ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

ABN , First Publish Date - 2021-09-29T06:57:05+05:30 IST

మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని

ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

  •  పక్షం రోజుల్లోనే రెండోసారి దేశ రాజధానికి
  •  రెండుసార్లూ అమిత్‌ షాతో రహస్య భేటీ
  •  చర్చనీయాంశంగా ఢిల్లీ పర్యటనలు, భేటీలు
  •  బీజేపీ పెద్దలతో దోస్తీనే లక్ష్యమని అభిప్రాయం

 

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. తొలి విడతలో తొమ్మిది రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్‌.. ఈసారి మూడు రోజులు దేశ రాజధానిలో మకాం వేశారు. అయితే.. కేవలం 15 రోజుల్లోనే కేసీఆర్‌ మరోసారి ఢిల్లీకి వెళ్లడం.. రెండుసార్లూ హోం మంత్రి అమిత్‌ షా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌లను కలుసుకోవడం; అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌ను ఏకాంతంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తిమంతమైన అమిత్‌ షాను కూడా పదే పదే కలుస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పార్టీల మధ్య అంతర్గత బంధంపై చర్చ జరుగుతోందా లేక రెండు పార్టీల అధిష్ఠానాల మధ్య సఖ్యత ఉందంటూ ఇక్కడి రాష్ట్ర కమలనాథులకు సంకేతాలివ్వడానికే ఇలా కలుస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.


మరోవైపు, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడమే ధ్యేయంగా మజ్లి్‌సతో ఎక్కువ సీట్లలో పోటీ చేయించడానికి కేసీఆర్‌ను బీజేపీ మధ్యవర్తిగా వినియోగించుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లడం చర్చకు దారి తీస్తోంది. ఆయన పర్యటనల వెనక అధికార భేటీలకు మించిన రాజకీయ ప్రాఽధాన్యం ఉందని, కేంద్రంలోని బీజేపీ పెద్దలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ఆయన ఢిల్లీ పర్యటన లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


నిజానికి, గత శుక్రవారం ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్‌ షాను కలుసుకోవడమే కాకుండా అదే రోజు రాత్రి ఆయనతో దాదాపు గంటసేపు రహస్య మంతనాలు జరిపారు. మరునాడు నక్సలిజంపై అమిత్‌ షా తెలంగాణ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్‌ స్వయంగా పాల్గొన్నారు. నిజానికి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్‌ పాల్గొననవసరం లేదు. కేసీఆర్‌ వ్యవహార శైలి చూస్తుంటే సాధ్యమైనన్ని ఎక్కువసార్లు అమిత్‌ షాను కలుసుకుని, ఆయనతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఇరువురూ ఆంతరంగిక భేటీల్లో దేశ రాజకీయాలతోపాటు తెలంగాణ రాజకీయాలు కూడా చర్చించారని, కాంగ్రెస్‌ విముక్త భారత్‌ విషయంలో బీజేపీ లక్ష్యాలు సాధించేందుకు వీలుగా తాను అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఊహాగానాలు వినపడుతున్నాయి.


కాగా,మోదీ, అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడు, దేశంలో వ్యాపార వర్గాలకు ఆప్తుడైన కేంద్ర వాణిజ్య మంత్రి, బీజేపీ మాజీ కోశాధికారి పీయూష్‌ గోయల్‌తో కూడా కేసీఆర్‌ ఆంతరంగికంగా ఒకసారి, అధికారికంగా మరోసారి చర్చించారు. ‘‘ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌ను ఇవాళ ముఖ్యమంత్రిగా మరో రూపంలో చూస్తున్నాం. అప్పట్లో వచ్చీరాగానే ఢిల్లీ వీధుల్లో సంచలనం సృష్టించి, అత్యంత సాహసోపేత నేతగా గుర్తింపు పొందిన ఆయన, ఇవాళ చాలా మెతకగా వ్యవహరించిన తీరు విమర్శకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.


అయితే, బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం కోసం వేస్తున్న ఎత్తులు ఆయన బలహీనతకు నిదర్శనమని మాత్రం చెప్పడానికి వీలు లేదు’’ అని తెలంగాణ నేత ఒకరు విశ్లేషించారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం కొంత కలవరపాటుకు గురవుతోందని, అందుకే కేంద్ర జల్‌ శక్తి మంత్రిని పదే పదే కలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌ వివరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.


Updated Date - 2021-09-29T06:57:05+05:30 IST