ఖరీఫ్‌ వరి చేలపై ఎండాకు తెగులు

ABN , First Publish Date - 2021-10-18T05:40:57+05:30 IST

ఖరీఫ్‌ సాగు చేస్తున్న చేలల్లో తెగుళ్ల బెడద తీవ్రమైంది. ఏపుగా పెరుగుతున్న చేలపై తెగుళ్లు సోకడంతో దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌ వరి పంటలో చాలా ప్రాంతాల్లో ఎండాకు తెగులు సోకడం వల్ల పంట దిగుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు దిగాలుగా ఉన్నారు.

ఖరీఫ్‌ వరి చేలపై ఎండాకు తెగులు
అమలాపురం రూరల్‌ మండలం నల్లమిల్లిలో ఎండాకు తెగులు సోకిన పంట చేలు

  • దిగుబడులు తగ్గుతాయని రైతుల ఆందోళన

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగు చేస్తున్న చేలల్లో తెగుళ్ల బెడద తీవ్రమైంది. ఏపుగా పెరుగుతున్న చేలపై తెగుళ్లు సోకడంతో దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌ వరి పంటలో చాలా ప్రాంతాల్లో ఎండాకు తెగులు సోకడం వల్ల పంట దిగుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు దిగాలుగా ఉన్నారు. కోనసీమలోని అనేక ప్రాంతాల్లో ఎంటీయూ-1064 వరి వంగడాన్ని ఖరీఫ్‌లో అత్యధికంగా సాగు చేశారు. గతంలో రబీలో బొండాలు వంటి వివిధ రకాల ధాన్యం పండించినప్పటికీ మార్కెట్‌లో డిమాండు లేక అయినకాడికి అమ్ముకున్నారు. బొండాలు రకం సాగు చేసిన రైతులు అప్పట్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే బొండాలు రకం వరి వంగడాన్ని పక్కనపెట్టి ప్రస్తుత ఖరీఫ్‌లో ఎంటీయూ-1064 సాగు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు చేశారు. దాంతో కోనసీమ సహా జిల్లావ్యాప్తంగా 1064 రకాన్ని రైతులు సాగు చేశారు. వర్షాలు, ముంపు బెడదను తట్టుకుని నిలబడే శక్తి గల ఈ వంగడాన్ని సాగుచేస్తే రైతులకు అధిక దిగుబడులతో పాటు పండిన ధాన్యాన్ని బహిరంగ విపణిలో విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ రకం వంగడం సాగుపై వారు దృష్టి సారించారు. అయితే ఖరీఫ్‌ సాగు సమయంలో సరైన రీతిలో సాగునీరు అందకపోవడంతో రైతులు కొంత ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత చేసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో ఎండాకు తెగులు వరిచేలను సోకి రైతులకు నష్టం కలిగిస్తోంది. తద్వారా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎకరాకు 35 బస్తాలు దిగుబడి వస్తుంది. అయితే ఎండాకు తెగులు సోకిన చేలల్లో 25 బస్తాలలోపే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం చేలకు పొటాష్‌ వినియోగించాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో పొటాష్‌ కొరత అన్నదాతలను వేధిస్తోంది. గత ఏడాది రూ.600 ఉన్న పొటాష్‌ బస్తా ధర ఈ సీజన్లో రూ.1,025కు పెరిగింది. పైగా మార్కెట్‌తో పాటు రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల్లో కూడా లభ్యం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొటాష్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉండగా ఎండాకు సోకిన చేలు ఆకు మొత్తం ఎండి పోయి వరి కంకులు ఎదగకుండా చేస్తాయి. చాలా ప్రాంతాల్లో ఈ తెగులు బెడద రైతులను వేధిస్తోంది. వర్షాలు, మబ్బులు వంటివి ఎక్కువగా ఉంటే ఎండాకు తెగులు సోకి విస్తరిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ తెగులు నివారణకు ఎకరాకు కొఫైడ్‌ 250 గ్రాముల మందును నీటితో కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చంటున్నారు. ప్రస్తుతం ఈ తెగులు సోకిన ప్రాంతాల్లో రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ నివారణకు కృషి చేస్తున్నారు. 


Updated Date - 2021-10-18T05:40:57+05:30 IST