పాక్‌ను ఓడిస్తాం.. మాకు ఆ సత్తా ఉంది: ఓక్స్

ABN , First Publish Date - 2020-08-08T23:31:26+05:30 IST

పాకీస్తాన్‌ను ఓడించే సత్తా తమకుందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ ఓక్స్ అన్నాడు. తమ జట్టు పటిష్ఠంగా ఉందని, పాక్‌పై కచ్చితంగా విజయం..

పాక్‌ను ఓడిస్తాం.. మాకు ఆ సత్తా ఉంది: ఓక్స్

లండన్: పాకీస్తాన్‌ను ఓడించే సత్తా తమకుందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ ఓక్స్ అన్నాడు. తమ జట్టు పటిష్ఠంగా ఉందని, పాక్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని ఓక్స్ పేర్కొన్నాడు. 5వ తేదీ నుంచి ఇంగ్లాండ్-పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ సిరీస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పటిష్ఠ స్థితిలో నిలిచినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇంగ్లాండ్ పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో ఓక్స్ మాట్లాడుతూ, తొలి టెస్టులో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఈ మ్యాచ్ కాస్త కష్టంగానే ఉంది. కానీ జట్టుపై, తోటి ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపు సాధిస్తే గొప్పగానే భావిస్తాం. విజయం కోసం శాయశక్తుల ప్రయత్నిస్తామ’ని ఓక్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. షాన్ మసూద్ 156 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 219 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరుపున ఓలీ పోప్ చేసిన 62 పరుగులే అత్యధికం. దీంతో పాకీస్తాన్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే పాక్ రెండో ఇన్నింగ్స్‌లో మసూద్ డకౌట్ కాగా ఇతర ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చేశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి పాక్ 137 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై ఇంగ్లాండ్ మళ్ళీ పట్టు సాధించింది.

Updated Date - 2020-08-08T23:31:26+05:30 IST