సారథ్య పర్వం సమాప్తం

ABN , First Publish Date - 2022-01-17T08:29:46+05:30 IST

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీ్‌సను ఓడిన మరుసటి రోజు.. అంటే శనివారం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి బాంబులాంటి వార్త వెలువడింది. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు

సారథ్య పర్వం సమాప్తం

ఖోహ్లీ!  

బీసీసీఐ పెద్దలతో రాజుకున్న వివాదం

టెస్ట్‌ కెప్టెన్‌గా తప్పని రాజీనామా

టీ-20 సారథిగా తప్పుకోవడంతోనే ముసలం

ఆరేళ్లపాటు కెప్టెన్‌గా సక్సెస్‌ 

అనూహ్య నిష్క్రమణ


టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నా..

నిర్ణయం వెంటనే అమల్లోకి

ఆటగాడిగా కొనసాగుతా

కోహ్లీ సంచలన ప్రకటన


కెప్టెన్‌గా విరాట్‌ ఘనతలు

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌జట్లపై ఎక్కువ విజయాలు (7) సాధించిన ఆసియా జట్టు కెప్టెన్‌.

స్వదేశంలో 24.. విదేశాల్లో 16 టెస్టు విజయాలు అందించిన ఏకైక భారత కెప్టెన్‌.

టెస్టు కెప్టెన్‌గా ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోని 

తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఏకైక క్రికెటర్‌.

అత్యధిక డబుల్‌ సెంచరీలు (7) చేసిన ఏకైక కెప్టెన్‌.

టెస్టుల్లో ఎక్కువ పరుగులు (5864) చేసిన భారత కెప్టెన్‌.

 గ్రేమ్‌ స్మిత్‌ (25) తర్వాత ఈ ఫార్మాట్‌లో ఎక్కువ శతకాలు (20) బాదిన రెండో కెప్టెన్‌.


భారత క్రికెట్‌ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌.. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీ్‌సను అందించిన ఖ్యాతి... విదేశాల్లో ఎక్కువ విజయాలు రుచి చూపించిన నాయకుడు.. ఆటలోనే కాదు జట్టును ముందుండి నడిపించడంలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ.. జట్టును కొత్త పుంతలు తొక్కించిన సారథిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లీ... తాజాగా టెస్టు కెప్టెన్సీకి కూడా టాటా చెప్పేశాడు. అందరి అంచనాలకు భిన్నంగా విరాట్‌ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను, క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. నాలుగు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ల సారథ్యానికి దూరమైన కోహ్లీ ఇకనుంచి జట్టులో సభ్యుడు మాత్రమే!


కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీ్‌సను ఓడిన మరుసటి రోజు.. అంటే శనివారం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి బాంబులాంటి వార్త వెలువడింది. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్‌ మీడియాలో అతడు చేసిన ప్రకటనతో క్రీడాలోకం ఉలిక్కి పడింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల కోహ్లీ స్పష్టం చేశాడు. ద్వితీయ శ్రేణితో కూడిన దక్షిణాఫ్రికాపై ఈసారి భారత జట్టు సిరీస్‌ గెలుస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. ఈక్రమంలోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. జట్టును దాదాపు నాలుగేళ్లపాటు నెంబర్‌వన్‌ స్థానంలో ఉంచిన కోహ్లీ.. టీమ్‌ అదే స్థానంలో ఉండగా వైదొలగడం విశేషం. అయితే జట్టులో తిరుగులేని స్థితిలో ఉన్న అతడికి ఇటీవలి ఘటనలు నొచ్చుకునేలా చేశాయి.


గతేడాది టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు అతడు చేసిన ప్రకటన అనేక పరిణామాలకు దారి తీసింది. వన్డేల్లో సారథిగా ఉంటానని స్పష్టంగా చెప్పినా.. బీసీసీఐ బేఖాతరు చేస్తూ రోహిత్‌ను నియమించింది. దీంతో బోర్డుకు, అతడికి మధ్య దూరం ఏర్పడింది. ఇదే క్రమంలో టెస్టు కెప్టెన్‌గా కొనసాగడంలో అర్థం లేదనే ఆలోచన కోహ్లీకి ఏర్పడినట్టు సమాచారం. దీనికి తోడు సఫారీ గడ్డపై టెస్టు సిరీ్‌సను కోల్పోవడం.. ఆటగాడిగానూ ఫామ్‌ అంతంత మాత్రంగానే ఉండడంతో బీసీసీఐ చేత తొలగించుకునేలోపే తానే నిష్క్రమిస్తే మేలని కోహ్లీ భావించినట్టు తెలుస్తోంది. 


నాయకత్వంలో నెంబర్‌వన్‌..

2014-15లో భారత జట్టు ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్‌ మధ్యలోనే ధోనీ టెస్టుల నుంచి వైదొలగడంతో కోహ్లీ తొలిసారిగా జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ విజయాలు సాధిస్తుండడంతో 2017లో వన్డే, టీ20 సారథిగానూ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి జట్టుకు తిరుగులేని నాయకుడిగా కొనసాగుతూ వచ్చాడు. ఈక్రమంలో భారత జట్టు చిరస్మరణీయ విజయాలు అందుకుంది. 2016 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు దాదాపు నాలుగేళ్లపాటు టీమిండియానే టెస్టుల్లో నెంబర్‌వన్‌గా కొనసాగడం అతడి నాయకత్వ ప్రతిభకు  గీటురాయిగా నిలిచింది. ఇక 2018-19లో ఆసీస్‌ గడ్డపై భారత జట్టు తొలిసారిగా సాధించిన టెస్టు సిరీస్‌ విజయం అతడి కెరీర్‌లోనే అత్యంత విలువైనదిగా చెప్పవచ్చు. రెండేళ్ల తర్వాత మరోసారి ఆసీ్‌సను దెబ్బతీసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సలోనూ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.  అలాగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌కు చేరగలిగింది. ఓవరాల్‌గా భారత జట్టు కోహ్లీ ఆధ్వర్యంలో అత్యధికంగా 40 టెస్టు విజయాలు సాధించడం విశేషం. గొప్ప కెప్టెన్ల జాబితాలో అతడికన్నా గ్రేమ్‌ స్మిత్‌ (53), రికీ పాంటింగ్‌ (48), స్టీవ్‌ వా (41) మాత్రమే ముందున్నారు.

 

విరాట్‌ ఏమన్నాడంటే...

‘దాదాపు ఏడేళ్లపాటు అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కెప్టెన్‌గా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేశాను. నిజాయతీగా నా విధులు నిర్వర్తించాను. ఇక చేయాల్సిందేమీ లేదని భావిస్తున్నా. ప్రతి దానికీ ఏదో ఓ దశలో ముగింపు ఉంటుంది. నాకు సంబంధించి టెస్టు కెప్టెన్సీకి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశా. కానీ ఏ రోజూ ప్రయత్న లోపం, నమ్మకం లేకుండా ఆడలేదు. నేను చేసిన ప్రతీ పనిలోనూ 120 శాతం కష్టపడ్డా. ఒకవేళ అలా చేయలేని పక్షంలో కొనసాగడం అనవసరం అని నా భావన. నేనేం చేస్తున్నాననే విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. సుదీర్ఘ కాలంపాటు జట్టును నడిపించే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు. అలాగే నా ఈ చిరస్మరణీయ ప్రయాణంలో సహచరులను కూడా గుర్తు చేసుకోవాల్సిందే. ఇక టెస్టు ఫార్మాట్‌లో జట్టును మరింత ముందుకు తీసుకెళ్లేలా రవిశాస్త్రి, సహాయక సిబ్బంది చేసిన కృషిని మరువలేను. చివరగా నాలో అందరికంటే ముందుగానే నాయకుడిని చూసిన ఎంఎస్‌ ధోనీకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కోహ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.



నీ కళ్లలో నీళ్లు చూశా..

‘2014లో  టెస్టు కెప్టెన్‌ అయ్యానని నీవు చెప్పిన రోజు నాకింకా గుర్తుంది. ఆరోజు ధోనీ, నువ్వు, నేను కలిసి మాట్లాడుకున్నాం. కెప్టెన్‌ అయ్యాక నీ గడ్డం రంగు మారుతుందని ధోనీ జోక్‌ చేశాడు. ఈ ఏడేళ్లలో నీ గడ్డం రంగు మారడం కన్నా నేను నీలో చాలా మార్పు చూశా. ఈ కాలంలో జట్టుకు ఎన్నో విజయాలందించావు. వీటికన్నా వ్యక్తిగా కూడా ఎంతో ఎదిగావు. ఎన్ని సమస్యలు వచ్చినా మంచి నిర్ణయాలే తీసుకున్నావు. కొన్ని ఓటముల తర్వాత నీవు కన్నీళ్లు పెట్టుకోవడం చూశా. గెలిచేందుకు ఇంకా ఏమైనా చేసుండాల్సిందని బాధపడిన రోజుల్లో నీ పక్కనే ఉన్నా. ఈ సుదీర్ఘ సమయంలో నీవు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్‌లో మన పాప చూస్తుంది’ అని విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన లేఖను పోస్ట్‌ చేసింది. ఈ లేఖతో పాటు కోహ్లీకి తాను ముద్దుపెడుతున్న ఫొటోను పోస్ట్‌ చేసింది.



ఎందుకీ పరిస్థితి ? టెస్టు నాయకుడిగా విరాట్‌

మ్యాచ్‌లు విజయాలు ఓటములు డ్రా

  68           40          17         11


నాలుగు నెలల కిందట అంటే.. గత ఏడాది సెప్టెంబరు 16న టీ20 జట్టు కెప్టెన్సీనుంచి వైదొలగనున్నట్టు విరాట్‌ అనూహ్యప్రకటన చేశాడు. టెస్ట్‌లు, భారత్‌లో జరిగే 2023 వన్డే వరల్డ్‌ కప్‌పై దృష్టి నిలిపేందుకు సారథ్య బాధ్యతలను వదులుకుంటున్నట్టు వివరించాడు. ఇక ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల క్రమంలోనే టెస్ట్‌ జట్టు సారథ్యం నుంచి తప్పుకొంటున్నట్టు కోహ్లీ చేసిన ప్రకటనను చూడాలి. ముఖ్యంగా టీ20 నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకోవద్దని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లేముందు విలేకరుల సమావేశంలో విరాట్‌ వెల్లడించడం దుమారం రేపింది. అంతేకాదు..ఈ పర్యటనకు జట్టు ఎంపిక కోసం కేవలం గంటన్నరముందు తనను సంపద్రించినట్టు కోహ్లీ తెలిపాడు. ఆ సందర్భంగా చివర్లో తనను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్న విషయాన్ని చీఫ్‌ సెలెక్టర్‌ చెప్పారని విరాట్‌ తెలిపాడు. అలా చివర్లో చెప్పడం తనను అవమానించినట్టేనన్న అభిప్రాయం విరాట్‌ మాటల్లో వ్యక్తమైంది. ఇక టీ 20 కెప్టెన్‌గా కొనసాగాలని విరాట్‌కు బీసీసీఐ సూచించింది నిజమేనని చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ ఇటీవల వెల్లడించడంతో..బీసీసీఐతో కోహ్లీ విభేదాలపై వస్తున్న ఊహాగానాలు వాస్తవమేనని స్పష్టమైంది.  

      (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)




Updated Date - 2022-01-17T08:29:46+05:30 IST