ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!

ABN , First Publish Date - 2022-01-14T05:13:21+05:30 IST

రహదారుల మరమ్మతుల పనుల కోసం ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచినా సర్కారుకు చుక్కెదురైంది. తాజాగా నాల్గొసారి బిడ్లకు వెళ్లారు. వాటి పురోగతి అంతంతమ్రాతమే. వాటి విషయం తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. మరమ్మతుల టెండర్లకు స్పందన లేకపోగా చివరకు రోడ్ల అభివృద్ధికి కూడా ముందుకు రావడం లేదు. ఏడాది క్రితమే టెండర్లు ఖరారైన రహదారి అభివృద్ధి పనులకు కూడా ఇంతవరకు మోక్షం కలగలేదు.

ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!
కందుకూరులో పెద్దపెద్ద గుంతలు పడిన రోడ్డు

  టెండర్లు ఖరారై ఏడాది దాటింది

ఎప్పటికి పూర్తయ్యేనో..

‘ఎన్‌డీబీ’ రుణ సహాయంతో చేయదలచిన రోడ్ల అభివృద్ధి పనుల్లో జాప్యం

 

పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు

బిల్లుల మంజూరుపై సందేహాలతో వెనకడుగు

నిబంధనల ప్రకారం పనుల పూర్తికి గడువు 24నెలలే

తక్షణం పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌లిస్ట్‌లో

పెడతామంటూ ప్రభుత్వం హెచ్చరిక

అయినా ముందుకు రాని వైనం

ఒంగోలు(జడ్పీ)/పెద్ద దోర్నాల/ కొండపి/ కందుకూరు/ దర్శి, జనవరి 13:

    వేములపాడు - ఊళ్లపాలెం (ఓవీ రోడ్డు) రోడ్డులో ప్రధానమైన కందుకూరు - కనిగిరి వరకు రోడ్డు అభివృద్ధి కోసం 70 కోట్లతో 2020 డిసెంబరులో టెండర్లు పిలిచారు. చిత్తూరుకి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి చెందిన శ్రీనివాసా కన్‌స్త్రక్షన్స్‌ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. ఈ రోడ్డులో మిగిలిన పార్టు అభివృద్ధికి కూడా మరో రూ.20 కోట్లతో టెండర్లు జరగ్గా ఒంగోలుకి చెందిన మరో కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకోగా వాళ్లు కూడా పనులు ప్రారంభించలేదు.  

-పొదిలి-వినుకొండ రోడ్డు అభివృద్ధి పనులకు అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ స్పందన లేదు. పొదిలి-దర్శి మధ్యలో 20కిలోమీటర్లు దూరం రోడ్లు అభివృద్ధికి రూ.2.5కోట్లు నిధులు విడుదలయ్యాయి. అధికారులు చివరిగా గత డిసెంబరులో నాల్గవసారి టెండర్లు పిలిచారు. అదేవిదంగా దర్శి-కురిచేడు రోడ్డులో దర్శి టౌన్‌ నుంచి సాగర్‌ కాలువ వరకు 3 కిలోమీటర్ల దూరం సీసీరోడ్డు వేసేందుకు గతేడాది ఎన్‌డీపీ కింద రూ.3కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఈ పనుల నిర్వాహణకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.     

-టంగుటూరు- పొదిలి రోడ్డు  67 కిలోమీటర్లు ఉండగా ప్రధానంగా టంగుటూరు నుంచి కొండపి వరకు 23 కిలోమీటర్లు అధ్వానంగా తయారైంది. వర్షాలకు మరింతగా గోతులు పెద్దవయ్యాయి. కొండపి నుంచి పొదిలి వరకు 44 కిలోమీటర్లు ఉండగా ప్రధానంగా కొండపి నుంచి పెట్లూరు వరకు 10కిలోమీటర్లు దారుణంగా తయారైంది. కాగా రోడ్డు బాగు కోసం టెండర్లు పూర్తి అయ్యాయి. కానీ కాంట్రాక్టర్‌ పనులు చేయడానికి ముందుకు రాలేదు.

- మార్కాపురం- పెద్దదోర్నాల రోడ్డులో దేవరాజుగట్టు నుంచి పెద్దారవీడు వరకు రోడ్డు అభివృద్ధి కోసం రూ.కోట్లలో నిధులు మంజూరయ్యాయి. టెండర్‌ పూర్తై ఏడాదైన  నిర్మాణం పనులు చేపట్టలేదు. చేసిన పనికి బిల్లులు సక్రమంగా అందకపోవడంతో గుత్తేధారులు ముందుకు రావడంలేదని సర్వత్రా వినిపిస్తోంది. 

-సర్కారు పనులంటేనే కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. మే చేయలేం అంటూ చేతులేత్తేస్తున్నారు. అధికారులు బలవంతపెట్టినా సరే ససేమిరా అంటున్నారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో వారిని ఇబ్బందిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ఎన్‌డీబీ రోడ్‌ టెండర్లే నిదర్శనం. టెండర్‌ ప్రక్రియ పూర్తయి ఏడాది దాటినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లిస్తుందనే నమ్మకం లేకపోవటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. రోడ్లు మాత్రం వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి.


 రహదారుల మరమ్మతుల పనుల కోసం ఇప్పటికి  మూడుసార్లు టెండర్లు పిలిచినా సర్కారుకు చుక్కెదురైంది. తాజాగా నాల్గొసారి బిడ్లకు వెళ్లారు. వాటి పురోగతి అంతంతమ్రాతమే. వాటి విషయం తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. మరమ్మతుల టెండర్లకు స్పందన లేకపోగా చివరకు రోడ్ల అభివృద్ధికి కూడా ముందుకు రావడం లేదు. ఏడాది క్రితమే టెండర్లు ఖరారైన రహదారి అభివృద్ధి పనులకు కూడా ఇంతవరకు మోక్షం కలగలేదు. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు సహకారంతో జిల్లాలో దాదాపు రూ.187కోట్ల వ్యయంతో ఏడు రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించి అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను 2020 డిసెంబరులోనే పూర్తిచేసింది. ఆ పనుల కేటాయింపుల్లో కూడా వివిధ ఆరోపణలు వచ్చినప్పటికీ చివరికి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సంస్థ టెండరు దక్కించుకుంది. ఇంకేముంది చకచకా పనులు పూర్తిచేసి 24 నెలల వ్యవధిలోనే ఏడు రోడ్ల అభివృద్ధిని పూర్తిచేసి జిల్లా వాసులకు అందుబాటులోకి తెస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. రుణ సహాయం చేయడానికి న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకుతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, నిధుల విషయంలో కూడా ఇబ్బంది లేనట్టేనని ప్రభుత్వం అప్పట్లో ఘనంగా వెల్లడించింది. అయినప్పటికీ ఇంతవరకు పనులకు అతీగతి లేదు. టెండర్లు ఖరారయిన పదిరోజుల్లోపే పనులు ప్రారంభం కావాల్సినప్పటికీ దాదాపు నెలన్నర తర్వాత ఒప్పందాలు తదనంతర ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కూడా పనులు ఊపందుకోలేదు. ఇప్పటికీ సంవత్సరం గడచింది. కనీసం 10శాతం పనులు కూడా పూర్తికాలేదు. బిడ్లు ఖరారైన 24 నెలలలోపు పనులు పూర్తికావాలని నిబంధనలు సూచిస్తున్నాయి. పనుల విషయంలో ప్రస్తుత పురోగతి ప్రకారం 2023కు కూడా అవి పూర్తయ్యే అవకాశాలు  కనపడడం లేదు.


 అధ్వానంగా జిల్లా రహదారులు

ఒకవైపు అధ్వానంగా ఉన్న జిల్లా రహదారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. టెండర్లు పిలవడానికి, పనులు కేటాయించడానికి ఏడాది సమయం, ఆపై ఆ పనులు ప్రారంభించడానికి మరో ఏడాది... అవి పూర్తవడానికి ఇంకో రెండేళ్లు. ఇదీ సర్కారు వారికి ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి, రోడ్ల విస్తరణపై ఉన్న శ్రద్ధ.  ఈ మధ్యలో వచ్చిన నివర్‌, వాయుగుండాల ధాటికి అంతో ఇంతో మనుగడలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు కూడా నరకానికి చిరునామాగా మారాయి. టెండర్లు ఖరారైన పనులకే ఇంతవరకు దిక్కులేకపోతే ఇక మరమ్మతుల సంగతి మరచిపోతే మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. మరమ్మతుల పనులకు సంబంధించి గత ఆర్నెల్లుగా బిడ్లు పిలుస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు.. కానీ అప్పుడప్పుడు ప్రభుత్వం సమీక్షలు పెట్టి ఇంకేముంది మరో మూడు నెలల్లో ఆర్‌అండ్‌బీ రహదారులను అద్దంలా తీర్చిదిద్దుతాం అనే ప్రకటనలు ఇస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు. జిల్లా ప్రజలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్న రహదారులపై ప్రయాణాలు సాగించలేక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడంతో పాటు, మరమ్మతులను వెంటనే చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని జిల్లా వాసులు అభ్యర్థిస్తున్నారు 


ఎన్‌డీపీ అభివృద్ధి చేయదలచిన రోడ్లు

ఉళ్లపాలెం-వేములపాడు రోడ్డు, పొదిలి-వినుకొండ, టంగుటూరు-పొదిలి, మార్కాపురం-దోర్నాల, యర్రగొండపాలెం-త్రిపురాంతకం, పొదిలి-మార్కాపురం తదితర 13 రోడ్ల అభివృద్ధి పనులకు 2020 డిసెంబరులో ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. వీటిలో యర్రగొండపాలెం-త్రిపురాంతకం, టంగుటూరు-పొదిలి రోడ్లు అయితే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.


సంప్రదాయ విధానానికి స్వస్తి

టెండర్ల ఖరారులో కూడా గతంలో ఎన్నడూ లేనట్టు ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లను పక్కనపెట్టి జిల్లాను యూనిట్‌గా తీసుకుని పనులను అప్పగించింది. అందులోభాగంగా చిత్తూరు జిల్లాకు చెందిన సంస్థ టెండర్లను దక్కించుకుంది. ఏడాది గడిచినా సంస్థ పనుల విషయంలో వేగం పెంచలేదు. ఇప్పటికే భారీగా బిల్లులు బకాయిలు ఉండటంతో ఇవి కూడా పెండింగ్‌లో ఉంటాయనే భయంతో సదరు సంస్థ పనుల విషయంలో క్రియాశీలకంగా ఉండడం లేదనేది కూడా సమాచారంగా ఉంది.


బ్లాక్‌లిస్టులో పెడతామంటూ ప్రభుత్వం హెచ్చరిక

గత సంవత్సరం నవంబరు 16న ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి పనులపై జరిపిన సమీక్షలో టెండర్లు దక్కించుకుని ఇంకా రంగంలోకి దిగని సంస్థలను బ్లాక్‌లిస్టులో పెడతామంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హెచ్చరికలు సైతం జారీచేశారు. మరో వారంరోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభం కావాల్సిందేనని కూడా అప్పట్లో ఆదేశించారు. ఆ హెచ్చరికలను సదరు సంస్థ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకా అలైన్‌మెంట్‌, క్లియరెన్స్‌లు అంటూ కాలయాపన తప్ప పనులు చరుగ్గా సాగడంలేదు 





Updated Date - 2022-01-14T05:13:21+05:30 IST