సర్కారీ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం 1వ తరగతి నుంచే!

ABN , First Publish Date - 2022-01-19T08:40:48+05:30 IST

రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉండనుంది! అలాగే..

సర్కారీ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం 1వ తరగతి నుంచే!

  • వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లలో షురూ 
  • 1వ తరగతికి ముందు కొంతకాలం ప్రత్యేక తరగతి!
  • తెలుగు మీడియం మాత్రం తప్పనిసరి
  • ఉన్న టీచర్లకు శిక్షణ, కొత్తవారి నియామకం
  • కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయాలే కీలకం


హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉండనుంది! అలాగే.. వచ్చే ఏడాదినుంచి రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో దీని అమలుపై విద్యా శాఖ అధికారుల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినా.. తెలుగు మీడియం తరగతులు కూడా అందుబాటులో ఉంచాల్సిందేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనపై కేంద్రంతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని నూతన విద్యా విధానంలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియం క్లాసులను కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో సుమారు 26 వేల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు వచ్చే ఏడాది నుంచి ఆ బడులన్నింటిలో ఒకేసారి ప్రారంభించాల్సి ఉంది. మొదటి ఏడాది ఒకటో తరగతి, తర్వాత సంవత్సరం రెండవ తరగతి, ఇలా రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ల కాలంలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం అమలులోకి వచ్చే వీలుంది. ఏ మీడియంలో చేరాలనే నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులదే. కాగా సక్సెస్‌ స్కూళ్ల పేరిట ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో 6 వేలదాకా ప్రైమరీ స్కూళ్లు ఉండగా, మిగతావి హైస్కూళ్లు. అయితే... సక్సెస్‌ స్కూల్‌ విధానంలో 6వ తరగతి నుంచి మాత్రమే ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. కింది తరగతులకు ఈ అవకాశం లేదు.


ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లోలా..

ఇంగ్లిష్‌ మీడియాన్ని ఇప్పటికే ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో అమలు చేస్తున్నారు. ఆయా కళాశాలల్లో తెలుగుతోపాటు ఆంగ్లమాధ్యమంలో కూడా తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల పరిధిలో కూడా ఇలాగే రెండు మాధ్యమాలనూ అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వం యోచనగా చెబుతున్నారు. ఈ మేరకు.. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను నిర్వహణ కోసం ఇప్పుడున్న టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొంత మంది ఉపాధ్యాయులకు ఇంగ్లి్‌షలో శిక్షణ ఇచ్చి, వారి చేత స్కూళ్లను నడిపించనున్నారు. తర్వాత ఖాళీల భర్తీలో ఇంగ్లిష్‌ బోధించే సామర్థ్యం కలిగిన అభ్యర్థులనే ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నియామక పరీక్షల్లో చేర్పులు, మార్పులను తీసుకురానున్నారు. అలాగే.. టెట్‌, బీఎడ్‌ వంటి వాటిల్లో కూడా మార్పులు తేవాలని భావిస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో ఉన్నాయి. వీటిల్లో 5వ తరగతి నుంచి అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ స్కూళ్లు తెలుగు మీడియంలో కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి స్కూళ్లను కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చనున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని స్థాయుల్లోని విద్యాసంస్థల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టనున్నారు.


బడిలో చేరడానికి ముందు..

అంగన్‌వాడి కేంద్రాల నుంచి పాఠశాలల్లో చేరడానికి ముందు.. ఆరు నెలలపాటు లేదా కొంతకాలంపాటు పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధనను ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రైవేట్‌లో ఎల్‌కేజీ, యూకేజీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకటో తరగతికి ముందు ఇంగ్లిష్‌లో ఒక తరగతిని నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర తరగతుల్లో తెలుగుమీడియంలో చదువుతున్న వారు ఇంగ్లిష్‌ మీడియంలోకి మారాలంటే అందుకు అవకాశం ఉంటుందా? లేదా? అంటే.. అది కేబినెట్‌ సబ్‌ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న సక్సెస్‌ స్కూల్స్‌ తరహాలో మధ్య తరగతుల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలంటే అందుకు అనేక అడ్డంకుల్ని దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయితీ నుంచి తీర్మానం చేయాలి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ తీర్మానంతో పాటు ఆర్‌అండ్‌బీ, ఫైర్‌, వైద్యం వంటి సుమారు 20 శాఖల నుంచి ఎన్‌వోసీలను పొందాల్సి ఉంటుంది. పైగా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదనే గ్యారంటీని సంబంధిత స్కూల్‌ హెచ్‌ఎం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎంఈవో ద్వారా డీఈవోలకు పంపిస్తే అక్కడినుంచీ ఆర్‌జేడీస్థాయిలో అనుమతి ఇస్తున్నారు.  


ఉపాధ్యాయుల విషయంలోనూ..

భవిష్యత్తులో ఇంగ్లిష్‌ మీడియం బోధించే ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలోనూ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకటి, రెండేళ్లపాటు పెద్దగా ఇబ్బందులు రావని అంచనా వేస్తున్నారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేయడానికి ప్రస్తుతం ఉన్న టీచర్లకు శిక్షణ ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. తరగతులు పెరిగే కొద్దీ మాత్రం ఉపాధ్యాయుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కొత్త నియామకాలను చేపట్టే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే... భవిష్యత్తులో ఇంగ్లి్‌షలో బోధించే అభ్యర్థులను సిద్ధం చేయడంలో భాగంగా బీఎడ్‌ వంటి కోర్సుల నిర్వహణలో కూడా ఇంగ్లిష్‌ మీడియం సీట్లను పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం, మన ఊరు-మన బడి పథకం ప్రారంభంపై చర్చించడానికి త్వరలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కానుంది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు కరోనా సోకినందున ఆయన కోలుకున్న తర్వాత సబ్‌ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. 


ప్రశంసలు.. విమర్శలు..

ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయం అమలు ద్వారా తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెరిగి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌ అభిప్రాయపడ్డారు. సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దముక కమలాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 


భావితరాల ప్రయోజనాల కోసమే: మంత్రి సబిత

భావితరాల ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియం, పాఠశాలల అభివృద్ధి వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యల్ని చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మన ఊరు-మన బడి పేరిట రూ.7,289 కోట్లను ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో పనులను చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఈ పనుల తీరుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిలెల్లగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నిర్మాణాల కోసం రూ. 3.57 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. వాటి పనులు 40ు పూర్తయ్యాయని తెలిపారు.

Updated Date - 2022-01-19T08:40:48+05:30 IST