‘సూక్ష్మ’కు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-10-18T04:31:41+05:30 IST

చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకానికి అంకురార్పణ చేసింది. వికారాబాద్‌ జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నాలుగు మున్సిపాలిటీల్లో సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు చేపట్టారు.

‘సూక్ష్మ’కు ప్రోత్సాహం

  • స్మూక్ష పరిశ్రమల స్థాపనకు చేయూత
  • వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రాజెక్టు పేరిట కొత్త పథకం
  • కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు 
  • ప్రధాన మంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కింద ఆహార పదార్థాల శుద్ధి
  • వ్యక్తిగతంగా రూ.40వేలు, గ్రూపుగా అయితే రూ.1.20లక్షల నుంచి కోటి వరకు రుణం
  • వికారాబాద్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు కార్యాచరణ 


చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం  కొత్త పథకానికి అంకురార్పణ చేసింది. వికారాబాద్‌ జిల్లాలో మెప్మా  ఆధ్వర్యంలో నాలుగు మున్సిపాలిటీల్లో సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు చేపట్టారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఈకొత్త పథకం ద్వారా చేయూత అందించనున్నారు.


తాండూరు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక జిల్లా-ఒకప్రాజెక్టు కింద సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లాలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో నాలుగు మున్సిపాలిటీల్లో సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అధికారులు చర్యలు చేపట్టారు.  శిక్షణ  కార్యక్రమాలను పూర్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఈకొత్త పథకం ద్వారా చేయూతను అందించనున్నారు. ప్రధాన మంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(పీఎంఎ్‌సఎంఎస్‌) పేరిట ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. 

నెలకొల్పే యూనిట్‌ వివరాలు

వికారాబాద్‌ జిల్లాకు వ్యవసాయ అనుబంధ ఆధారాలైన ఉత్పత్తులను కేటాయించారు. వెజిటేబుల్‌ ప్రాజెక్టును తయారు చేసేందుకు అవకాశమిచ్చారు. జిల్లాలో నెలకొల్పబోయే సూక్ష్మ పరిశ్రమలు కూరగాయలతో తయారయ్యే టమాటా, గ్రీన్‌ చిల్లీ, ఉల్లి, క్యారెట్‌, బీన్స్‌, స్వీట్‌ పొటాటోలను తయారు చేయాలి. ఇందులో ఫికిల్స్‌, డీహైడ్రెటెండ్‌ వెజిటేబుల్స్‌, ప్యాక్‌, కట్‌ వెజిటేబుల్స్‌ వంటి వాటిని గుర్తించారు. వీటి ఆధారితంగా చిన్న పరిశ్రమలు నడుపుకునేలా యూనిట్‌లను ఎస్‌హెచ్‌డీలు, ఎంహెచ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండు రకాలుగా యూనిట్లు

ఆహార పదార్థాల శుద్ధి స్కీంలో రెండు రకాలుగా యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యక్తిగత యూనిట్‌,  మైక్రోఫుడ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌(మల్టీ గ్రూపు)యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో వ్యక్తిగత విభాగంలో సీడ్‌ క్యాపిటల్‌ కింద(వ్యక్తిగతం) రూ.40వేలు,  మల్టీ గ్రూప్‌ కింద రూ.1.80లక్షల నుంచి  రూ.20 లక్షల వరకు, రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకు రుణంగా ఇస్తారు. ఆర్థికంగా స్వయం సహాయక సంఘాలు ఎదిగేందుకు పీఎంఎ్‌ఫఎంఎస్‌ స్కీంను రూపొందించారు. ప్రభుత్వం నుంచి ఈ పథకానికి నిధులు సమకూర్చబడతాయి. వ్యయంలో 35 శాతం సాయంగా అందించనుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్దపీట వేయనున్నారు. 35శాతం గ్రాంట్‌ ఇవ్వడంతోపాటు మిగిలిన మొత్తాన్ని కేంద్ర పథకాలు, బ్యాంకుల నుంచి రుణాలుగా ఇప్పించేందుకు ప్రభుత్వం సహకరించనుంది.

జిల్లాకో ప్రత్యేక ఆహార శుద్ధి మండలి

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ప్రత్యేక ఆహార శుద్ధి మండలిని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో కూడా ఆహార శుద్ధి మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కేంద్రాలకు అనుబంధంగా సూక్ష్మ పరిశ్రమలస్థాపన క్షేత్రస్థాయిలో ఉంటుంది. కనిష్టంగా జిల్లాస్థాయిలో 500 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి అంకురార్పణ చేసింది.

సంఘాల వారీగా సర్వే..

మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసే ఆహార పదార్థాల శుద్ధికి చిన్న పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే వారి వివరాలను సేకరించేందుకు సర్వే చేపట్టనున్నారు. ఇందుకు గాను ఒక సీఆర్‌పీని నియమించనున్నారు. సంఘాల వారీగా ఈ సర్వే నిర్వహిస్తారు. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి అనుమతిని ఇచ్చారు.

నియమ నిబంధనలు..

- స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలి.

- 18ఏళ్లు నిండి ఉండాలి.

- పరిశ్రమలపై ఏడాదిపాటు అనుభవం ఉండాలి.

- యూనిట్‌ ఫొటో ఉండాలి.

- లబ్ధిదారుల రెండు ఫొటోలు జతపర్చాలి.

- ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు తప్పనిసరి.

- ట్రేడ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

Updated Date - 2021-10-18T04:31:41+05:30 IST