బంతి పడింది

ABN , First Publish Date - 2020-07-09T09:10:24+05:30 IST

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదు రు చూసిన క్రికెట్‌.. 117 రోజుల తర్వాత మళ్లీ ఆరంభమైంది. ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌

బంతి పడింది

తొలి రోజు 106 బంతులు.. 35 పరుగులే

పలుమార్లు ఆటకు అంతరాయం

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్ట్‌ 

కరోనా కాలంలో.. క్రికెట్‌ సందడి మొదలైంది. దాదాపు నాలుగు నెలలపాటు మౌనం ఆవహించిన స్టేడియంలో.. బంతి పడింది.. బ్యాట్‌ను తాకిన శబ్దం ఉత్సాహాన్ని రేపింది. లాక్‌డౌన్‌ తర్వాత ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య తొలి టెస్ట్‌తో క్రికెట్‌ రీస్టార్ట్‌ అయింది. వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. బయో సెక్యూర్‌ వాతావరణంలో.. క్రికెట్‌ కొత్తకొత్తగా కనిపించింది. అభిమానులు లేని ఖాళీ స్టేడియం.. కరచాలనం లేకుండా టాస్‌.. మైదానంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ నిలబడడం.. 143 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అనుభవం. వరుణుడు చికాకు పరచినా.. ఎట్టకేలకు ఆట ఆరంభమైంది. కానీ, పలుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్‌లో మజా రాలేదు. కానీ, కొన్ని రోజులుగా నెలకొన్న స్తబ్దతను మాత్రం బ్రేక్‌ చేసింది.


సౌతాంప్టన్‌: ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదు రు చూసిన క్రికెట్‌.. 117 రోజుల తర్వాత మళ్లీ ఆరంభమైంది. ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌.. వరుణుడి దోబూచులాట మధ్య బుధవారం మొదలైంది. వర్షం కారణంగా తొలి సెషన్‌ తుడిచిపెట్టుకు పోయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. అయితే రెండో ఓవర్‌లోనే సిబ్లేను గాబ్రియెల్‌ (1/19) డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత వెలుతురు లేమి, వర్షం కురవడంతో 39.2 ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 17.4 ఓవర్లలో 35/1 స్కోరు చేసింది. ఓపెనర్‌ బర్న్స్‌ (20), డెన్లీ (14) క్రీజులో ఉన్నారు. 


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య టీమ్‌ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండానే ఓపెనర్‌ సిబ్లే (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే, వికెట్‌ తీసిన ఆనందంలో విండీస్‌ ఆటగాళ్లు నిబంధనలు మరచి హైఫైవ్‌ చేసుకున్నారు. మూడు ఓవర్లకు 1/1తో ఉన్నప్పుడు వాన కారణంగా రెండుసార్లు మ్యాచ్‌ను ఆపాల్సి వచ్చింది. డెన్లీ అడపాదడపా బౌండ్రీలు కొడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాలని చూశాడు. అయితే, 17.4 ఓవర్లలో 35/1 స్కోరుతో ఉన్న సమయంలో వెలుతురు మందగించడంతో మరోసారి అవరోధం ఎదురైంది. ఇరు జట్లూ టీకి వెళ్లాయి. కానీ, ఆ తర్వాత వర్షం ఊపందుకోవడంతో తొలి రోజు ఆటను ముగించాల్సి వచ్చింది. మొత్తం గా 82 నిమిషాల ఆటలో 106 బంతులు మాత్రమే పడ్డాయి. 


‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు సంఘీభావంగా.. 

సౌతాంప్టన్‌లో క్రికెట్‌ మొదలవడానికి ముందే.. భావోద్వేగ క్షణాలు చోటు చేసుకొన్నాయి. తొలి బంతి వేయడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో దూరంగా నిలబడి.. కొవిడ్‌ బారినపడి మరణించిన వారికి సంతాపంగా మౌనం పాటించారు. గత వారం మృతి చెందిన వెస్టిండీస్‌ దిగ్గజం ఎవర్టన్‌ వీక్స్‌కు కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతి వివక్షకు వ్యతిరేంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అనేక మంది వెస్టిండీస్‌ క్రికెటర్లు, ఇంగ్లండ్‌ బోర్డు కూడా ఈ ఉద్యమానికి ఈపాటికే మద్దతు ప్రకటించాయి. మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి  సంఘీభావం ప్రకటించారు. విండీస్‌ ఆటగాళ్లు పిడికిలి బిగించిన చేతిని పైకెత్తి తమ మద్దతు తెలిపారు. ఇంగ్లండ్‌, విండీస్‌ ఆటగాళ్లు కాలర్లపై ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే లోగోను ముద్రించిన జెర్సీలను ధరించారు. 


స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌: రోరి బర్న్‌ (నాటౌట్‌) 20, డొమినిక్‌ సిబ్లే (బి) గాబ్రియెల్‌ 0, జొ డెన్లీ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 17.4 ఓవర్లలో 35/1; వికెట్‌ పతనం: 1-0; బౌలింగ్‌: కీమర్‌ రోచ్‌ 6-4-2-0, షానన్‌ గాబ్రియెల్‌ 5-1-19-1, అల్జారీ జోసెఫ్‌ 3.4-1-11-0, జాసన్‌ హోల్డర్‌ 3-1-3-0. 

Updated Date - 2020-07-09T09:10:24+05:30 IST