తిరునల్వేలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2022-03-17T14:35:39+05:30 IST

తిరునల్వేలిజిల్లా కల్లకాడు వద్ద బుధవారం ఉదయం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో తూత్తుకుడికి చెందిన రౌడీ నీరావి మురుగన్‌ హతమయ్యాడు. అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన

తిరునల్వేలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌

                  - రౌడీ నీరావి మురుగన్‌ హతం


చెన్నై: తిరునల్వేలిజిల్లా కల్లకాడు వద్ద బుధవారం ఉదయం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో తూత్తుకుడికి చెందిన రౌడీ నీరావి మురుగన్‌ హతమయ్యాడు. అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై వేటకొడవళ్లతో దాడికి దిగటంతో పోలీసులు ఆత్మరక్షనార్ధం ఎదురు కాల్పులు జరపడంతో అతను మృతి చెందాడు. తూత్తుకుడి జిల్లా పుదియపుత్తూరు సమీపంలోని నీరావిమేడు గ్రామానికి చెందిన నీరావి మురుగన్‌ (45)పై చెన్నై, తూత్తు కుడి, ఈరోడ్‌ జిల్లాల్లో పలు హత్యలు, హత్యాయత్నం, దోపిడీ సహా 30కి పైగా కేసులున్నాయి. మురుగన్‌ కొన్నేళ్ళపాటు చెన్నైలోనే ఉంటూ దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడుతుండేవాడు. 2019లో పోలీసులు అతడిని అరెస్టు చేశా రు. ఆ తర్వాత బెయిలుపై విడుదలైన మురుగన్‌ పరారయ్యాడు. ఇటీవల దిండుగల్‌ జిల్లా పళనిలో జరిగిన ఓ దోపిడీ కేసులో మురుగన్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో దిండుగల్‌ జిల్లా ప్రత్యేక పోలీసు బృందం అతడి ఆచూకీకోసం  గాలించింది. చివరకు తిరునల్వేలి జిల్లా నాంగునేరి సమీపం కల్లకాడు వద్ద నీరావి మురుగన్‌ దాగినట్లు సమాచారం అందింది. దీంతో దిండుగల్‌ ఎస్‌ఐ ఇసక్కిరాజా నేతృత్వంలో ప్రత్యేక దళం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో అక్కడకు చేరు కున్నారు. కల్లకాడు సమీపం సుబ్ర మణ్యపురం బొత్తయ్‌ ప్రాంతంలో దాగి వున్న నీరావి మురుగన్‌ను పోలీసులు చుట్టుముట్టారు. వారిని చూడగానే మురుగన్‌ వేటకొడవళ్లతో దాడికి దిగడంతో ముగ్గురు కానిస్టేబుళ్ళు గాయ పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై మురుగన్‌ను లొంగిపొమ్మని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మురుగన్‌ మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌ విషయం తెలుసుకుని తిరునల్వేలి డీఐజీ ప్రకాష్‌కుమార్‌, ఎస్పీ శరవణన్‌ తదితర అధికారులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. మురుగన్‌ దాడిలో గాయపడిన ముగ్గురు కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మురుగన్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాళయంకోట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.

Updated Date - 2022-03-17T14:35:39+05:30 IST