Abn logo
Aug 27 2021 @ 04:06AM

రూట్‌ హ్యాట్రిక్‌

  • సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్‌ సారథి
  • తొలి ఇన్నింగ్స్‌ 423/8
  • పట్టు బిగించిన ఆతిథ్య జట్టు


లీడ్స్‌: టీమిండియా విఫలమైన పిచ్‌పై.. ఇంగ్లం డ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ జో రూట్‌ (165 బంతుల్లో 14 ఫోర్లతో 121) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. పసలేని భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న రూట్‌.. సిరీ్‌సలో వరుసగా మూడో శతకంతో కదం తొక్కాడు. మూడేళ్ల తర్వాత టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన డేవిడ్‌ మలన్‌ (128 బంతుల్లో 70)తో కలసి మూడో వికెట్‌కు 139 పరుగులు, బెయిర్‌స్టో (29)తో కలసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే, ఆఖరి సెషన్‌లో పుంజుకున్న టీమిండియా బౌలర్లు రూట్‌తోపాటు 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని కొంతమేర అడ్డుకోగలిగారు. 120/0తో ఆటకు రెండో రోజైన గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ 129 ఓవర్లలో 423/8 పరుగులు చేసింది. ఆటముగిసే సమయానికి ఓవర్టన్‌ (24), రాబిన్సన్‌ (0) క్రీజులో ఉన్నారు. షమి (3/87) మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ (2/86), జడేజా (2/88) చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇప్పటికి ఇంగ్లండ్‌ 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 78 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.


ఒత్తిడి పెంచలేక..

ఓపెనర్లు బర్న్స్‌ (61), హమీద్‌ (68)ను తొలి సెషన్‌లోనే అవుట్‌ చేసినా.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 182/2తో నిలిచింది. రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేసిన షమి.. మొదటి గంటలోనే బర్న్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత జడేజా తన మొదటి ఓవర్‌లోనే అద్భుతమైన బంతితో హమీద్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, మలన్‌, కెప్టెన్‌ రూట్‌ సమన్వయంతో ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. 


స్కోరుబోర్డు పరుగులు..

రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగినా.. చివర్లో మలన్‌ను సిరాజ్‌ అవుట్‌ చేసి ఝలక్‌ ఇచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన రూట్‌.. అలవోకగా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. షమి బౌలింగ్‌లో ఫోర్‌తో రూట్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమి బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న మలన్‌.. సింగిల్‌తో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 


సిరాజ్‌కు లక్కీ వికెట్‌..

టీ విరామానికి ముందు సిరాజ్‌.. లక్కీ బ్రేక్‌ ఇచ్చాడు. 94 ఓవర్‌ చివరి బంతికి మలన్‌ను అవుట్‌ చేశాడు. మలన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను ముద్దాడిన బంతి కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే, సిరాజ్‌ తప్ప ఎవరూ అప్పీలు చేయలేదు. బ్యాట్‌కు బంతి తాకలేదని కోహ్లీకి.. పంత్‌ తెలిపాడు. కానీ, సిరాజ్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లిన టీమిండియాకు వికెట్‌ దక్కింది. దీంతో ఇంగ్లండ్‌ 298/3తో టీకి వెళ్లింది. టీమిండియాకు ఊరట..

ఆఖరి సెషన్‌లో టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు. కాగా, ధాటిగా ఆడుతున్న రూట్‌.. ఇషాంత్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో కెరీర్‌లో 23వ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు బెయిర్‌స్టో, బట్లర్‌ (7)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. రోజంతా విఫలమైన బుమ్రా.. డేంజర్‌మన్‌ రూట్‌ను బౌల్డ్‌  చేసి జట్టులో జోష్‌ నింపా డు. ఆ వెంటనే మొయిన్‌ అలీ (8)ని జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, కర్రాన్‌ (15), ఓవర్టన్‌ టీమ్‌ స్కోరును 400 పరుగుల మైలురాయి దాటించారు. సిరాజ్‌ బౌన్సర్‌కు కర్రాన్‌ పెవిలియన్‌ చేరాడు. 


1

టెస్ట్‌ చరిత్రలో ఒక కేలండర్‌ ఇయర్‌లో మూడు వరుస టెస్ట్‌ల్లో మూడు సెంచరీల ఫీట్‌ను రెండోసారి సాధించిన తొలి ఆటగాడు రూట్‌ 


1

ఇంగ్లండ్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ కలిపి అత్యధికంగా 39 సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్‌. 5

భారత్‌పై అత్యధికంగా 8 శతకాలు బాదిన ఐదో ఆటగాడిగా రూట్‌. గ్యారీ సోబర్స్‌, వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆ జాబితాలో ఉన్నారు. స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌. 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (బి) షమి 61, హసీబ్‌ హమీద్‌ (బి) జడేజా 68, మలన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 70, రూట్‌ (బి) బుమ్రా 121, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) షమి 29, బట్లర్‌ (సి) ఇషాంత్‌ (బి) షమి 7, మొయిన్‌ అలీ (సి/సబ్‌) అక్షర్‌ (బి) జడేజా 8, కర్రాన్‌ (సి/సబ్‌) మయాంక్‌ (బి) సిరాజ్‌ 15, ఓవర్టన్‌ (బ్యాటింగ్‌) 24, రాబిన్సన్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 129 ఓవర్లలో 423/8; వికెట్ల పతనం: 1-135, 2-159, 3-298, 4-350, 5-360, 6-383, 7-383, 8-418; బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 22-0-92-0, బుమ్రా 27-10-58-1, షమి 26-7-87-3, సిరాజ్‌ 23-3-86-2, జడేజా 31-7-88-2.

క్రైమ్ మరిన్ని...