Visa Delay: చివరి నిమిషంలో భారతీయుల విదేశీ టూర్లు రద్దు..! కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-08-13T00:09:00+05:30 IST

వీసాల జారీలో జాప్యం కారణంగా అనేక మంది భారతీయులు తమ విదేశీ టూర్లను వాయిదా వేసుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల వీసాల జారీలో చోటుచేసుకుంటున్న ఆలస్యం కారణంగా చివరి నిమిషంలో విదేశీ పర్యటనలు రద్దైపోతున్నాయి. మరికొంత మంది మాత్రం ఆంక్షల సమస్యలు తక్కువగా ఉన్న...

Visa Delay: చివరి నిమిషంలో భారతీయుల విదేశీ టూర్లు రద్దు..! కారణం ఇదే..

ఎన్నారై డెస్క్: వీసాల జారీలో జాప్యం కారణంగా అనేక మంది భారతీయులు(Indians) తమ విదేశీ టూర్లను వాయిదా వేసుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల వీసాల(Visa) జారీలో చోటుచేసుకుంటున్న ఆలస్యం(Delay) కారణంగా చివరి నిమిషంలో విదేశీ పర్యటనలు(Foreign tours) రద్దైపోతున్నాయి. మరికొంత మంది మాత్రం ఆంక్షల సమస్యలు తక్కువగా ఉన్న మాల్దీవులు, దుబాయ్ లాంటి పర్యాటక స్థలాలను ఎంచుకుంటున్నారు.


ఇటీవల కాలంలో కరోనా ఆంక్షలు ఎత్తేసిన తరువాత వీసా దరఖాస్తులు వెల్లువెత్తాయని వీసా సేవల సంస్థలు చెబుతున్నాయి. ఫలితంగా వీసాల జారీలో విపరీతంగా ఆలస్యం జరుగుతోందని తెలిపాయి. ఇటీవల తమకు భారతీయుల నుంచి రోజూ సగటున 20 వేల పైచిలుకు వీసా దరఖాస్తులు అందినట్టు వీసా ఫెలిసిటేషన్ సర్వీసెస్ గ్లోబల్ అనే సంస్థ తెలిపింది. అప్పట్లో బ్రిటన్ వీసా జారీకి ఏకంగా పది వారాల సమయం పట్టేదని సంస్థ తెలిపింది. అవకాశం ఉంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కొన్ని దేశాల ఎంబసీలు సూచించాయి కూడా..!


ప్రస్తుతం.. 26 ఐరోపా దేశాలకు ఉమ్మడి వీసా ‘షెంజెన్’ జారీలోనూ కొంత అనిశ్చితి నెలకొందని వీసా సేవల సంస్థలు చెబుతున్నాయి. ‘‘ఆస్ట్రేలియా, కెనడా వీసాలు ఆలస్యంగా జారీ అవుతుండటంతో కొందరు షెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొందరగానే వీసా వస్తుందని భావించి విమానం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఆ అంచనా తప్పని ఆ తరువాత వారికి తెలిసింది’’ అని స్వాన్ టూర్స్ డైరెక్టర్ గౌరవ్ చావ్లా తెలిపారు. ప్రస్తుతం షెంజెన్ వీసా రావాలంటే దాదాపు 10 వారాలు పడుతోందని చెప్పారు. విదేశీ వీసా కావాలంటే ప్రస్తుతం సగటున మూడు నుంచి పది వారాల పాటు వేచి చూడాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-13T00:09:00+05:30 IST