ఐబిఎస్‌ శత్రువులు

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌... ఈ జీర్ణకోశ సమస్య పెద్ద పేగులకు సంబంధించినది.

ఐబిఎస్‌ శత్రువులు

ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌... ఈ జీర్ణకోశ సమస్య పెద్ద పేగులకు సంబంధించినది. ఈ సమస్య ఉన్నవాళ్లు తరచూ పొట్ట నొప్పి, అసౌకర్యం, మలబద్ధకం, విరోచనాలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఐబిఎస్‌ ఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే సమస్య అదుపులో ఉండే వీలుంది. వీళ్లు తినకూడదని పదార్థాలు ఏవంటే...


బీన్స్‌: సెనగలు, పప్పులు, బీన్స్‌ ఐబిఎస్‌ సమస్యను పెంచుతాయి. వీటి నుంచి వెలువడే వాయువులు జీర్ణ ప్రక్రియను బాధాకరంగా మారుస్తాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడమే మేలు. ఒకవేళ తినాలనిపిస్తే, తేలికగా అరిగేలా, మెత్తని ముద్ద రూపంలో తీసుకోవాలి.

వేపుళ్లు: వీటిని కొవ్వు ఎక్కువ కాబట్టి కడుపు ఉబ్బరిస్తుంది. కొన్ని సందర్భాల్లో విరోచనాలూ వేధిస్తా యి. కాబట్టి ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాంటివి తినాలనిపిస్తే వాటిని బేక్‌ చేయడం లేదా, గ్రిల్లింగ్‌ చేయాలి. 

క్రూసిపెరస్‌ కూరగాయలు: ఈ జాతికి చెందిన కూరగాయల్లో పీచు ఎక్కువ. నిజానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే పీచు ఎక్కువగా ఉండే కూరగాయలకే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఐబిఎస్‌ ఉన్నవాళ్లు ఈ రకం కూరగాయలు తినడం వల్ల, వాటిలో ‘రాఫినోస్‌’ అనే జీర్ణం కాని సుగర్‌తో సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బ్రొకొలి కూరగాయలకు దూరంగా ఉండాలి.

చక్కెర ప్రత్యామ్నాయాలు: చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుకునే స్వీటెనర్లతో ఐబిఎస్‌ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. పాలియోల్‌, సార్బిటాల్‌, క్జైలిటాల్‌, మానిటాల్‌ మొదలైన స్వీటెనర్లు రెడీమేడ్‌ ఫుడ్స్‌లో ఉంటాయి. ఇవన్నీ ఐబిఎస్‌ లక్షణాలను రెట్టింపు చేసేవే. కాబట్టి ‘సుగర్‌ ఫ్రీ’ అనే లేబుల్‌ ఉన్న రెడీమేడ్‌ ఆహారాలను మానేయాలి.

Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST