Abn logo
Sep 30 2020 @ 02:30AM

థియేటర్‌లో సినిమా చూడడం ఎంజాయ్‌ చేస్తా!

Kaakateeya

ఓ ‘అరుంధతి’... ఓ ‘రుద్రమదేవి’... ఓ ‘భాగమతి’... ఇలా మహిళా ప్రాధాన్య చిత్రాలకు అనుష్క చిరునామాగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం  ‘నిశ్శబ్దం’ శుక్రవారం ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో అనుష్క ముచ్చటించారు. 


‘ఆదిపురుష్‌’...లేదండీ!

‘‘మీరు ‘ఆదిపురుష్‌’లో సీతగా నటించనున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనా?’’ అని అనుష్కను ప్రశ్నించగా... ‘‘లేదండీ! ఆ చిత్రానికి సంబంధించి నా దగ్గరకు ఏదీ రాలేదు. చర్చలేవీ జరగలేదు. ఆ టాపిక్‌ అసలు రాలేదు’’ అని సమాధానమిచ్చారు.


ఇంట్లోనే ఉన్నాను!

‘లాక్‌డౌన్‌లో ఏం చేశారు?’ అని అనుష్కను అడగ్గా... ‘‘నా గురించి నేను తెలుసుకున్నా. జీవిత లక్ష్యం ఏంటని ఆలోచించా. కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నా. సాధారణంగా మా కుటుంబంలోని అందరం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాం. కానీ లాక్‌డౌన్‌లో అందరం ఇళ్లలోనే ఉన్నాం. కొన్నిసార్లు సినిమాలు చూశా. రెండు నెలలుగా కొన్ని మంచి కథలు వింటున్నాను. ఇంతకు ముందు అంగీకరించినవి ఉన్నాయి కాబట్టి అవి పూర్తయ్యేవరకూ వెంటనే కొత్తవి అంగీకరించలేను. అవి పూర్తయ్యేవరకూ వెయిట్‌ చేయాలి’ అని చెప్పారు.


‘నిశ్శబ్దం’లో చెవిటి-మూగ యువతిగా నటించారు. ఆ  పాత్ర కోసం ఎలాంటి హోమ్‌వర్క్‌ చేశారు?

ఈ పాత్రలో నటించడం నాకొక సవాల్‌. రెండు నెలలు సైన్‌ లాంగ్వేజ్‌(సైగలతో మాట్లాడటం) నేర్చుకున్నా. చిత్రీకరణకు అమెరికా వెళ్లిన తర్వాత సైన్‌ లాంగ్వేజ్‌ ఇండియాలో ఓ విధంగా, అక్కడ మరో విధంగా ఉంటుందని తెలిసింది. అమెరికా నేపథ్యంలో నడిచే కథ కావడంతో అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా. ఇదొక థ్రిల్లర్‌ సినిమా. స్ర్కీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చేసిన అన్ని చిత్రాల కంటే డిఫరెంట్‌గా ఉంటుందీ సినిమా. ప్రతి పాత్ర, సన్నివేశం కథను ముందుకు తీసుకువెళతాయి. 


అవార్డులు ఆశిస్తున్నారా?

అవార్డుల కంటే... ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే ముఖ్యం. కొత్త పాత్రలో నటిస్తున్నప్పుడు కలిగే  అనుభూతి వే రేలా  ఉంటుంది. ఎలా చేస్తున్నామో తెలియదు కనుక నెర్వస్‌గానే ఉంటుంది.  డైలాగులు లేకుండా నటించడం నాకూ కొత్తే.


ఓటీటీలో విడుదలవుతున్న మీ తొలి చిత్రమిది. ఏమనిపిస్తోంది?

ఓటీటీ విడుదల అనేది నాకు మాత్రమే కాదు... చిత్రసీమకూ కొత్తే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా   ప్రతి ఒక్కరూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. వేరే మార్గం లేదు. అయితే, థియేటర్లు థియేటర్లే. ఓటీటీ ఓటీటీయే. రెండూ వేర్వేరు అంశాలు.  అన్నిటికంటే ప్రేక్షకులకు కథ చేరువ కావడమే ఇప్పుడు ముఖ్యం. కొవిడ్‌-19 వల్ల విడుదల ఆలస్యమైంది. నా వరకూ థియేటర్‌లో సినిమా చూడటమనేది మేజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌. నేను థియేటర్‌లో సినిమాలు చూడడమే ఎంజాయ్‌ చేస్తా. 

ఈ చిత్రం కోసం బరువు తగ్గారా? బరువు తగ్గుతున్న క్రమంలో ఈ చిత్రం చేశారా?

రెండూ కాదండీ! ‘భాగమతి’, ‘సైరా..’ తర్వాత నేను బ్రేక్‌ తీసుకున్నాను. అప్పుడు నా దగ్గరకు ‘నిశ్శబ్దం’ కథ వచ్చింది. తక్కువ సమయంలో ఇలా చేస్తే బావుంటుందని అనుకుని సినిమా చేశాం. కోన వెంకట్‌గారు ఈ కథ చెప్పడానికి ముందు నేను ఇతర స్ర్కిప్ట్‌లేవీ వినలేదు. ‘నిశ్శబ్దం’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో చేశా.


ఇమేజ్‌ పరంగా మీ మీదే సినిమా బాధ్యతలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. ఒత్తిడిగా భావిస్తున్నారా?

నేనెప్పుడూ నమ్మేది ఒక్కటే... సినిమా ఒక్కరిది కాదు. జయాపజయాలు ఒక్కరి మీదే ఆధారపడవు. సినిమా వెనుక చాలామంది పనిచేస్తారు. నా మీద ఒత్తిడి ఉంటుందనేది నమ్మను.  అయితే ఈ సినిమాకు మాత్రమే కాదు కొన్ని  విభిన్న పాత్రలు చేసినప్పుడు  ఒత్తిడి తప్పకుండా  ఉంటుంది.  ఎక్కువ బాధ్యత దర్శకుడి మీదే ఉంటుంది. హేమంత్‌ మధుకర్‌ సినిమాను బాగా తీశారు. నటీనటుల నుంచి తనకు కావాల్సింది తీసుకోవడం ఆయన ప్రత్యేకత. సంగీతం సైతం సినిమాలో ముఖ్య భూమిక పోషించింది.


మాధవన్‌తో చాలా ఏళ్ల తర్వాత నటించారు. హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు... సినిమాలో చాలామంది ఉన్నారు కదా!


అవును. ‘బ్లాక్‌’ వంటి సినిమా చూస్తే అందులో మూగమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఈ చిత్రంలో నేను పోషించిన సాక్షి సహా అన్ని పాత్రలకూ ప్రాముఖ్యం ఉంటుంది. ‘బాహుబలి’లో భారీ స్టార్‌ కాస్ట్‌ ఉంది. దాని తర్వాత మళ్లీ ఈ చిత్రానికి అటువంటి స్టార్‌ కాస్ట్‌తో నటించిన అనుభూతి కలిగింది. నా తొలి తమిళ చిత్రంలో ‘మాధవన్‌’తో నటించాను. మళ్లీ అతనితో నటించడం మంచి అనుభూతి ఇచ్చింది. మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ పెద్ద స్టార్‌. ‘కిల్‌ బిల్‌’ వంటి చిత్రాల్లో ఆయన్ను చూశాం. నటుడిగా ఆయన ప్రయాణం, అనుభవాలను అడిగి తెలసుకునేదాన్ని. పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న నా తొలి చిత్రమిది. అమెరికాలోని సియాటెల్‌లో సినిమా చేశాం. వేరే పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను తీసుకుని సినిమా చేయడం మంచిదే.  కొత్త వ్యక్తులను కలిసి వాళ్ల సంస్కృతి, కొత్త విషయాలు తెలుసుకోవడంనాకు  ఇష్టం.


భవిష్యత్తులో క్రాస్‌ ఓవర్‌ ఫిల్మ్స్‌... రెండు మూడు భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక బృందంతో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేసే  ట్రెండ్‌ పెరుగుతుందని అనుకుంటున్నారా?

ఓటీటీ నాకూ కొత్తే. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్నా. ఓటీటీ అనే కాదు... కొన్నేళ్లుగా పాన్‌-ఇండియన్‌  మూవీస్‌ వస్తున్నాయి. ఉత్తరాదికి వెళితే తెలుగు, తమిళ చిత్రాల గురించి అడుగుతారు. క్రాస్‌ ఓవర్‌ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సినిమా పరిధి విస్తృతమవుతోంది. జపాన్‌లో ‘బాహుబలి’కి దక్కిన ఆదరణ అద్భుతం. భవిష్యత్తులో ఓటీటీ ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ, థియేటర్లు లేని చోటుకి ఓటీటీ చేరుకోగలదు.


లాక్‌డౌన్‌లో కొత్త కథలు ఏవైనా విన్నారా?

ఇటీవలే వినడం మొదలుపెట్టా. అయితే, అంతకు ముందే మాట్లాడినవి రెండుమూడు ఉన్నాయి. బ్రేక్‌ తీసుకున్నప్పుడూ కథలు వినలేదు. త్వరలో ఆ నిర్మాతలే సినిమాలు ప్రకటిస్తారు. డిసెంబర్‌ వరకూ ఏదీ ప్రారంభం కాదు. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభిస్తా. కొంతమంది వెబ్‌ సిరీస్‌ కోసం సంప్రదించారు. ఆయా కథల్లో కీలకాంశాలు చదివా. కానీ, ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. కథ నచ్చితే చేస్తా. 

Advertisement
Advertisement