సాగుకు ఇంధన భారం

ABN , First Publish Date - 2021-04-19T04:08:06+05:30 IST

సాగుకే ఏటేట పెట్టుబడులు పెరుగుతు న్నాయి. యాంత్రికీకరణకు అలవాటు పడిన అన్నదాతకు ఇంధన ధరలు భారంగా మారుతున్నాయి.

సాగుకు ఇంధన భారం

పెరిగిన డీజిల్‌ భారం
వరికోత సమయంలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు అధిక ధరలు
ఆందోళనలో రైతులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 18: సాగుకే ఏటేట పెట్టుబడులు పెరుగుతు న్నాయి. యాంత్రికీకరణకు అలవాటు పడిన అన్నదాతకు ఇంధన ధరలు భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం వరికోత సమయంలో, రానున్న దుక్కుల సమయంలోనూ పెరిగిన ఇంధన ధరలు పెట్టుబడు లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో పంటలు సాగుచేసిన రైతులు అకాల వర్షాలు, మద్దతు ధర లేక నష్టాల పాలు కావాల్సి వస్తోంది. ప్రస్తుతం యాసంగిలోనైనా లాభాలు ఆశిద్దామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. ఇంధన, కూలీల ధరలతో పాటు కౌలు ధరలు అమాంతం పెరగడంతో పెట్టుబడులు తడిచిమోపేడవుతున్నాయి.
2 లక్షల 50 వేల ఎకరాలకు పైగా సాగు
జిల్లాలోని 22 మండలాల పరిధిలో 2లక్షల 50వేలకు పైగా సాగు విస్తీర్ణం ఉంది. దాదాపు లక్ష వరకు రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి పంట అత్యధికంగా సాగవుతుండగా, చెరుకు, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలు పండిస్తుంటారు. నానాటికి పెరుగుతున్న సాగు వ్యయం రైతులకు చుక్కలు చూపుతోంది. గతేడా ది వరి, మొక్కజొన్న, కందులు, పత్తి, సోయాబిన్‌ పంటలను తక్కువ ధరలకే విక్రయించి నష్టాలను చవి చూసారు. ప్రస్తుతం రానున్న వానాకాలం సీజన్‌కు ముందే పెట్టుబడుల ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు.
డీజిల్‌ ధరల ప్రభావం
గతేడాది వానాకాలం సీజన్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.74 ఉండేది. అదే ప్రస్తుతం లీటర్‌కు రూ.90పైనే ఉంది. సాగులో ట్రాక్టర్‌లు, హర్వే స్టర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వరి కోతల సమయంలో హర్వేస్టర్ల ద్వారా కోతలు చేపడుతుండగా, ట్రాక్టర్ల ద్వారా పంటను ఇళ్లకు చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన డీజిల్‌ ధరలతో యం త్రాల యజమానులు గంటకు ఖర్చులను పెంచారు. మరోవైపు పంట చేలను బట్టి దుక్కి ధరలను నిర్ణయిస్తున్నారు. పొడి దుక్కులకు ఒక ధర, తడిదుక్కి పంటలకు ఒక ధరను నిర్ణయించారు. ఎకరాకు దుక్కి దున్నేందుకు సుమారు 25 నుంచి 30 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఎకరా దున్నేందుకు ట్రాక్టర్‌కు రూ.1500, కల్టివేటర్‌ రూ.1500, కట్టే కొట్టేందుకు రూ.1200, రూట్‌వేటర్‌ రూ.1500 ఇతర ఖర్చులు రూ.1800 కలుపుకుంటే సుమా రు రూ.7500 వ్యయం అవుతోంది. కేవలం దుక్కి దున్నేందుకే కాకుం డా యంత్రాలను వరి కోతలు, పురుగుల మందుల పిచికారీ చేసేందు కు వాడే తైవాన్‌ స్ర్పేలు, పంటలో కలుపు నివారణులుగా యంత్రాలను విరివిగా వాడుతున్నారు. దీంతో రైతుకు అదనంగా భారం మోయాల్సి వస్తోంది. మొత్తంగా జిల్లా రైతాంగంపై పెరిగిన డీజిల్‌ ధరలతో సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.45 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశముంది.
పెరిగిన కూలీ రేట్లు
పెరిగిన డీజిల్‌, కౌలు ధరలకు తోడు గ్రామీణ ప్రాంతాల్లో కూలి రేట్లు సైతం రూ.200 నుంచి రూ.350 వరకు పెరిగాయి. కూలి రేట్లు అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభం కాకముందు పంట చేలలో చెత్తను ఏరివేయడం, ఎరువులు చల్లడం వంటి పనులకు సైతం కూలీలు దొరకడం లేదు. పుడమి తల్లిని నమ్ముకున్న తమకు ఎన్నికష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడం తప్పా మరో మార్గం లేదని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2021-04-19T04:08:06+05:30 IST