నేటితో ఆఖరు

ABN , First Publish Date - 2022-06-30T07:30:48+05:30 IST

ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు మరో 24 గంటల్లో ముగియనుంది.

నేటితో ఆఖరు
ఉద్యోగుల సాధారణ బదిలీ

ముగియనున్న సాధారణ బదిలీల గడువు 

సిఫార్సు లేఖలతో ఉద్యోగుల ప్రదక్షిణలు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 29: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు మరో 24 గంటల్లో ముగియనుంది. కోరుకున్న స్థానానికి పోస్టింగ్స్‌ కోసం ఉద్యోగులు చేస్తున్న పైరవీలకు శుక్రవారంతో తెర పడనుంది. మెజార్టీ ఉద్యోగులు, రాజకీయ పలుకుబడి కలిగిన ఉద్యోగులు సిఫార్సు లేఖలతో పాటు తమ బదిలీ దరఖాస్తులను అధికారులకు అందించేందుకు గురువారం కలెక్టరేట్‌, జడ్పీ, ఖజానా, పంచాయతీ, సంక్షేమ శాఖల కార్యాలయాల వద్ద ప్రదక్షిణలు చేశారు. వీరి తాకిడి భరించలేక కొన్ని ఆఫీసుల వద్ద అధికారులు ముఖ్యమైన పనుల్లో ఉన్నారంటూ కొంతసేపు తలుపులు కూడా మూసివేశారు. ఎక్కువ మంది ఉద్యోగులు సిఫార్సు లేఖలు తీసుకొచ్చారు. ఐదేళ్లకు మించి ఒకేస్థానంలో పనిచేస్తూ బదిలీ కావాల్సిన ఉద్యోగులు అక్కడే కొనసాగించాలంటూ లేదా దగ్గరి, పక్క మండలాల్లో పోస్టింగ్‌ కేటాయించాలని కోరుతూ సిఫార్సు లేఖలు తెచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్న సిఫార్సు లేఖల నేపథ్యంలో సామాన్య ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా కొందరు కోరిన స్థానం కోసం అధికారపార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అధికారులు ప్రాథమిక బదిలీ జాబితాను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం వాటిలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిచ్చి సాయంత్రం లేదా రాత్రికి తుది జాబితాను కలెక్టర్‌ సంతకంతో విడుదల చేస్తారు. 

Updated Date - 2022-06-30T07:30:48+05:30 IST