తొడగొట్టిన అంజిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-28T07:39:05+05:30 IST

తొడగొట్టిన అంజిరెడ్డి

తొడగొట్టిన అంజిరెడ్డి

ఒంగోలు, మే 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను ఉద్దేశించి మీసం తిప్పి తొడగొట్టిన టీడీపీ గ్రామ నేత కల్లం అంజిరెడ్డి శుక్రవారం ఇక్కడ మహానాడు వేదికపై మరోసారి తొడగొట్టారు. అంజిరెడ్డిది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ వారిని నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు బెదిరిస్తున్న సమయంలో ఆయన నామినేషన్‌ వేయడానికి వెళ్లాడు. తనను ఎవరు అడ్డుకొంటారో చూస్తానంటూ 82 సంవత్సరాల వయసు ఉన్న అంజిరెడ్డి మీసం మెలివేసి తొడగొట్టడం అప్పట్లో విస్తృతంగా ప్రచారమైంది. ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించి మహానాడులో మాట్లాడే అవకాశం ఇచ్చారు. వేదికపై అంజిరెడ్డి మరోసారి తొడగొట్టారు. ‘‘ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. తొడగొట్టి ఈ విషయం చెబుతున్నాను. మా పుంగనూరుకు ఇన్‌చార్జిగా ఒక పులిని చంద్రబాబు ఇచ్చారు. ఆ పులి చల్లా బాబురెడ్డి... ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని వస్తాం’’ అని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ సభ కరతాళ ధ్వనులు, ఈలలతో నిండిపోయింది. కడప జిల్లా పొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య సతీమణి అపరాజిత కూడా  మాట్లాడారు. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే భూ అక్రమాలను బయటపెడతానని అన్నందుకే తన భర్తను హత్య చేశారని చెప్పారు. తన పిల్లలను పార్టీనే చదివిస్తోందన్నారు. చంద్రబాబు స్పందిస్తూ కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. 


Updated Date - 2022-05-28T07:39:05+05:30 IST