మాన్యం.. అన్యాక్రాంతం!

ABN , First Publish Date - 2022-08-06T05:26:24+05:30 IST

మందస మండలంలో దేవుడి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాలయ భూముల్లో పూరిళ్లు, పక్కా భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నారు. తోటలు, వరి పంటలు సాగు చేస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

మాన్యం.. అన్యాక్రాంతం!
రట్టి వల్లభ నారాయణస్వామి ఆలయ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు

మందసలో ఆలయ భూముల ఆక్రమణ
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
పంటలు కూడా సాగుచేస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు
(హరిపురం)

- మందసలోని రట్టి వల్లభ నారాయణస్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొంతమంది అక్రమంగా పట్టాలు పొంది.. ఆలయ భూముల్లో  నిర్మాణాలు చేపట్టినా.. అధికారులు స్పందించడం లేదు. అక్రమార్కులకు రాజకీయ నాయకుల అండ ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

- మందస మండలం హొన్నాళి వద్ద గోపినాథస్వామి ఆలయ భూములను కబ్జా చేశారు. జీడి, కొబ్బరి చెట్లు నాటి.. ఆలయానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఏళ్ల తరబడి ఫలసాయం పొందుతున్నారు.  

.. ఇలా మందస మండలంలో దేవుడి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దేవాలయ భూముల్లో పూరిళ్లు, పక్కా భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నారు. తోటలు, వరి పంటలు సాగు చేస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మందస మండలంలో ఎంతో చరిత్ర కలిగిన.. నాటి రాజులు కట్టించిన ఆలయాలు కోకొల్లలు. రఘునాథస్వామి, గోపినాథ స్వామి, జగన్నాథ స్వామి వంటి వందేళ్ల చరిత్రగల ఆలయాలతో పాటు 16కుపైగా పురాతన ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో అరుదుగా కనిపించే వరహస్వామి మందసలో కొలువై ఉండటం ఈ ప్రాంత ప్రజల పుణ్యఫలం. ఈ ఆలయాల పేరుతో సుమారు 350 ఎకరాల పల్లం, మెట్ట భూములున్నాయి. వీటిలో 200 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలకు గురైంది. వీటి విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.10కోట్లుగా అంచనా. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.100 కోట్లుపైమాటే. కేవలం రట్టివల్లభ నారాయణస్వామి ఆలయానికి చెందిన 52 ఎకరాలు ఆక్రమణల్లో ఉంది. మందస నడి బోడ్డున ఉన్న సర్వే నెంబరు 278/2లో 4.67 ఎకరాలు సగానికి పైగా ఆక్రమణకు గురైంది. ఎకరా ధర రూ.50 లక్షల పైమాటే. దీని ప్రకారం రూ.3కోట్ల విలువైన ఆస్తులు అక్రమణల చెరల్లో చిక్కి శల్యమవుతున్నాయి. ఇలా ఆలయ భూములన్నీ అక్రమార్కుల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. అధికారులు కనీసస్థాయిలో స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

దేవాలయం            గ్రామం              ఆక్రమణలో ఉన్న  
                                            భూములు(ఎకరాల్లో)

వరహాస్వామి           మందస                60.06
నరసింహాస్వామి         మందస                37.39
నరసింహాస్వామి        మఖరజోల              11.00
జగన్నాథస్వామి          సాబకోట               22.62
రట్టివల్లభనారాయణస్వామి ఉమగిరి,మందస         52.06
వైద్యనాథ                పిడిమందస             50.27
గోపినాథస్వామి            హోన్నాళి               21.71
రఘునాఽథస్వామి           మందస                17.17
రఘునాఽథస్వామి            సిరిపురం               88.88
రఘునాథస్వామి            భోగాపురం              75.90
రాజగోపాలస్వామి           మందస                 24.96
బాలజీస్వామి                మందస                15.67

ధూపదీపాలే కరువాయే...
కోట్లు ఉన్నా కుబేరుడుకు కూడా కూటికి కరువాయే అన్న చందాన రూ.లక్షలు విలువ చేసే భూములు ఉన్నా.. ఆలయాల్లో కనీసం ధూప దీపారాధన నోచుకోవడం లేదు. పొత్తేశ్వరా, వైద్యనాఽథ, వల్లభనారాయణ, జగన్నాఽథస్వామి వంటి పలు ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి పేరున ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంలో పావు వంతు ఖర్చు చేసినా దేవాలయాలకు పూర్తి శోభను కల్పించవచ్చును. పూజలు, పుణ్య దినాల రోజున తప్ప.. తరువాయి రోజు కనీసం తలుపులు కూడా తీసిన దాఖలాలు లేవు. అర్చకులకు కూడా కనీస ఆదాయం కరువవుతోంది.

కోర్టు కేసులతో సమస్యలు
ఆక్రమణకు గురైన ఆలయ భూములకు సంబంధించి కోర్టు కేసులతోనే సమస్యగా మారింది. మందస పట్టణంలో విలువైన భూమి, గ్రామాల్లో ఉన్న పంట భూమి విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. మఖరజోల వద్ద 11 ఎకరాలు జాతీయ రహదారి విస్తరణలో పోయింది. వీటి ద్వారా రూ.6,12,860 వచ్చింది. ఆ మొత్తం ఆలయం పేరు మీద బ్యాంకులో పదేళ్లుగా మూలుగుతోంది. ఉమాగిరి, సిరిపురం తదితర గ్రామాల నుంచి వచ్చే వరి పంట కౌలు ధాన్యం విక్రయించగా.. వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఆలయాలకు ధూపదీపాల కోసం అందజేస్తున్నాం.
- ప్రభాకరరావు, దేవాదాయ శాఖ అధికారి, మందస

ఇబ్బందులే..
రూ.కోట్లు విలువ చేసే భూములు, లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నా.. పర్యవేక్షణ కరువై ఆలయ అభివృద్ధి తిరోగమనంలో ఉంది. పండగల సమయాల్లో టిక్కెట్ల విక్రయాల ద్వారా వచ్చే డబ్బులతో పూజలు నిర్వహిస్తున్నారు. మిగతా రోజుల్లో మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
- రట్టి సీతారాం, వల్లభనారాయణ స్వామి ప్రధాన అర్చకుడు, రట్టి

 

Updated Date - 2022-08-06T05:26:24+05:30 IST