90 ఏళ్ల క్రితం రికార్డు.. ఒకే రోజు రెండు జట్లతో ఇంగ్లండ్ మ్యాచ్

ABN , First Publish Date - 2021-01-14T15:03:36+05:30 IST

1930 జనవరిలో న్యూజిల్యాండ్ తొలిసారిగా టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌తో పోటీకి సిద్ధమైంది. అయితే పటిష్ఠ ఇంగ్లండ్‌ను గెలవలేకపోయింది. దీంతో మ్యాచ్ ఆసాంతం...

90 ఏళ్ల క్రితం రికార్డు.. ఒకే రోజు రెండు జట్లతో ఇంగ్లండ్ మ్యాచ్

ఇంటర్నెట్ డెస్క్: 1930 జనవరిలో న్యూజిల్యాండ్ తొలిసారిగా టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌తో పోటీకి సిద్ధమైంది. అయితే పటిష్ఠ ఇంగ్లండ్‌ను గెలవలేకపోయింది. దీంతో మ్యాచ్ ఆసాంతం ఇంగ్లండ్ జట్టే పైచేయిగా నిలిచింది. చివరికి గెలుపును కూడా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇక్కడ న్యూజిల్యాండ్‌తో ఇంగ్లండ్ జట్టు క్రికెట్ ఆడుతుండగానే మరో చోట మరో జట్టుతో అదే రోజున ఇంగ్లండ్ జట్టు తలపడింది. ఇదేలా సాధ్యం అని ఆలోచించకండి. ఇప్పటిరకు అలాంటి ఫీట్ సాధించిన రికార్డు ఒక్క ఇంగ్లండ్ జట్టుకు మాత్రమే ఉంది. ఒకే రోజు, ఒకే సమయంలో రెండు వేరు వేరు చోట్ల వేరు వేరు జట్లతో మ్యాచ్‌లాడిన ఇంగ్లండ్ ఈ రికార్డును తన పేరున రాసుకుంది.


తొలి మ్యాచ్ అయినా న్యూజిల్యాండ్‌ అద్భుత పోరాట పటిమను చూపింది. ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులు చేసి అదరగొట్టింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో వైపు వెస్టిండీస్‌-ఇంగ్ండ్ మధ్య మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్ వెస్టిండీస్ 369 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.


ఇదిలా ఉంటే ఇంగ్లండ్ ఈ రికార్డు సాధించి బుధవారానికి సరిగ్గా 90 ఏళ్లు గడిచింది. ఆ మ్యాచ్ తరువాత ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించే జట్టు, ఒకే సమయంలో వేరు వేరు చోట్ల రెండు దేశాల జట్లతో క్రికెట్ ఆడడాన్ని మిగతా దేశాలు వ్యతిరేకించాయి. దీంతో ఇలా ఆడడం కనుమరుగైపోయింది.

Updated Date - 2021-01-14T15:03:36+05:30 IST