ఇనాక్‌ ‘వృద్ధి’ కథ... వినవలసిన పాట, చదివేది కాదు!

ABN , First Publish Date - 2021-02-01T05:59:54+05:30 IST

పలు విరామాల మధ్య వర్తమాన సాహిత్య చర్చాంశంగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కథ ‘వృద్ధి’ (సాహిత్య ప్రస్థానం, నవంబర్‌ 2019) పరిణమిస్తూ వుంది...

ఇనాక్‌ ‘వృద్ధి’ కథ... వినవలసిన పాట, చదివేది కాదు!

పలు విరామాల మధ్య వర్తమాన సాహిత్య చర్చాంశంగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కథ ‘వృద్ధి’ (సాహిత్య ప్రస్థానం, నవంబర్‌ 2019) పరిణమిస్తూ వుంది. ఇది వార్షిక ఉత్తమ కథల సంకలనం ‘కథ-2019’లోనూ ఎంపికైంది. అయితే, జరుగుతున్న చర్చ కథా స్థలం స్థాయి దాటి... ‘ఎలివేట్‌’ కాలేకపోవడానికి కారణం, మనవద్ద సామాజిక శాస్ర్తాల అధ్యయనం, సాహిత్య విమర్శ ఈ రెండింటి మరుగుజ్జుతనమే! సుప్రసిద్ధ రాజకీయ తత్వవేత్త ఆశీష్‌ నంది 2013 జనవరి జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌ సందర్భంగా ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐడియాస్‌’ సదస్సు వేదిక మీద, ‘ఎస్సీ, ఎస్టీల్లో అవినీతిపరులు ఎక్కువ... పశ్చిమ బెంగాల్‌లో అవినీతి తక్కువ, అందువల్ల అక్కడ నుంచి ఎస్సీ, ఎస్టీల్లో రాజకీయ నాయకులు ఎదగలేదు’ అన్నారు. ఇది జరిగాక, దీనిపై కొద్దిపాటి చర్చ కూడా మనవద్ద జరగలేదు. పైగా అప్పట్లో జైపూర్‌ పోలీస్‌ స్టేషన్లో నంది మీద కేసు రిజిస్టర్‌ అయింది. అలా ఈ దేశ అక్రమ సంపాదనలో మన వాటా ఎంత? అని, బహిరంగంగా, ఆ అవకాశాలులేని వర్గాలు చర్చించే అవకాశం పదేళ్ళ క్రితమే చేజారిపోయింది! 


మళ్ళీ ఇప్పుడు ‘వృద్ధి’ కథతో ఒకప్పటి నంది వ్యాఖ్యను ఇనాక్‌ మరోసారి సూక్ష్మ స్థాయిలో కథా వస్తువు చేసినట్టు అయింది. అందుకు కథా స్థలం: గుంటూరు జిల్లాలోని వేజెండ్ల గ్రామం అయింది. కథ కాలం, రాష్ట్ర విభజన 2014 తర్వాతి ఐదేళ్ళు. కథావరణం ఎస్సీ కాలనీ. కథ మొదలయ్యే నాటికే తల్లి లింగి (30) కూతురు సౌందర్య (15) వరసగా జరిగిన తమ మొగుళ్ళ మరణాల కారణంగా ఒంటరిగా తమ గుడిసె ఇంట్లోనే కలిసి జీవిస్తుంటారు, వీళ్ళతోనే ముసలి తాత వొకడు ఉంటాడు. వూళ్ళోని రైతు నారయ్య పంట పొలంలో కలుపు పనికి రమ్మంటే, ‘పని ఎవడు చేత్తాడు,’ అని లింగి చెప్పడంతో కథ మొదలవుతుంది. కథను రచయితే మనకు చెబుతూ ఉంటాడు. గుంటూరు వంటి నగరాలు పక్కన గ్రామాల్లో శ్రామిక కులాల ఉపాధిలో జరిగిన ‘షిఫ్ట్‌’ గురించి రచయిత చెబుతూ -‘‘బేల్‌దార్లు, మేస్తుర్లు, కట్టుబడి కూలీలుగా వేజండ్ల మాదిగపల్లె మగవాళ్ళు ఆరితేరారు. కొందరు ఆడవాళ్ళు, గుంటూరు మార్కెట్టులో కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళూ, చిరుతిళ్ళు అమ్ముతూ అంతో ఇంతో సంపాదించుకొంటున్నారు. వేజండ్ల మాదిగ పల్లెలో రైతు కూలీలు లేరు. మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు’’ అంటారు. అలా కథాంశం ప్రధానంగా ‘ఉపాధి’ అయినప్పటికీ, ప్రధాన పాత్రలు ఇద్దరు స్త్రీలు కనుక, వీరి నైతికతకు కూడా ఈ కథ రచయిత ఇనాక్‌ ‘ట్రస్టీ’ అయ్యారు. 


లింగి వొకప్పుడు ‘డ్వాక్రా’ గ్రూపులో వుంటూ బ్యాంక్‌ లోన్‌ తీసుకుంది, ఇళ్ళవెంట తిరిగి కూరగాయలు అమ్మింది, పిల్లను పెంచింది అప్పు తీర్చింది. ఇప్పుడు, ‘‘నెలకు నాలుగు వేలు ఏం పని చేయకుండా వస్తుంటే ఇద్దరికీ ఆనందమే’’ అంటాడు రచయిత. దాంతో ఆ తల్లీకూతుళ్ళు ఏ పని చేయకుండా ప్రభుత్వం ఇస్తున్న వితంతు పెన్షన్లు, చవగ్గా దొరుకుతున్న రేషను బియ్యం, పప్పు, నూనె, వంటి సామగ్రితో రోజులు గడిపేస్తున్నారు. వంట చేయడం బద్దకం అనిపిస్తే ‘అన్నక్యాంటిన్‌’ భోజనం, లేదా దేవాల యాలు, చర్చిలు వద్ద దాతల వితరణ పంక్తి భోజనాలుతో గడిపేస్తూ, గుంటూరులో సినిమాలు చూస్తూ, వెంటపడ్డవాడు నచ్చితే ఎప్పుడైనా వాడితో ‘సెక్స్‌’ అవసరాలు తీర్చుకుంటూ.. అలా రికామీగా బ్రతికేస్తూ వుంటారు. అయితే, ఇంటివద్ద వుండే తాత మాత్రం పెళ్ళిళ్ళు చేసుకుని తల్లులు అవండి అని వారికి హితవు చెబుతువుంటాడు.


నిజానికి ఈ కథకు ‘వృద్ధి’ అని పేరుపెట్టి, మొదట్లోనే రచయిత సగం బరువు తగ్గించుకున్నాడు. దాంతో... మనవద్ద ‘వృద్ధి’ క్రమం ఎట్టిదో చూడాల్సి వచ్చింది. హరిజన వాడలకు - హరిజనాభ్యుదయం, సాంఘిక సంక్షేమం, సంక్షేమ ఫలాలు, అభివృద్ధితోపాటు వొనగూడే మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారికత, ‘విమెన్‌ రిజర్వేషన్‌’, స్త్రీ స్వేచ్ఛ, వీటన్నిటి తర్వాత చివరిగా వీరిని తాకింది-‘వృద్ధి’. ఈ క్రమంలో గడచిన 75ఏళ్లలో అభివృద్ధి చెందవలసిన దేశం కేటగిరి నుంచి మనం బయటకు వచ్చాము. కానీ, ఈ మేళ్ళలో ఎక్కువ శాతం మన ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలు పెట్టే జీవన ప్రమాణాల మెరుగు షరతులు కారణంగా వీరికి వొనగూడినవే! ఇలా డెవలపింగ్‌ సొసైటీస్‌లోని ‘వృద్ధి’ స్పృహ... వొక నేపథ్య సంగీతంలా మన చెవుల్లో నిరంతరాయంగా విని పిస్తూ వుంటేనే... ఇనాక్‌ రాసిన ‘వృద్ధి’ కథలోని ‘లిరిక్‌’ మనకు పొరలు పొరలుగా విడివడుతుంది. అది - సంగీతంతోనూ కోరస్‌ తోనూ కలిపి వినవలసిన పాట, అంతేగానీ చదవవలసిన పాట మాత్రం కాదు! 


రైతు పొలం పనికి పిలిస్తే రామని, పైగా ‘‘ఆ పనేదో మీ ఇంట్లో నలు గురు చేసుకుంటే, అయిపోతుందిగా’’ అంటుంది లింగి. రైతుతో ఆమె అలా అన్నందుకు ‘కాలమహిమ...’ అని తాత చింతయ్య నొచ్చుకుంటాడు. అయితే, ఒకప్పుడు పొలాల్లో కూలిపనికి వచ్చిన దళిత స్త్రీల పట్ల (విలువలు లేని) రైతుల ప్రవర్తన గురించి తాత మర్చిపోయినా, ఆడది కనుక లింగి మర్చి పోయే అవకాశం లేదు. మరవడం సరే, నిజానికి చాలామంది పాఠకు లకు అస్సలు అది ఇప్పటికీ తెలియదు. ‘నరేగా’ (ఉపాధి హామీ పథకం) పన్లు వచ్చాక వీళ్ళను పట్టలేకపోతున్నాం, అంటున్న గ్రామీణ ఆధిపత్య వర్గాల ఫిర్యాదు మనవద్ద పదేళ్ల పాతది! కొలతల లెక్కలు తెలిసి, వొక పని పూర్తిచేయడానికి ముడిసరుకు ఎంత పడతందో, ‘స్కిల్డ్‌ లేబర్‌’ పన్లు చేసే బహుజన కులాలవారికి తెలుసు. అందువల్ల, తాపీ (బెల్దారి), వడ్రంగి, దర్జీ వంటి పన్లు; దేశానికీ అరవైఏళ్ళు వచ్చేవరకు మనవద్ద ఓబీసీలుగా పిలవబడే శూద్రకులాలు వారే చేసేవారు. ఒకప్పుడు వీటికి ‘డిమాండ్‌’ తక్కువ. అయితే, ఇప్పుడు ‘స్కిల్డ్‌ లేబర్‌’ కొరత తీవ్రంగా వుంది. ఇప్పుడు ఎస్సీ ‘ఆర్టిజాన్స్‌’ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వీరికి పని ఇవ్వడానికి యాజ మాన్యాల ఎంపికలో వీళ్ళు ఇంకా చివరి వరసలోనే వున్నారు. అదీ దాటడానికి ఇంకా ‘టైం’ పట్టొచ్చు. కీలకమైన పరిశీలనగా ఇనాక్‌ దీన్ని కథలోకి తెచ్చారు.


వేజెండ్ల రైతు నారయ్యకు ఈ రోజున ఎదురైన పరిస్థితికి జడిసి, మధ్య కోస్తాంధ్ర పెద్ద రైతులు పంట లాభాలు స్వంత నియోజకవర్గాల్లో మిల్లుల మీద పెట్టకుండా ముందు నుంచి జాగ్రత్తపడ్డారు. వారు డబ్బును మెడ్రాస్‌ సినిమాల్లో, హైదరాబాద్‌ ద్రాక్షతోటలు, ఫైనాన్స్‌ వ్యాపారాల్లో పెట్టి, సాగు బడిని ఏనాడో వదిలేసారు. ఇప్పుడు రైతు కూలీలు అదే దారిలో వున్నారు. కథా ప్రాంతం అయిన మధ్య కోస్తాంధ్ర ఓటర్లకు, వారికి ఉహ తెలిసిన దగ్గర నుంచి రాజకీయాల్లో వున్న నాయకుల కుటుంబాలవారు వందల, వేల కోట్లు బ్యాంక్‌ అప్పులు ఎగ్గొడుతున్నారు. జనం వాటిని టివిల్లో చూస్తు న్నారు. ఆ వార్తల ప్రభావం, పైనుంచి దిగువకు చివరిదాకా ప్రవహిం చడం మనం ఆపగలమా? లేదు. మరి అయితే లింగికి కూడా ‘రాజ్యం’ నుంచి రావలసిన తన వాటా ‘కేక్‌’ ముక్కను తను ఎలా కోసుకుని తినాలి? లింగి ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్మిన బుట్టను మూలకు విసిరేసింది! ఇక్కడ రచయిత అంటాడు - ‘‘విధవరాండ్రకు వచ్చే పెన్షన్‌ తల్లికీ కూతురికీ వస్తూఉంది. వెయ్యి రెండువేలు అయ్యేసరికి, లింగి కూర గాయలమ్మే గంప మూలన పారేసింది. నెలకు నాలుగు వేలు ఏం పని చేయకుండా వస్తుంటే, ఇద్దరికీ ఆనందమే!’’


ఇక కథలో రెండవ అంశం-‘నైతికత.’ మధ్యతరగతి ప్రమాణాల ప్రకారం ఉపాధికంటే ముఖ్యమైంది నైతికత. ‘వృద్ధి’ కథ కొందరికి అభ్యంతర కరంగా అనిపిస్తున్నది ఇక్కడే. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు రూరల్‌ ప్రాంతంలో కథ జరిగింది, అని వ్యాసం ఆరంభంలోనే అనుకున్నాము. అయితే, పట్టణాలను అనుకుని వున్న గ్రామాల్లోని పేద మహిళల పేగుబంధం, తల్లులుగా వారితో ఎలా తమ నైతికత కోల్పోయేట్టుగా చేస్తుందో, చూపిన కథలు గతంలో లేకపోలేదు. రెండు దశాబ్దాలు క్రితం నిజామాబాద్‌ జిల్లా నేపథ్యంగా జూకంటి జగన్నాధం (తెలంగాణ) రాసిన మంజీర కథల్లో చూసాం. చిత్తూరు-కడప రహదారి పక్కన ఉపాధి వెతుక్కున్న కుటుంబం నేప థ్యంగా గోపిని కరుణాకర్‌ (రాయలసీమ) రాసిన ‘కానుగపూల వాన’ కథ ల్లోనూ చూస్తాము. కానీ ఆ రెండింటిలో మనం చూసింది ‘వృద్ధి’ ప్రతి ఫలనం కాదు, కానీ ఇనాక్‌ (మధ్యాంధ్ర) ‘వృద్ధి’ కథలో మనం దాన్ని స్పష్టంగా చూస్తాం. ఈ తల్లీ కూతుళ్ళ ప్రవర్తన తెలిసిన గూడెం దాన్ని పట్టించుకోకపోవడం కూడా ‘వృద్ధి’కి వుండే ప్రధాన లక్షణం! ఈ విషయం కూడా దీని పక్కనేవున్న ఒంగోలు కథాస్థలంగా సాగే పాటిబండ్ల ఆనంద రావు సుప్రసిద్థ నాటకం ‘పడమటి గాలి’ లోనూ చూస్తాం. రైతు ఇంటిలో - మొగుణ్ణి వదిలి వచ్చిన చెల్లెలు అన్నతో తాను ఒంగోలు హాస్పటల్‌కు వెళ్ళాలి... అని తన ‘అబార్షన్‌’ ఖర్చులు-డబ్బులు గురించి మాట్లాడ్డం అక్కడ సీన్‌. ‘పోయినసారి అంత కాలేదుగా...’ అది, ఇంట్లోవాళ్ళ డైలాగ్‌! 


కథలో రచయిత ‘మిస్‌’ అయిన అంశాలు కూడా కొన్ని వున్నాయి. లింగి ఇంట్లో టీవీ లేదు, సౌందర్య చేతిలో సెల్‌ఫోన్‌ లేదు! ఇదెలా సాధ్యమ వుతుంది? ఇక, తెలుగునాట సృజన సాహిత్యం చదివేవారు గ్రామాల్లో తక్కువ. ఇప్పటికీ ఇంకా కథలు చదువుతున్నది పట్టణాలు, నగరాల్లో ఉండేవారే, వారే వాటిపై స్పందిస్తున్నారు కూడా. అందుకు పలు సామా జిక మాధ్యమాలు వారికి అందుబాటులో వున్నాయి. అయితే సమీక్షకుల కోసం ఈ కథలోని తల్లి కూతుళ్ళను మనం మధ్యతరగతిగా మార్చి, వాళ్ళను ఏదో ఒక నగరంలో వొక ‘ఫ్లాట్‌’ లోఉంచితే, అప్పుడు వాళ్ళు ఏమవు తారు? పోనీ అప్పుడు లింగి కూతురు... ‘‘దమయంతి కూతురు’’ కావడానికి అవకాశం ఉందా? పోలిక లేదు అనిపిస్తే, పోనీ మన ‘అర్బన్‌ మిడిల్‌ క్లాస్‌’లో ఫాలోయింగ్‌ వున్న దీపామెహతా 1989 నాటి ‘ఫైర్‌’ సినిమా తీసుకుందాం. బిజినెస్‌ బిజీలో వున్న భర్తల నిర్లక్ష్యానికి గురైన తోడికోడళ్ళు షబానా అజ్మీ-నందితా దాస్‌ (పాత్రలు) ‘లెస్బియన్స్‌’గా మారి ఇంట్లోనే ప్రత్యమ్నాయం వెతుక్కుని ఊరట పొందడాన్ని మనం సానుభూతిగా చూసాం. అయినా వాళ్ళిద్దరికి అర్బన్‌ శైలిలో ‘సింగిల్‌ విమెన్‌’ స్థాయి కష్టమా? మళ్ళీ పెళ్లి వద్దు అనుకుంటున్నవారు వుంటున్నారు. పెళ్లి తర్వాత పిల్లలు వద్దు అనుకుంటున్నవారు వుంటున్నారు. అటువంటి ‘అర్బన్‌ రిజర్వేషన్లు’ గ్రామీ ణులకు ఇవ్వటానికి అభ్యంతరం ఎవరికి? అదే సిటీ అయితే, అరిచేతిలో అందుబాటులోకి వచ్చిన ‘పోర్నో’తోనో లేదా ‘ఫైర్‌’ తరహాలోనో ఈ కథలోని యువతులు ముగింపు ఉండివుంటే, ‘కథ’ వేరుగా వుండేదేమో. బహుశా వృద్ధాప్యం కారణంగా, రచయిత ఇనాక్‌ అంత ‘అప్‌డేట్‌’ కాలేదేమో. ఆయన ఫక్తు దేశవాళీ పద్ధతిలోనే వాళ్ళిద్దరికీ పరిష్కారాలు వెదికారు. దాంతో వొక దశ దాటాక... లింగి, ఆమె కూతురు వైపు కథ పూర్తిగా వొడ్డిగిల్లింది. మళ్ళీ దాన్ని ‘బ్యాలెన్స్‌’ చేయడం రచయితతో అవ్వలేదు. అక్కడికీ ఆయన ముసలోడు చింతయ్యతో ప్రయత్నించి, వల్లకాక చివరికి ఇనాక్‌ చింతయ్యగా మారి, లింగి గుడిసె ముందు వేపచెట్టు క్రింద అనుగ్రహభాషణం చేయ బోయినా, తాతతో చెప్పించిన- ‘‘శ్రమశక్తిగా, ఉత్పత్తి శక్తి, జీవశక్తి, పునరు త్పత్తి శక్తి’’ వంటివి ముసలోడి ‘లిప్‌ మూవ్మెంట్‌’కు నప్పక, కేవలం ‘డబ్బింగ్‌’ ఆడంబరంగా మిగిలాయి! అప్పటికే లింగి, ఆమె కూతురు కథను, రచయిత ఇనాక్‌ను కూడా తమకు కావాల్సిన వైపుకు ఈడ్చుకు పోయారు!

జాన్‌సన్‌ చోరగుడి


Updated Date - 2021-02-01T05:59:54+05:30 IST