మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ప్రశ్నించిన ఈడీ

ABN , First Publish Date - 2022-02-23T18:03:34+05:30 IST

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ప్రశ్నించిన ఈడీ

ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం ప్రశ్నించింది. ఈడీ అధికారులు బుధవారం ఉదయం 6 గంటలకు మాలిక్ నివాసానికి చేరుకుని ఓ గంటసేపు ప్రశ్నించారు. ఆ తర్వాత ఉదయం 7.30 గంటలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళి, ఉదయం 8.30 గంటల నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. 


దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ప్రశ్నిస్తున్నట్లు ఈడీ అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని నవాబ్ మాలిక్ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. మాలిక్‌తోపాటు ఆయన కుమారుడు, అడ్వకేట్ అమీర్ మాలిక్ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళినట్లు తెలిపింది. 


ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నవాబ్ మాలిక్‌ను ఈ విధంగా టార్గెట్ చేస్తారని తమకు తెలుసునని చెప్పారు. ఆయనపై కేసు గురించి తనకు తెలియదని, అయితే ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేయడానికి దావూద్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పని చేసిన కాలంలో తనకు కూడా అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారన్నారు. పాతికేళ్ల తర్వాత అదే చిట్కాను ఉపయోగిస్తున్నారన్నారు. 


శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రేరేపణతో పని చేస్తున్నాయని ఆరోపించారు. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తాను వారి బండారాన్ని బయటపెడతానని చెప్పారు. నవాబ్ మాలిక్ నిజాలను బయటకు తీసుకొస్తున్నారని, వారికి  (బీజేపీకి) వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సీబీఐ, ఈడీలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. 



Updated Date - 2022-02-23T18:03:34+05:30 IST