England vs India ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. కోహ్లీ స్థానంలో ఎవరంటే..

ABN , First Publish Date - 2022-07-12T22:52:58+05:30 IST

ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు..

England vs India ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. కోహ్లీ స్థానంలో ఎవరంటే..

ఓవల్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. టాస్ అనంతరం.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పేస్ బౌలింగ్ విభాగంలో షమీ, బూమ్రా.. బ్యాటింగ్ విభాగంలో ఐదుగురు బ్యాట్స్‌మెన్స్, ఇద్దరు ఆల్‌ రౌండర్లతో టీమిండియా బలంగా ఉందని చెప్పాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని, అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌ ఆడే చివరి వన్డే సిరీస్‌ ఇది. అయినా ఈ మ్యాచ్‌లు తమకు ముఖ్యమేనని, వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తామని రోహిత్‌ చెబుతున్నాడు. ఇక ఓపెనర్‌గా కెప్టెన్‌కు జతగా శిఖర్‌ ధవన్‌ బరిలోకి దిగనున్నాడు. గత ఫిబ్రవరిలో చివరి మ్యాచ్‌ ఆడిన గబ్బర్‌.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ బరిలో ఉండాలంటే ఈ సిరీస్‌లో సత్తా నిరూపించుకోవాల్సిందే. అటు రోహిత్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. షార్ట్‌ పించ్‌ బంతులను ఆడలేక శ్రేయాస్ ఇబ్బందిపడుతున్నప్పటికీ కోహ్లీ స్థానంలో అతనికి చోటు దక్కింది.



భువీకి విశ్రాంతి కారణంగా బుమ్రా, షమి పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక.. ఇంగ్లండ్ జట్టు విషయానికొస్తే.. టీ20 సిరీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ వన్డే జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. హార్డ్‌ హిట్టర్లు బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు వెటరన్‌ జో రూట్‌ జట్టులోకి వచ్చారు. ఈ త్రయం లేకుండానే నెదర్లాండ్స్‌పై భారీ స్కోర్లతో బెంబేలెత్తించింది. వీరికి తోడు బట్లర్‌, రాయ్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సాల్ట్‌లతో కూడిన ఇంగ్లండ్‌ను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సిందే. అటు బౌలింగ్‌లోనూ స్పెషలిస్ట్‌ పేసర్లు టోప్లే, బ్రైడన్‌ కార్స్‌తో పాటు ఆల్‌రౌండర్లు స్టోక్స్‌, సామ్‌ కర్రాన్‌, డేవిడ్‌ విల్లే అందుబాటులో ఉండడం సానుకూలాంశం. తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్‌ను కట్టడి చేయడం సులువనే భావనలో ఇంగ్లండ్‌ ఉంది.



టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, చాహల్, ప్రసీద్ కృష్ణ


ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్ట్రో, జోయ్ రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రైగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, టోప్లే

Updated Date - 2022-07-12T22:52:58+05:30 IST