IPLను మేం నిర్వహిస్తాం: ముందుకొచ్చిన ఇంగ్లిష్ కౌంటీలు

ABN , First Publish Date - 2021-05-07T02:13:29+05:30 IST

భారత్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని మిగతా

IPLను మేం నిర్వహిస్తాం: ముందుకొచ్చిన ఇంగ్లిష్ కౌంటీలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని మిగతా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లిష్ కౌంటీలు ముందుకొచ్చాయి. ఎంసీసీ, సర్రే, వార్విక్‌షైర్, లాంకషైర్, కియా ఓవల్, ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్)‌లు ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశాయి. తమకు అవకాశం ఇస్తే సెప్టెంబరులో మిగిలిపోయిన మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాల్సిందిగా ఆ లేఖలో కోరాయి. 


భారత్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన నేపథ్యంలో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా యూఏఈకి తరలిపోయే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబరు-నవంబరులో యూఏఈలో టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిగిలిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లను తమ వద్ద నిర్వహించడమే మేలని కౌంటీలు ప్రతిపాదించాయి. ఫలితంగా యూఏఈ పిచ్‌లను తాజాగా ఉంచడంలో బీసీసీఐ, ఐసీసీకి ఇంగ్లండ్ సాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నాయి. అంతేకాక, ఐపీఎల్‌కు యూకే మార్కెట్లో మరింత విస్తృత ప్రచారం కూడా లభిస్తుందని అభిప్రాయపడ్డాయి.


మరోవైపు, సెప్టెంబరు విండోలో మిగిలిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లను పూర్తిచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, ఈ విషయంలో ఇప్పుడే స్పందించడం కష్టమని, దీనికి కొంత ప్రణాళిక అవసరమని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఒకవేళ అనుకున్నట్టే ఐపీఎల్ రెండో సగాన్ని పూర్తిచేయాలనుకుంటే కనుక అది విదేశాల్లోనే సాధ్యమవుతుంది.  

Updated Date - 2021-05-07T02:13:29+05:30 IST