Abn logo
Jul 24 2020 @ 03:46AM

ఆఖరి పోరుకు సై..

కరోనాతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయిన వేళ.. అభిమానుల్లో ఆసక్తి రేపుతూ ప్రారంభమైన ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ ఆఖరి అంకానికి చేరింది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టులు సంప్రదాయక టెస్టు ఫలితా లకు భిన్నంగా అదరహో.. అనిపించాయి. నేటి నుంచి మాంచెస్టర్‌లో జరిగే చివరి మ్యాచ్‌ కూడా ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకే సిరీస్‌ దక్కుతుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాతనైనా ఇక్కడ టెస్టు సిరీస్‌ సాధించాలని కరీబియన్లు పట్టుదలతో ఉండగా.. గత సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకో వాలన్న కసితో ఆతిథ్య జట్టు ఉంది..


చరిత్రాత్మక విజయం కోసం వెస్టిండీస్‌ 

ప్రతీకారం కోసం ఇంగ్లండ్‌

నేటి నుంచి చివరి టెస్టు


ఓల్డ్‌ ట్రాఫోర్ట్‌లో 2002 నుంచి ఇంగ్లండ్‌ ఒక్కసారే (2019లో ఆసీ్‌సపై) ఓడింది


ఇంగ్లండ్‌ గడ్డపై విండీస్‌ చివరిసారి 1988లో టెస్టు సిరీస్‌ గెలిచింది 


ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు టెస్టుల్లో విండీస్‌ 3, ఇంగ్లండ్‌ 2 విజయాలతో ఉన్నాయి


మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌-విండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీ్‌సలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడి ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలోనే శుక్రవారం నుంచి మూడో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్‌ టెస్టులో అంచనాలకు మించి రాణించి విండీస్‌ తొలి టెస్టును గెలవగా.. లోపాలను సరిదిద్దుకుంటూ రెండో టెస్టులో తామేంటో నిరూపించింది ఆతిథ్య ఇంగ్లండ్‌. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకిది చావో.. రేవో పరిస్థితి. సరైన సమయంలో అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్‌ ట్రాక్‌లోకి రావడంతో రూట్‌ సేన సిరీ్‌సలో నిలవగలిగింది. మరోవైపు విండీస్‌ ఆటతీరు ఊహించని రీతిలో ఉంది. తొలి టెస్టులో టాప్‌ క్లాస్‌ ఆటను ప్రదర్శించినా.. ఆ తర్వాతి మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. ఫ్లాట్‌ ట్రాక్‌పై మొదట బౌలింగ్‌ను ఎంచుకోవడం కూడా వారిని దెబ్బతీసింది. అయితే, అంతిమ సమరంలో మరోసారి విజృంభించి విజ్డెన్‌ ట్రోఫీని నిలబెట్టుకోవాలని విండీస్‌ పట్టుదలతో ఉంది.

ఆర్చర్‌పై డైలమా..

సిరీ్‌సను సమం చేసిన జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు కనిపించడం లేదు. జోస్‌ బట్లర్‌ ఫామ్‌లో లేకపోయినా ఇబ్బంది లేదని భావిస్తోంది. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎప్పటిలాగే ప్రధాన ఆకర్షణ కానున్నాడు. రెండు టెస్టుల్లో అతడు 343 పరుగులు సాధించి ఊపులో ఉన్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనైతే 57 బంతుల్లోనే 78 రన్స్‌తో జట్టు విజయానికి వేదిక సిద్ధం చేశాడు. రూట్‌ ఆశలు రేపినా మొత్తంగా 40 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఓపెనర్‌ సిబ్లే శుభారంభం అందించాలనుకుంటున్నాడు. ఇక, బౌలింగ్‌ విభాగంలో మాత్రం మార్పులు ఖాయం గానే కనిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన కారణంగా పేసర్‌ ఆర్చర్‌ రెండో టెస్టుకు దూరమైనా ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. అయితే, జట్టుకు అతడి ప్రాతినిథ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కరోనా నిబం ధనలను ఉల్లంఘించినందుకు అతడు సోషల్‌ మీడి యాలో వర్ణవివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. దీంతో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందోనని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సందేహిస్తోంది. అటు వంద శాతం మానసికంగా ఫిట్‌గా ఉంటేనే బరిలోకి దిగాలనుకుంటున్నట్టు ఆర్చర్‌  కూడా తెలిపాడు. ఒకవేళ అతడు ఆడితే స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆండర్సన్‌తో కలిసి పేస్‌ పదును చూపిస్తాడు. లేకుంటే వోక్స్‌, సామ్‌ కర్రాన్‌, వుడ్‌లో ఒకరికి మూడో పేసర్‌గా అవకాశం దక్కుతుంది.

ఒత్తిడిలో విండీస్‌

రెండో టెస్టులో నెగ్గి సిరీస్‌ దక్కించుకోవాలని ఆశించిన కరీబియన్లు ఇప్పుడు ఒత్తిడిలో పడిపోయారు. టాస్‌ గెలిచినా నిర్లక్ష్యపు ఆటతో విండీస్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. షాయ్‌ హోప్‌, క్యాంప్‌బెల్‌ ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులుండవచ్చు. బ్రూక్స్‌ ఒక్కడే చక్కటి స్ట్రోక్‌ప్లేతో రెండో టెస్టులో రెండు అర్ధసెంచరీలతో పోరాడాడు. బౌలింగ్‌లో పేసర్లు గాబ్రియెల్‌, హోల్డర్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడింది. చివరి రోజు స్పిన్‌కు అనుకూలించనుండడంతో కార్న్‌వాల్‌ను తీసుకునే అవకాశమూ లేకపోలేదు.


పిచ్‌, వాతావరణం

సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. తొలి రోజు వాతావరణం అనుకూలించినా ఆ తర్వాతి నాలుగు రోజులు మాత్రం వర్షం కారణంగా మ్యాచ్‌ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బౌలర్లకు పిచ్‌ లాభించవచ్చు. అయితే, ఇక్కడ జరిగిన చివరి ఆరు టెస్టుల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే నెగ్గింది. 


జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జాక్‌ క్రాలే, జో రూట్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, ఒల్లీ పోప్‌, డామ్‌ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

విండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌/ జోషువా డ సిల్వ, షమర బ్రూక్స్‌,  రోస్టన్‌ చేజ్‌, జెర్మెయిన్‌ బ్లాక్‌వుడ్‌, షేన్‌ డౌరిచ్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జెరి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌/రకీమ్‌ కార్న్‌వాల్‌, షానన్‌ గాబ్రియెల్‌. 

Advertisement
Advertisement
Advertisement