- రాష్ట్రంలో అవినీతి తిష్ట వేసింది
- ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దోచారు
- డబుల్ ఇంజన్ పాలనతోనే అభివృద్ధి
- కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
- అవినీతి పాలన నేర్చుకోవాలా?
- రాష్ట్ర మంత్రులపై కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ కుటుంబ పాలన వల్లే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు, బాధలు దూరం కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిందేనన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆదివారం ఆయన హెచ్ఐసీసీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలోని పరిస్థితుల గురించి డీకే అరుణ స్పష్టంగా వివరించారని గోయెల్ తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఇక్కడి యువకులు తమ ప్రాణాలను అర్పించారని, ఈ పోరాటంలో బీజేపీ కూడా పాలు పంచుకుందని చెప్పారు. దీర్ఘకాలిక పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్నారు. మంచి ప్రభుత్వం ఉన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టేదని తెలిపారు. ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని గోయెల్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తిష్ట వేసిందని, ఇక్కడ సీఎం, మంత్రి పదవులను దక్కించుకున్న ఒకే కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందని విమర్శించారు. కుటుంబ పాలన కారణంగా తెలంగాణ అధోగతి పాలైందన్నారు.
ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి పలు పథకాలు, నిధులు వచ్చినా.. అవి దుర్వినియోగమయ్యాయని, అవినీతిపరుల పాలయ్యాయని ఆరోపించారు. రూ.40 వేల కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయ అంచనాలను ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని, అయినా ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పారు. టీఆర్ఎస్ విధానాల వల్ల విసిగిపోయిన ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. 2020లో సీఎం ఇలాకాలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో గెలిచామని, హుజూరాబాద్‌లోనూ జయకేతనాన్ని ఎగురవేశామని వివరించారు. 2019లో బీజేపీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకోవడంతోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, అప్పటి నుంచి పార్టీ విజయపరంపర కొనసాగిస్తూనే ఉందని గోయెల్ తెలిపారు. తెలంగాణ ప్రజలు మోదీపై చూపిన ప్రేమ, అభిమానం వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఇక్కడి కుటుంబ పాలనను అంతం చేస్తుందన్నారు.
రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కేసీఆర్, ఒవైసీ
విలేకరుల సమావేశంలో, సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలంటూ టీఆర్ఎస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వచ్చి ఇక్కడి ప్రభుత్వ అవినీతి గురించి నేర్చుకోవాలా? అని ఎద్దేవా చేశారు. ‘‘మీ గురించి నేర్చుకునేది ఏముంది? ఇక్కడ ఒకే కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తుందన్న విషయాన్ని నేర్చుకోవాలా? ఎంత అవినీతి ఉందో నేర్చుకోవాలా? మీ నియంతృత్వాన్ని నేర్చుకోవాలా?’’ అని టీఆర్ఎస్ మంత్రులను నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి అధికారం అప్పగిస్తే అద్భుతమైన పరిపాలన అందిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్ కూర్చున్నా.. స్టీరింగ్, ఎక్సలేటర్, బ్రేక్ తన చేతుల్లోనే ఉన్నాయని అసదుద్దీన్ చెబుతున్నాడని అన్నారు. ఒవైసీ, కేసీఆర్ కలిసి తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు కేవలం హోర్డింగుల కోసమే రూ.40 కోట్లు వెచ్చించారని ఆరోపించారు. పెట్రోలు రేటు అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువగా ఉందని, మద్యం అమ్మకాలూ తెలంగాణలోనే ఎక్కువని గుర్తుచేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్న టీఆర్ఎస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మరిచిపోయిందని ఆరోపించారు.
వేల కోట్లు కొల్లగొట్టారు..
విజయ సంకల్ప సభలో గోయల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్లగొట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారన్నారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. రైతుల సంక్షేమాన్ని విస్మరించింది. యువత, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు’’ అని చెప్పారు. పీఎం మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నా టీఆర్ఎస్ సర్కారు వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు.