బర్మింగ్‌హామ్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు (Rescheduled match)లో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 378 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 259/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన స్టోక్స్ సేన మరో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. జోరూట్ (Joe Root), బెయిర్‌స్టో (Jonny Bairstow)లు ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. రూట్ 173 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్‌తో 142 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో బెయిర్‌స్టో మరోమారు శతకబాదాడు. 145 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌తో 114 పరుగులు చేశాడు.
నాలుగో రోజు వరకు పటిష్ఠ స్థితిలో కనిపించిన భారత్ (Team India) ఆ తర్వాత మాత్రం క్రమంగా ఓటమి అంచుల్లోకి జారుకుంది. వికెట్లు తీయడంలో విఫలమైన భారత బౌలర్లు.. ఒత్తిడి పెంచలేకపోయారు. ఫలితంగా రూట్, బెయిర్‌స్టోలు యథేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. నాలుగో రోజు మూడు వికెట్లు తీసి జోరు చూపించినప్పటికీ ఆ తర్వాత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా అందినట్టే అందిన విజయం భారత్ చేజారింది.
స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ : 416
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ :284
భారత్ రెండో ఇన్నింగ్స్: 245
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378
ఇవి కూడా చదవండి