Engineering మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ గడువు పొడిగింపు..!

ABN , First Publish Date - 2021-10-12T13:53:04+05:30 IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో...

Engineering మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ గడువు పొడిగింపు..!

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ గడువును పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గడువు ప్రకారం ఈ నెల 15వ తేదీలోపు ఈ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే దసరా సెలవులు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును మరో వారం రోజులపాటు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన ఒకట్రెండు రోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీలో భాగంగా కన్వీనర్‌ కోటాకు సంబంధించి మొదటి దశ కౌన్సెలింగ్‌ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల తర్వాత రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కాగా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో ఇంజనీరింగ్‌ కాలేజీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.


విద్యార్థుల నుంచి కనీసం దరఖాస్తులను కూడా స్వీకరించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని, వాటి ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి, ఈ జాబితా ప్రకారమే అడ్మిషన్లను ఇవ్వాలని ఆదేశించారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కూడా నిర్ణీత ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా కాలేజీలు దరఖాస్తులను స్వీకరించకుండానే... ఎక్కువ ఫీజులు చెల్లించేవారికి నేరుగా సీట్లను అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సీట్ల కేటాయింపులో మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-12T13:53:04+05:30 IST