నిరుపయోగ భూములు.. వెనక్కు

ABN , First Publish Date - 2021-07-28T05:45:02+05:30 IST

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ఆదాయ గ్రూపు(ఎంఐజీ) లేఅవుట్లు వేసి భూములు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిరుపయోగ భూములు.. వెనక్కు

ఎంఐజీ లేఅవుట్స్‌కి స్థలాల కోసం అన్వేషణ

పట్టణాల్లో నేటి నుంచి రంగంలోకి రెవెన్యూ వర్గాలు

వాపసు తీసుకున్న వాటిని మునిసిపల్‌ వర్గాలకు కేటాయింపు

కలెక్టర్‌కి పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ఆదాయ గ్రూపు(ఎంఐజీ) లేఅవుట్లు వేసి భూములు విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంబంధిత వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించిన వార్డు సచివాలయాల సిబ్బంది వాటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో తొలుత ప్రభుత్వ భూములు ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటిని వెనక్కు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా వాపసు తీసుకున్న భూములపై మునిసిపల్‌ వర్గాలకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇవ్వాలని కలెక్టర్‌ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో గతంలో వివిధ సంస్థలకు కేటాయించి అందుకు వినియోగించని భూములు స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ వర్గాలు చర్యలు చేపట్టబోతోన్నాయి. పేదలందరికి ఇళ్ల పథకం కింద జగనన్న కాలనీల లేఅవుట్లని జిల్లా యంత్రాంగంర వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో లబ్ధిదారుల ద్వారా ఇటీవలే శంకుస్థాపనలు చేయించారు. కాగా వీటికి మధ్యతరగతి వర్గాల నివాస ప్రాంతాలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నది. ఇందుకు కారణం పేదల ఇళ్లకు సమీపంలో ఎంఐజీ ప్రజలు నివాసం ఏర్పరుచుకుంటే పేదలకు పనులు దొరకుతాయనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలు/ఐదు కిలోమీటర్ల దూరం లోపు ఎంఐజీ లేఅవుట్‌లు వేసి విక్రయించాలని ఇటీవలే సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం తొలుత ప్రైవేటు భూములు సేకరించాలని భావించారు. అయితే అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకొని అందులో లేఅవుట్‌లు వేసి విక్రయించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పబ్లిక్‌ సంస్థలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థ, పట్టణ స్థానిక సంస్థలకు గతంలో ఏ అవసరానికి అయితే కేటాయించారో అందుకు వినియోగించనట్లు అయితే వాటిని వెనక్కు తీసుకోవాలని కలెక్టర్‌ని ఆదేశించింది. కాగా దేవదాయ, విద్యాశాఖ, వక్ఫ్‌, చెరువు, నదులు, జలవనరులు, కొండలు, అటవీ, ప్రభుత్వ/కమ్యూనిటీ పోరంబోకు భూములను మాత్రం ఎంఐజీ లేఅవుట్లకు ప్రతిపాదించ వద్దని స్పష్టం చేసింది. కాగా నాలుగు నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ప్రతీ సచివాలయం పరిధిలో 30 నుంచి 40 మంది ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా ఒక్క గుంటూరు నగరంలో 5 వేల నుంచి 6 వేల మంది ఆసక్తి చూపించారు. అలానే నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, రేపల్లె, బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లిలోనూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత రైస్‌కార్డుదారుల్లో కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే రేపటి రోజున రైస్‌కార్డుతో పాటు అన్ని సంక్షేమ పథకాలు కోత పడతాయని తెలియడంతో వారంతా దరఖాస్తులను వెనక్కు తీసుకున్నారు. 


Updated Date - 2021-07-28T05:45:02+05:30 IST