శక్తి పెరుగుతుంది!

ABN , First Publish Date - 2020-03-21T06:15:50+05:30 IST

పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. పైగా వేసవికాలం చల్లదనానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో తడ్కా, కర్రీ, కబాబ్‌, యోగర్ట్‌ సలాడ్‌

శక్తి పెరుగుతుంది!

పెరుగులో ప్రొ బయోటిక్స్‌ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల శరీరానికి వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. పైగా వేసవికాలం చల్లదనానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో తడ్కా, కర్రీ, కబాబ్‌, యోగర్ట్‌ సలాడ్‌... ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి. ఆలస్యమెందుకు... మీరూ ట్రై చేయండి.


దహీ తడ్కా

కావలసినవి: పెరుగు - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, కారం - ఒక  టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా,  కొత్తిమీర - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ధనియాలు - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, పుదీనా పొడి - కొద్దిగా.

తయారీ: పెరుగులో సన్నని క్లాత్‌తో వడబోసి పక్కన పెట్టుకోవాలి.

 పాన్‌ వేడి చేసి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. 

 పసుపు, ఉప్పు, కారం, గరంమసాల, పుదీనాపౌడర్‌ వేసి నిమిషం పాటు వేగనివ్వాలి.

 తరువాత ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి వేయాలి. 

 మసాల చిక్కగా అయ్యే వరకు వేగించాలి. 

 చివరగా పెరుగు వేసి కలుపుకోవాలి. 

 ఎండుమిర్చిని దంచి చల్లాలి. కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి, అన్నం లేదా చపాతీతో తింటే రుచిగా ఉంటుంది.


కాకరకాయ పెరుగు కర్రీ

కావలసినవి: కాకరకాయలు - ఎనిమిది, పెరుగు - అరకప్పు, పసుపు - అర టీస్పూన్‌, అల్లం పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, మెంతులు - అర టీస్పూన్‌, ఆవాల నూనె - పావు కప్పు.

తయారీ: ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి.

 కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు తీసేసి, ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను పిండి నీటిని తీసేస్తే చేదు పోతుంది.

  పాత్రలో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, వేగించిన జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక కాకరకాయలు వేసి కాసేపు వేగించుకుని పక్కన పెట్టాలి.

 అదే పాన్‌లో కాస్త నూనె వేసి పెరుగు మిశ్రమం వేయాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేగించాలి.

 ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో కలియబెడితే రుచికరమైన పెరుగు కర్రీ రెడీ అవుతుంది.

 అన్నంలోకి ఈ కర్రీ రుచిగా ఉంటుంది.


పెరుగు కబాబ్‌

కావలసినవి: పెరుగు - 400గ్రాములు, పనీర్‌ - 100గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - ఒక కట్ట, బాదం పలుకులు - పది, ఎండుద్రాక్ష - ఐదారు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, మొక్కజొన్న పిండి - కొద్దిగా, ఓట్స్‌ - ఒక కప్పు.

తయారీ: పెరుగును సన్నటి గుడ్డలో వేసి నీళ్లు వార్చాలి.

 పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.

 ఒక పాత్రలో పెరుగు తీసుకుని, పనీర్‌ ముక్కలు వేయాలి. ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, వేగించిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు వేయాలి.

 ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుని వత్తుకుంటూ మొక్కజొన్న పిండి అద్దుకోవాలి. తరువాత ఓట్స్‌ను అద్దాలి. 

 పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక కబాబ్‌లను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.

 చట్నీతో సర్వ్‌ చేసుకుంటే కబాబ్‌లు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.


బంగాళదుంప యోగర్ట్‌

కావలసినవి: బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - 200ఎంఎల్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, ఆవాలు - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఉల్లిపాయలు - రెండు, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, బ్రెడ్‌ముక్కలు - నాలుగు.

తయారీ: బంగాళదుంపలను ఉడికించాలి. తరువాత పొట్టు తీసి సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

 పాత్రలో బంగాళదుంపల్ని వేసి, పెరుగు పోయాలి.

 స్టవ్‌పై పాన్‌లో నూనె పోసి కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఈ పోపుని బంగాళదుంపల ముక్కలపై పోయాలి.

 ఉల్లిపాయలు, పైనాపిక్‌ ముక్కలు వేయాలి.

 బ్రెడ్‌ ముక్కలు పొడిపొడిగా చేసి చల్లాలి. 

 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి. పుదీనాతో గార్నిష్‌ చేయాలి.

 తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-03-21T06:15:50+05:30 IST