దేవాదాయశాఖ సభల్లో తమిళతల్లి ప్రార్థన తప్పనిసరి

ABN , First Publish Date - 2022-05-17T15:56:34+05:30 IST

రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటయ్యే సభల్లో తప్పనిసరిగా ‘తమిళ్‌తాయ్‌ వాళ్తు’ను ఆలపించాలని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌

దేవాదాయశాఖ సభల్లో తమిళతల్లి ప్రార్థన తప్పనిసరి

                   - మంత్రి దురైమురుగన్‌


చెన్నై: రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటయ్యే సభల్లో తప్పనిసరిగా ‘తమిళ్‌తాయ్‌ వాళ్తు’ను ఆలపించాలని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ పేర్కొన్నారు. వేలూరులో దేవాదాయ శాఖలో కొత్తగా నియమితులైన జిల్లా ట్రస్టీ అధ్యక్షుడు, సభ్యుల పదవీ స్వీకారమహోత్సవం వేలూరు కొత్త బస్టాండు సమీపంలోని సెల్వియమ్మన్‌ ఆలయంలో సోమవారం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం భక్తిగీతాలాపనతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దురైమురుగన్‌ మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిర్వహించే సభలు, కార్యక్రమాల్లో దేవారం పాడినా, తిరువాసగమ్‌ పాడినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మొదట తమిళ తల్లి ప్రార్థనాగీతం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. దేవాదాయశాఖ ప్రభుత్వంలో ఒక భాగమేనని, ప్రభుత్వశాఖలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ తమిళ తల్లి ప్రార్థనా గీతంతోనే ప్రారంభమవుతున్నప్పుడు దేవాదాయశాఖ ఆ ఆనవాయితీని విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ఇకపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వపరమైన అన్ని సభలు, కార్యక్రమాలను తమిళ తల్లి ప్రార్థనాగీతంతోనే ప్రారంభించాలని దేవాదాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నియమితులైన జిల్లా ఆలయ ట్రస్టీ, సభ్యులు భక్తులకు మెరుగైన సేవలందించేందుకు పాటుపడాలని, ఆలయాల్లో తాగుబోతులు, మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారికి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యహరించాలని సూచించారు. ఈ సభలో మంత్రి శేఖర్‌బాబు, ఎంపీలు జగద్రక్షగన్‌, కదీర్‌ ఆనంద్‌, శాసనసభ్యులు నందకుమార్‌, కార్తికేయన్‌, జల్లా కలెక్టర్‌ కుమారవేల్‌ పాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T15:56:34+05:30 IST