Oct 23 2021 @ 19:00PM

‘ఎనిమి’ ట్రైలర్: బరిలోకి దిగితేనే శత్రువులు.. లేదంటే!

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో మిని స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘ఎనిమి’. ‘వాడు వీడు’ తర్వాత విశాల్, ఆర్య మరోసారి కలిసి నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ చిత్రం విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండబోతోందో చూపించారు.

‘బరిలోకి దిగితే మీ ఇద్దరూ శత్రువులు.. ఆ తర్వాత మిత్రులు’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య, విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాపై క్రేజ్‌ని పెంచేలా ఉన్నాయి. గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాలిని రవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.