ఎన్‌కౌంటర్‌ కేసు హైకోర్టుకు బదిలీ!

ABN , First Publish Date - 2022-05-21T09:19:27+05:30 IST

దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారాన్ని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్‌కౌంటర్‌ కేసు హైకోర్టుకు బదిలీ!

అక్కడే విచారించి నిర్ణయించాలని సుప్రీం సీజే జస్టిస్‌ రమణ ఆదేశం

సిర్పుర్కర్‌ నివేదిక రహస్యం కాదు: సీజేఐ

సీల్డ్‌ కవర్‌లో ఉంచాలి: తెలంగాణ

రాష్ట్ర సర్కారు వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారాన్ని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటరని, 10 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన నివేదికను హైకోర్టుకు పంపించింది. శుక్రవారం ఈ కేసుపై జస్టిస్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నివేదికను బహిర్గతం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నివేదిక కాపీలను ఈ కేసులో ఇరుపక్షాలకు పంపించాలని ఆదేశించింది. కమిషన్‌ నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన రోజు నివేదికను బహిర్గతం చేయాలని బాధితుల పక్షం కోరగా న్యాయమూర్తులు నిరాకరించారు. తాజాగా శుక్రవారం విచారణ సందర్భంగా నివేదికను బహిర్గతం చేయాలని నిర్ణయించారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను అప్పట్లో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అప్పటి సీజే జస్టిస్‌ బాబ్డే ఈ ఎన్‌కౌంటర్‌ను బూటకమని స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రతీకారాత్మక న్యాయంతో సమాజం కుప్పకూలుతుందని హెచ్చరించారు. సిర్పుర్కర్‌ నేతృత్వంలో కమిషన్‌ వేశారు. నివేదిక వచ్చాక సుప్రీంకోర్టే విచారణ చేపడుతుందని భావిస్తున్న తరుణంలో కేసును హైకోర్టుకు బదిలీ చేయడం గమనార్హం. శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు.


కమిషన్‌ నివేదికను గోప్యంగా ఉంచాలని కోరారు. ‘‘నివేదికను గోప్యంగా ఉంచలేం. కొంత మందిని కమిషన్‌ దోషులుగా తేల్చింది. తదుపరి చర్యల కోసం ఈ నివేదికను ఇక ప్రభుత్వానికి లేదా హైకోర్టుకు పంపించాల్సి ఉంటుంది. అన్ని పక్షాల వాదనలను విని హైకోర్టు అంతిమ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షించలేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నివేదికను రహస్యంగా ఉంచకపోతే కింది కోర్టు తీర్పుపై దాని ప్రభావం పడుతుందని, కాబట్టి నివేదికను మళ్లీ సీల్‌ చేయాలని, ఆతర్వాత హైకోర్టు తదుపరి విచారణ చేసినా అభ్యంతరం లేదని శ్యామ్‌ దివాన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కూడా దర్యాప్తు జరిపి నివేదిక కూడా ఇచ్చిందని దివాన్‌ ప్రస్తావించారు. 


జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘‘దర్యాప్తు కమిషన్‌ బహిరంగంగా దర్యాప్తు జరిపింది. అందులో అందరూ పాల్గొన్నారు. పూర్తి వివరాలతో కమిషన్‌ నివేదికను సమర్పించింది. తదుపరి చర్యలు ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్న. కమిషన్‌ కూడా కొన్ని సిఫారసులు చేసింది. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లనివ్వండి. నివేదిక పత్రులను మీ అందరికి ఇస్తాం’’ అని వ్యాఖ్యానించింది. నివేదికను బహిర్గతం చేస్తే దాని ప్రభావం కేసును విచారించే న్యాయస్థానంపై ఉంటుందని దివాన్‌ అన్నారు. ‘‘సుప్రీంకోర్టు ఏదైనా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే అది నివేదిక సమర్పిస్తుంది. మరి ఆ నివేదికను కోర్టు ఏం చేయాలి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి దివాన్‌ సమాధానమిస్తూ... గతంలో సుప్రీంకోర్టు కమిటీల నివేదికలను బహిరంగపరచని సందర్భాలు ఉన్నాయన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... ‘‘హైకోర్టే అంతిమ నిర్ణయం తీసుకుటుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.’’ అని వ్యాఖ్యానించింది. అయితే, నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే హైకోర్టుకు పంపించాలని దివాన్‌ కోరారు. ‘‘ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నివేదిక బయటికి రావాల్సిందే కదా? ఇక దర్యాప్తు జరపాలని మేం జారీ చేసిన ఉత్తర్వులకు అర్థమేముంది? నివేదిక వచ్చిందంటే దాన్ని బహిర్గతం చేయాల్సిందే.


ఒకవేళ నివేదికను మీకు ఇవ్వకుంటే హైకోర్టులో ఎలా సమర్థించుకుంటారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని నివేదికను మళ్లీ సీల్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని దివాన్‌ అన్నారు. ‘‘దేశానికి సంబంధించి తీవ్రంగా ప్రభావం చూపే పరిస్థితుల్లో నివేదికను గోప్యంగా ఉంచుతారు. ఇది ఒక ఎన్‌కౌంటర్‌ కేసు. కమిటీ నివేదిక సమర్పించింది. హైకోర్టులో కేసు ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఈ కేసును తదుపరి మేం పరిశీలించే ప్రశ్నే లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళా, మానవ హక్కుల కార్యకర్తల తరఫున సీనియర్‌ న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ వాదిస్తూ... ఆఫ్సా చట్టం కింద మణిపూర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన దర్యాప్తు నివేదికను గతంలో సుప్రీంకోర్టు బహిర్గతం చేసిందని, ఆ కేసులో జాతీయ భద్రత అంశాలు ఇమిడి ఉన్నప్పటికీ నివేదికను బయటపెట్టారని వివరించారు. నివేదికను బహిర్గతం చేసే అంశంపై ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోడానికి 10 నిమిషాల పాటు దివాన్‌కు సమయం ఇచ్చింది. తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత కూడా ప్రభుత్వ వాదనల్లో మార్పు లేదు. దాంతో కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూఽ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది జీఎస్‌ మణిపై ఒక సందర్భంలో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు అనేక రిట్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రచారం కోసమే పిటిషన్లు వేస్తున్నారు. అది మాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-05-21T09:19:27+05:30 IST