఎకరాలో వేరుశన సాగు చేయాలంటే రూ.40వేలు ఖర్చవుతోంది. పంట మాత్రం పండట్లేదు. అంతో.. ఇంతో పండినా ధరలు ఉండట్లేదు. దీంతో అన్నదాతలు నష్టపోతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయి.


ప్రభుత్వ సాయం ఏదీ?


ఏటా తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నది నిర్వివాదాంశం. పంటల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచన చేయట్లేదు. వైసీపీ అధికారం చేపట్టాక సబ్సిడీపై డ్రిప్‌, స్ర్పింక్లర్ల పథకానికి మంగళం పాడింది. దీంతో రబీలో బోరుబావుల కింద పంటలు సాగుచేసుకుని, ఉపశమనం పొందుదామనుకునే రైతులకు నిరాశే మిగులుతోంది. ఇటీవల విడుదల చేసిన పంటల బీమాలో కూడా నష్టపోయిన రైతులకు అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట పెట్టనివారికి, అసలు భూమే లేని వారికి పెద్దఎత్తున బీమా వచ్చింది. పంట పెట్టి, తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు మాత్రం పైసా రాలేదు. జిల్లాలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఇలా అయితే... రైతుల నష్టాల నుంచి ఎలా ఉపశమనం పొందుతారు? పంట సాగుకు ఆసక్తి ఎలా చూపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


సాగైంది 8వేల  హెక్టార్లలోపే..


2021లో జిల్లావ్యాప్తంగా 2.38 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. కంది 28వేల హెక్టార్లు, ఉలవలు 13వేల హెక్టార్లలో వేశారు. చిరుధాన్యాలు మరికొన్ని హెక్టార్లలో సాగైనట్లు తెలిసింది. ఈసారి సాగు అంచనా 3 లక్షల హెక్టార్లు కాగా.. ఇందులో వేరుశనగ వాటా 2,09,871 హెక్టార్లు. 31,957 హెక్టార్లు, 16,007 హెక్టార్లలో ఉలవలు సాగు అంచనా. ప్రస్తుత ఖరీ్‌ఫలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 7,954 హెక్టార్లలో మాత్రమే విత్తారు. అన్ని పంటలు కలుపుకుని మొత్తంగా 22,948 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు.


ముఖం చాటేసిన నైరుతి


సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలంగా వీచి, వర్షాలు కురిస్తే జూన ఆఖరులోపు వేరుశనగ సాగుచేస్తే మంచి దిగుబడులు వస్తాయి. వ్యవసాయాధికారులు మాత్రం జూలై 20 వరకు వేరుశనగ విత్తుకోవచ్చని చెబుతున్నారు. మంచి దిగుబడి రావాలంటే మాత్రం జూన ఆఖరులోపుగానీ, జూలై మొదటివారంలోగానీ పంట పెట్టాలన్నది రైతుల నమ్మకం. నైరుతి మొఖం చాటేయడంతో రైతులు కొన్నిచోట్లే విత్తనం విత్తుతున్నారు.


 సగం విత్తనమే కొనుగోలు 


ఖరీ్‌ఫలో సాగుకు జిల్లాకు 1.09 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించింది. జూన 25 నాటికి 55 వేల క్వింటాళ్లు మాత్రమే రైతులు తీసుకెళ్లారు. ఈ లెక్కన సగం విత్తనమే తీసుకెళ్లారు. ఇందులో కూడా చాలావరకు దారి మళ్లినట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటకకు పెద్దఎత్తున తరలించి, దళారులు సొమ్ము చేసుకున్నారు. వ్యాపారులు కూడా పలుచోట్ల పెద్దఎత్తున రీసైక్లింగ్‌ చేసి, రూ. కోట్లు దోచుకున్నారు. పలువురు రైతులు వంట అవసరాల కోసం కూడా విత్తనాలు తీసుకున్నారు. దీనిని బట్టి చూస్తే.. జిల్లాలో ప్రస్తుత ఖరీ్‌ఫలో పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతుందన్నది సుస్పష్టం.





 



Updated Date - 2022-06-27T05:52:37+05:30 IST