డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ అనే వ్యాధి ఎలా వస్తుంది?

ABN , First Publish Date - 2022-10-06T17:39:45+05:30 IST

మానవ శరీరంలో రెండు రకాల గ్రంధులు ఉంటాయి. అవి బహి స్రావక గ్రంధులు, అంత స్రావక గ్రంధులు. లాలాజల గ్రంధులు, జఠర గ్రంధి, కాలేయం, క్లోమం అనేవి బహిస్రావక గ్రంధులు

డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ అనే వ్యాధి ఎలా వస్తుంది?

మానవ శరీరంలో రెండు రకాల గ్రంధులు ఉంటాయి. అవి బహి స్రావక గ్రంధులు, అంత స్రావక గ్రంధులు. లాలాజల గ్రంధులు, జఠర గ్రంధి, కాలేయం, క్లోమం అనేవి బహిస్రావక గ్రంధులు. ఇవి ఎంజైమ్‌లను స్రవిస్తాయి. అంతస్రావక గ్రంధుల నుంచి హార్మోన్‌లు స్రవిస్తాయి. 

అంత స్రావక గ్రంధులు నాళ రహితంగా ఉండడం వల్ల వీటిని ‘వినాళ గ్రంధులు’ అని కూడా అంటారు. పీయూష గ్రంధి, అవటు గ్రంధి, పార్శ్వ అవటు గ్రంధి, అధి వృక్క గ్రంధి, క్లోమం, ముష్కం, అండం, థైమస్‌ అనేవి మానవ శరీరంలోని అంతస్రావక గ్రంధులు.  


పీయూష గ్రంధి

  • దీనినే పిట్యుటరీ గ్రంధి  అని కూడా అంటారు. ఇది మెడ భాగంలో బఠాణి గింజ పరిమాణంలో ఉంటుంది. పీయూష గ్రంధి నుంచి స్రవించే హార్మోన్‌లు మిగిలిన అంతస్రావక గ్రంధులను నియంత్రిస్తాయి. కాబట్టి పీయూష గ్రంధిని ‘మాస్టర్‌ గ్రంధి’ అని కూడా పిలుస్తారు. 
  • థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌, ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, పెరుగుదల హార్మోన్‌, ప్రోలాక్టిన్‌ హార్మోన్‌, ఆక్సిటోసిన్‌, వాసోప్రెసిన్‌ హార్మోన్‌ వంటివి పీయూష గ్రంధి నుంచి స్రవిస్తాయి. 
  • పెరుగుదల హార్మోన్‌, పెరుగుదల కణజాలాన్ని కండరాలను ఉత్తేజితం చేసి జీవి పెరుగుదలను నియంత్రిస్తుంది. పెరుగుదల హార్మోన్‌ అధికంగా స్రవించడం వల్ల ‘జైగాంటిజం’ అనే వ్యాధి వస్తుంది. పెరుగుదల హార్మోన్‌ లోపించడం వల్ల పిల్లలు మరగుజ్జులుగా ఉంటారు. 
  • ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ గర్భిణులలో పాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ గర్భిణులలో గర్భాశయ కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది. 
  • మూత్రంలో ఉన్న నీటిని శరీరం శోషించుకోవడానికి ‘వాసోప్రెసిన్‌’ అనే హార్మోన్‌ ఉపయోగిస్తుంది. ఈ హార్మోన్‌ లోపం వల్ల ‘డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌’ అనే వ్యాధి వస్తుంది. 


అవటు గ్రంధి (థైరాయిడ్‌ గ్రంధి)

  • ఇది గొంతు భాగంలో ఉండే వినాళ గ్రంధి. దీనిని ‘ఆడమ్స్‌ ఆపిల్‌ గ్రంధి’ అని కూడా పిలుస్తారు. వినాళ గ్రంధులన్నింటిలో పెద్దది అవటు గ్రంధి. దీని నుంచి థైరాక్సిన్‌ హార్మోన్‌ (టీ 3, టీ 4), కాల్సిటోసిన్‌ హార్మోన్‌ స్రవిస్తాయి. చిన్న పిల్లల్లో మానసిక ఎదుగుదలను థైరాక్సిన్‌ హార్మోన్‌లు నియంత్రిస్తాయి.  
  • థైరాక్సిన్‌ లోపం వల్ల చిన్న పిల్లల్లో మానసిక ఎదుగుదల నిలిచిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘క్రెటినిజం’ అంటారు. థైరాక్సిన్‌ హార్మోన్‌, ఆధార జీవక్రియ రేటు (బీఎంఆర్‌)ను నియంత్రిస్తుంది. 
  • వయోజనుల్లో థైరాక్సిన్‌ అధికంగా స్రవించడం వల్ల ‘ఎక్సాఫ్తాల్మిక్‌ గాయిటర్‌’ లేదా గ్రేవ్స్‌ వ్యాధి కలుగుతుంది. 
  • కాల్సిటోసిన్‌ హార్మోన్‌, పారాథైరాక్సిన్‌తో కలసి రక్తంలో ఉండే కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. 


పార్శ్వ అవటు గ్రంధి (పారా థైరాయిడ్‌)

ఇది అవటు గ్రంధికి సమీపాన ఉంటుంది. ఇది పారా థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. పారా థైరాక్సిన్‌ రక్తంలోని కాల్షియం, ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది.  


క్లోమ గ్రంధి

  • ఇది జీర్ణాశయానికి, ఆంత్రమూలానికి మధ్యలో ఉంటుంది. ఇది బహిస్రావక గ్రంధిగాను, అంతస్రావక గ్రంధిగాను పనిచేస్తుంది. కాబట్టి దీనిని మిశ్రమ గ్రంధి అంటారు.  
  • క్లోమ గ్రంధిలోని లాంగర్‌ హాన్‌  పుటికలు అంతస్రావక గ్రంధిగా పనిచేస్తాయి. లాంగర్‌హాన్‌ పుటికలోని ఆల్ఫా కణాలు ‘గ్లుకగాన్‌’ అనే హార్మోన్‌ను, బీటా కణాలు ‘ఇన్సులిన్‌’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇన్సులిన్‌, గ్లుకగాన్‌ హార్మోన్‌లు పరస్పర వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తాయి. సాధారణంగా వంద మిల్లీ లీటర్ల రక్తంలో 80 మిల్లీ గ్రాముల  నుంచి 120 మిల్లీ గ్రామ్‌ల గ్లూకోజ్‌ ఉంటుంది. 
  • రక్తంలో గ్లూకోజ్‌ 120 మిల్లీ గ్రాముల కంటే అధికంగా ఉన్నట్లయితే ఇన్సులిన్‌ ఉత్పత్తయి అధికంగా ఉన్న గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మార్చి రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ 80 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉన్నపుడు గ్లూకగాన్‌ ఉత్పత్తవుతుంది. ఇది గ్లైకోజన్‌ను గ్లూకోజ్‌గా మార్చి రక్తంలోని గ్లూకోజ్‌ను సాధారణ స్థాయికి తెస్తుంది.  
  • ఇన్సులిన్‌ లోపంతో రక్తంలో గ్లూకోజ్‌ సాధారణ స్థాయి కంటే అధికమౌతుంది. దీనినే ‘డయాబెటిస్‌ మిల్లిటస్‌’ అంటారు. 
  • ప్రపంచ డయాబెటిస్‌ దినోత్సవాన్ని నవంబరు 14న జరుపుకుంటారు. 


అధివృక్క గ్రంధులు

  • ఇవి మూత్ర పిండాలపై ఉండే వినాళ గ్రంధులు. అధివృక్క గ్రంధి వెలుపలి భాగాన్ని ‘వల్కలం’ అనీ లోపలి భాగాన్ని ‘దవ్వ’ అనీ అంటారు. వల్కలం నుంచి గ్లూకో కార్టికాయిడ్‌లు, మినరల్‌ కార్టికాయిడ్‌లు స్రవిస్తాయి. ప్రాథమిక మూత్రంలో ఉన్న లవణాలను మన శరీరం తిరిగి శోషించుకోవడానికి మినరల్‌ కార్డికాయిడ్‌లు తోడ్పడుతాయి. 
  • అధివృక్క గ్రంధి దవ్వ భాగం ఎడ్రినలిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఇది రక్త పీడనాన్ని నియంత్రిస్తుంది. ఎడ్రినలిన్‌ అత్యవసర పరిస్థితులలో, భయానక పరిస్థితులలో జీవిని పోరాటానికి, పలాయనానికి సన్నద్దం చేస్తుంది. అందుకే దీనిని పోరాట, పలాయన హార్మోన్‌ అంటారు. 


ముష్కం

ఇది తాత్కాలిక అంతస్రావక గ్రంధిగా పనిచేస్తుంది. ముష్కం నుంచి టెస్టోస్టిరాన్‌, ఆండ్రోజన్‌ అనే లైంగిక హార్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్‌లు పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందిస్తాయి. 


అండం

అండం కూడా తాత్కాలిక అంతస్రావక గ్రంధిగా పనిచేస్తుంది. అండం నుంచి ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్‌ మహిళలలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది.  ప్రొజెస్టిరాన్‌ అనే లైంగిక హార్మోన్‌ గర్భధారణకు తోడ్పడుతుంది. గర్భధారణ నిర్ధారణ పరీక్షల్లో ‘కొరియానిక్‌ గొనడో ట్రోపిన్‌’ అనే హార్మోన్‌ను ఉపయోగిస్తారు. 


-ఆర్‌.సురేష్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-10-06T17:39:45+05:30 IST